అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం అమరావతి మాస్టర్ ప్లాన్‌పై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. విజయదశమికి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు వెల్లడించారు. అమరావతి, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాలు సౌభాగ్యం, సంతోషాలకు సూచికలన్నారు. అలాగే ఆగస్ట్ 15కల్లా డిజైన్లు అందించాలని పోస్టర్స్ బృందానికి ముఖ్యమంత్రి సూచనలు చేశారు.
అనంతరం మంత్రి నారాయణ సమీక్ష వివరాలను మీడియాకు వివరించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 31 నుంచి అసెంబ్లీ, అక్టోబర్ 15 నుంచి హైకోర్టు, నవంబర్ మొదటి వారంలో సచివాలయం నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. రాజధాని మొత్తం కనిపించేలా 500 మీటర్ల ఎత్తులో టవర్ నిర్మాణం, హెచ్‌వోడీ కార్యాలయాలు, సచివాలయం ఒకే క్యాంపస్‌లో ఉంటాయన్నారు.
కాగా రాష్ట్ర రాజధాని పరిపాలనా నగరంలో శాసనసభ సముదాయానికి వజ్రాకృతి (డైమండ్), హైకోర్టు భవన సముదాయానికి స్తూపాకృతి(పిరమిడ్) డిజైన్లు ఖరారయ్యాయి. గతంలో శాసనసభ సముదాయానికి స్తూపాకృతిని రూపొందించినా తాజాగా దాన్ని వజ్రాకృతికి మార్చారు.
నార్మన్ ఫోస్టర్ సంస్థ హైకోర్టు కోసం రూపొందించిన వజ్రాకార భవన డిజైన్‌ను అసెంబ్లీ భవనాలకు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి సూచించిన విషయం తెలిసిందే. లండన్ నుంచి వచ్చిన రాజధాని మాస్టర్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ సంస్థ ప్రతినిధులు నిన్న విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో తాము రూపొందించిన డిజైన్లపై ప్రజెంటేషన్ ఇచ్చారు. పరిపాలనా నగరం తుది డిజైన్లను ప్రభుత్వానికి సమర్పించారు.