ఒంగోలు, న్యూస్‌లైన్ : సీమాంధ్రలో నిర్వహిస్తున్న సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అణచివేస్తున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ విమర్శించారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు ఎన్జీఓలు, ఉద్యోగులపై ఒత్తిడి పెంచి వారితో సమ్మెను విరమింపజేశారన్నారు. సమైక్యవాదినని చెప్పుకుంటూనే రాష్ట్ర విభజనకు అనుకూలంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని, కాంగ్రెస్ అధిష్టానం చెప్పుచేతల్లో పనిచేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక వైఎస్‌ఆర్ సీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్జీఓలు, ఉద్యోగ జేఏసీలు, ఆర్టీసీ కార్మికులు ఎంతో చిత్తశుద్ధితో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నిర్వహించారని అభినందించారు. ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చర్చల పేరుతో ఉద్యమాన్ని నీరుగార్చారని విమర్శించారు. ఉద్యోగులతో బలవంతంగా సమ్మెను విరమింపజేయించారన్నారు. తాను సమైక్యవాదినంటూ గొప్పలు చెప్పుకున్న ముఖ్యమంత్రి.. ఉద్యమంపై నీళ్లుచల్లి అధిష్టానం భజనచేస్తూ సీమాంధ్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
అంతేగాకుండా సమైక్య రాష్ట్రం కోసం వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్‌లో నిర్వహించతలపెట్టిన సమైక్య శంఖారావం సభను సైతం అడ్డుకునేందుకు యత్నించారని బాలాజీ పేర్కొన్నారు. శాంతిభద్రతల సమస్య పేరుతో పోలీస్‌శాఖ ద్వారా సభ కు అనుమతి రాకుండా సీఎం చే సిన ప్రయత్నాలు ఫలించలేదన్నారు. రాష్ట్ర విభజన జరిగితే రెండు ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతోనే జగన్‌మోహన్‌రెడ్డి జైలులో ఉండి ఒకసారి, బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత మరోసారి ఆమరణదీక్షలు చేపట్టారన్నారు. సమైక్యాంధ్ర కోసం ఇప్పటివరకు తమ పార్టీతోపాటు సీపీఎం, ఎంఐఎం లాంటి పార్టీలు ముందుకు వచ్చాయన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా ఢిల్లీలో కాలంవెళ్లదీయకుండా అత్యవసరంగా అసెంబ్లీని సమావేశపరిచేందుకు వైఎస్‌ఆర్ సీపీ బాటలో నడవాలని హితవుపలికారు. అసెంబ్లీలో సమైక్య తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించేందుకు కలిసి రావాలన్నారు. అదే విధంగా సమైక్యాంధ్ర కోసం ఈ నెల 26వ తేదీన హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో వైఎస్‌ఆర్ సీపీ నిర్వహించతలపెట్టిన సమైక్య శంఖారావానికి జిల్లావ్యాప్తంగా ఎన్జీఓలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, రైతులు తరలిరావాలని బాలాజీ పిలుపునిచ్చారు. సమైక్య శంఖారావాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. విలేకర్ల సమావేశంలో పార్టీ గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకటేశ్వరరావు, ఒంగోలు నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్, యువజన విభాగం జిల్లా కన్వీనర్ వై.వెంకటేశ్వరరావు, ప్రచార విభాగం జిల్లా కన్వీనర్ వేమూరి సూర్యనారాయణ, వివిధ విభాగాల నగర కన్వీనర్లు ముదివర్తి బాబూరావు, కావూరి సుశీల తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమాన్ని అణచివేస్తున్న సీఎం
Published Sat, Oct 19 2013 7:06 AM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM
Advertisement