హరితాంధ్రకు పంచశీల | CM YS Jagan plan on Flood water Consumption | Sakshi
Sakshi News home page

హరితాంధ్రకు పంచశీల

Published Mon, May 4 2020 4:30 AM | Last Updated on Mon, May 4 2020 4:30 AM

CM YS Jagan plan on Flood water Consumption - Sakshi

సాక్షి, అమరావతి: సముద్రంలో కలుస్తున్న గోదావరి, కృష్ణా, వంశధార వరద జలాలను గరిష్టంగా వినియోగించుకోవడం ద్వారా రాష్ట్రాన్ని హరితాంధ్రగా మార్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పంచశీల ప్రణాళికను రూపొందించారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేయడంతోపాటు 13 జిల్లాల సమగ్రాభివృద్ధికి దోహదం చేసేలా కొత్త వాటికి రూపకల్పన చేశారు. ఈ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు సుమారుగా రూ.66,519 కోట్లు అవసరమని జలవనరుల శాఖ అంచనా వేసింది. నిధుల కొరత తలెత్తకుండా ఐదు స్పెషల్‌ పర్పస్‌ వెహికల్స్‌ (ఎస్పీవీ) ఏర్పాటు చేసి జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకే రుణాలు తీసుకుని ప్రాజెక్టులను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ దిశానిర్దేశం చేశారు. 

ధాన్యాగారం పేరును శాశ్వతం చేసేలా..
ప్రస్తుత నీటి సంవత్సరంలో జూన్‌ 1 నుంచి ఇప్పటిదాకా ప్రకాశం బ్యారేజీ నుంచి 798.29 టీఎంసీల కృష్ణా వరద జలాలు, ధవళేశ్వరం నుంచి 3782.48 టీఎంసీల గోదావరి జలాలు, గొట్టా బ్యారేజీ నుంచి 119.89 టీఎంసీల వంశధార జలాలు వెరసి 4,700.66 టీఎంసీలు కడలిలో కలిశాయి. గత ప్రభుత్వం ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పెంచకపోవడం, నిర్మాణంలో ఉన్నవాటిల్లో మిగిలిన పనులను పూర్తి చేయకపోవడం వల్ల వరద జలాలను ఒడిసి పట్టలేని దుస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను శరవేగంగా పూర్తిచేయడంతోపాటు వరదను గరిష్ట స్థాయిలో వినియోగించుకునేలా కొత్త ప్రాజెక్టులు చేపట్టి దేశ ధాన్యాగారంగా ఆంధ్రప్రదేశ్‌ పేరును సుస్థిరం చేయాలని సీఎం జగన్‌ సంకల్పించారు.

ఎస్పీవీలు వీటి కోసమే..
రాయలసీమ కరవు నివారణ ప్రణాళిక కింద 28 ప్రాజెక్టులు, ఉత్తరాంధ్ర నీటిపారుదల పథకం కింద 2, కృష్ణా–కొల్లేరు సెలైనిటీ మిటిగేషన్‌(చౌడు నివారణ) ప్రణాళిక కింద 7, పల్నాడు కరవు నివారణ ప్రణాళిక కింద 4, రాష్ట్ర సమగ్ర నీటిపారుదల అభివృద్ధి పథకం ద్వారా 2 ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఐదు ఎస్పీవీలను ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ నుంచి ఆమోదం లభించగానే ఎస్పీవీల సారధ్యంలో కొత్త ప్రాజెక్టుల పనులకు శ్రీకారం చుట్టనున్నారు.

ఎస్పీవీల సమగ్ర స్వరూపం ఇదీ..
► శ్రీశైలానికి వరద వచ్చే 40 రోజుల్లోనే రాయలసీమ ప్రాజెక్టులను నింపి ఆయకట్టుకు అందించడం ద్వారా దుర్భిక్షాన్ని  తరిమికొట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలో రూ.27,360 కోట్లతో 28 ప్రాజెక్టులను రాయలసీమ కరవు నివారణ ప్రణాళిక కింద చేపట్టనున్నారు.
► రాయలసీమ డ్రౌట్‌మిటిగేషన్‌ ప్రాజెక్ట్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఆర్‌డీఎంపీసీఎల్‌) ఏర్పాటు ద్వారా నిధులు సమకూర్చుకునేలా జలవనరుల శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
► పల్నాడు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం కోసం వరికపుడిశెల ఎత్తిపోతల–1, వరికపుడిశెల ఎత్తిపోతల–2, వైఎస్సార్‌ పల్నాడు ఎత్తిపోతల పథకం–1, వైఎస్సార్‌ పల్నాడు ఎత్తిపోతల పథకం–2లను రూ.7,770 కోట్లతో చేపట్టేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. పల్నాడు డ్రౌట్‌ మిటిగేషన్‌ ప్రాజెక్ట్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (పీడీఎంపీసీఎల్‌) ద్వారా నిధులు సమకూర్చుకుంటారు.
► గోదావరిలో 63.20 టీఎంసీల వరద జలాలను మళ్లించి ఎనిమిది లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసేలా ఉత్తరాంధ్ర సుజలస్రవంతి ప్రాజెక్టు, తాండవ ప్రాజెక్టు కింద ఆయకట్టు  స్థిరీకరణకు ఎత్తిపోతల పథకం కోసం రూ.15,988 కోట్లు అవసరం. ఉత్తరాంధ్ర ఇరిగేషన్‌ ప్రాజెక్ట్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(యూఐపీడీసీఎల్‌) ద్వారా నిధులు సేకరిస్తారు.
► సముద్రం నీరు ఉబికి రావడంతో కృష్ణా డెల్టా, కొల్లేరు చౌడు బారి దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రకాశం బ్యారేజీకి దిగువన కృష్ణా నదిపై రెండు బ్యారేజీలు, ముక్త్యాల ఎత్తిపోతల, ఉప్పుటేరుపై రెండు ప్రాంతాల్లో క్రాస్‌ రెగ్యులేటర్‌ కమ్‌ బ్రిడ్జి కమ్‌ లాక్‌ల నిర్మాణం, పడతడికపై స్ట్రెయిట్‌ కట్‌ ఫోర్షన్‌ వద్ద రెగ్యులేటర్‌ నిర్మాణం, పెదలంక మేజర్‌ డ్రెయిన్‌కు అవుట్‌ ఫాల్‌ స్లూయిజ్‌ నిర్మాణం ద్వారా చౌడు బారకుండా నివారిస్తారు. ఈ ఏడు ప్రాజెక్టులు చేపట్టడానికి రూ.3,299 కోట్లు అవసరం. కృష్ణా, కొల్లేరు సెలైనిటీ మిటిగేషన్‌ ప్రాజెక్ట్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(కేకేఎస్‌ఎంపీసీఎల్‌) ద్వారా నిధులు సమీకరిస్తారు.
► గోదావరి వరద జలాలను గరిష్టంగా వినియోగించుకునేందుకు పోలవరం కుడి కాలువ సామర్థ్యాన్ని 50 వేల క్యూసెక్కులకు పెంచడంతోపాటు జలాశయం నుంచి కుడి కాలువకు నీటిని సరఫరా చేసే జంట సొరంగాల సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించారు. ఈ నీటిని కృష్ణా డెల్టా, నాగార్జున సాగర్‌ కుడి కాలువ ఆయకట్టు, పల్నాడు, రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు ప్రాంతాలకు అందించనున్నారు. ఇందుకు రూ.12,102 కోట్లు అవసరం కాగా ఆంధ్రప్రదేశ్‌ సమగ్ర నీటిపారుదల అభివృద్ధి కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఏపీఐఐడీపీఎల్‌) ద్వారా నిధులు సమకూర్చుకుంటారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement