నయవంచన
కాపులకు బాబు ‘మార్క్’ మోసం
కాపు సంక్షేమ నిధి కింద జిల్లాకు రూ.7.38 కోట్లు మాత్రమే విడుదల
దరఖాస్తుదారులందరికీ రుణాలిస్తామని ప్రభుత్వం హామీ
ఒక్కొక్కరికి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల దాకా ఇస్తామని ప్రకటన
ఇప్పుడిస్తోంది రూ.30 వేలు మాత్రమే
మండిపడుతున్న కాపు సంక్షేమ సంఘాలు
(సాక్షి ప్రతినిధి, అనంతపురం) రాయల్ మురళీ కాపు సంక్షేమ కార్పొరేషన్ డెరైక్టర్. ఈయన పంచాయతీ అనంతపురం రూరల్ మండలంలోని నారాయణపురం. కార్పొరేషన్ రుణాల కోసం ఇక్కడొచ్చిన దరఖాస్తులు 379. ఒక్కో దరఖాస్తు ఫీజు రూ.500 వసూలు చేశారు. అంటే 379 మంది నుంచి రూ.1,89,500 రాబట్టారు. ఇక్కడ ఆరుగురికి రూ.30 వేల చొప్పున రుణాలు మంజూరయ్యాయి. అంటే ఆరుగురికి కలిసి ప్రభుత్వమిచ్చేది రూ.1.80 లక్షలు. ఈ ఒక్క ఉదాహరణ చాలు దరఖాస్తు ఫీజు కింద వసూలు చేసిన మొత్తాన్ని కూడా లబ్ధిదారులకు ఇవ్వలేదనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి.
‘నోరు ఒకటి చెబుతుంది...చెయ్యి మరొకటి చేస్తుంది.. దేనిదోవ దానిదే’ అన్నట్లుంది ప్రభుత్వ తీరు. కాపులను బీసీల్లో చేరుస్తామని ఎన్నికలకు ముందు టీడీపీ ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత రిజర్వేషన్ అంశాన్ని పక్కనపెట్టి.. కాపు సంక్షేమ నిధిని ఏర్పాటు చేసింది. దీని ద్వారా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకూ రుణాలు ఇస్తామని ప్రకటించింది. దీనిపై సంతృప్తి చెందని కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల వారు ‘అనంత’తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దీక్ష చేశారు. ఈ దీక్ష సమయంలో కాపు సంక్షేమ నిధికి ఏటా రూ.500 కోట్లు కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు మాత్రం చిల్లర విదిల్చి చే తులు దులిపేసుకుంది.
ఇదీ ‘అనంత’ లెక్క
జిల్లా వ్యాప్తంగా 17,749 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 2,462 మందికి రుణాలు ఇస్తున్నట్లు కాపు సంక్షేమ కార్పొరేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. అనంతపురం కార్పొరేషన్ పరిధిలో 117 మందికి మాత్రమే రుణాలు మంజూరు చేశారు. ఒక్కో లబ్ధిదారునికి రూ.30 వేలు మాత్రమే సబ్సిడీ ఇస్తామని ప్రభుత్వం తేల్చిచెప్పింది. అంటే రూ.30వేలు సబ్సిడీ ఇస్తే..మరో రూ.30 వేలు బ్యాంకు రుణం లభిస్తుంది. ఈ డబ్బు ఇచ్చేందుకు ప్రతి లబ్ధిదారుడు మొదటగా బ్యాంకులో రూ.లక్ష నుంచి రూ.1.50లక్షల దాకా డిపాజిట్ చేయాలి. అలాంటి వారికే బ్యాంకర్లు రుణాలు ఇస్తారు. అంటే ప్రభుత్వం ఇచ్చే రూ.30 వేల కోసం రూ.1.50లక్షలు ముందస్తుగా డిపాజిట్ చేయాలన్నమాట. లబ్ధిదారుడు వాయిదాల పద్ధతిలో 18 నెలల్లో రూ.30వేలు తిరిగి చెల్లించాలి. ఈ 18 నెలలకు రూ.1.50 లక్షలకు రూ.2 ప్రకారం వడ్డీ వేసుకున్నా రూ.54 వేలు అవుతుంది. దీన్నిబట్టి చూస్తే ప్రభుత్వం కాపుల సంక్షేమంపై ఏమేరకు చిత్తశుద్ధి ప్రదర్శిస్తోందో, ఇచ్చే రుణాలు ఏమాత్రం వారి ఆర్థిక పరిపుష్టికి దోహదం చేస్తాయో ఇట్టే తెలుస్తోంది. బుధవారం కాపు రుణాలపై ప్రకటన రాగానే ఆ వర్గం ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రభుత్వం నిలువునా మోసం చేసిందని మండిపడుతున్నారు.
రైతుల లాగే మమ్మల్ని మోసగించారు - బళ్లారి వెంకట్రాముడు, రాయలసీమ బలిజ మహాసంఘం అధ్యక్షుడుప్రభుత్వం రైతులను ఎలా మోసం చేసిందో కాపు, బలిజ, తెలగ, ఒంటరికులాలను కూడా అదేస్థాయిలో వంచించింది. దరఖాస్తు చేసుకున్న వారందరికీ రుణాలు ఇస్తామని ప్రకటించి, ఇప్పుడు అతితక్కువ మందికి మాత్రమే మంజూరు చేస్తున్నారు. దరఖాస్తుల కోసం వసూలు చేసిన డబ్బుకు సరిపడ రుణాలు కూడా ఇవ్వలేదు. చిల్లర విదిల్చినట్లు రూ.30 వేలు మాత్రమే ఇస్తోంది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉద్ధృతం చేస్తాం.