సాక్షి, అమరావతి: ‘వైఎస్సార్ రైతు భరోసా’ అమలులో ఎదురవుతున్న సమస్యల పరిష్కారం కోసం ఈనెల 9వ తేదీన మండల, డివిజన్, జిల్లా కేంద్రాల వారీగా ప్రత్యేకంగా ‘స్పందన’ కార్యక్రమం నిర్వహించాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. రెండో శనివారం సెలవు రోజు అయినప్పటికీ అన్నదాతల విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రైతు భరోసాకి సంబంధించి సందేహాలను తీర్చాలని..అర్హులైన ఏ ఒక్కరికీ పథకం ద్వారా లబ్ధి చేకూరలేదనే విమర్శలు రాకుండా చూడాలని సూచించారు. రైతులు, కౌలు రైతుల సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేశారు. నవరత్నాలలో భాగంగా చేపట్టిన వైఎస్సార్ రైతు భరోసా పథకం అమలుపై బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
మరో 5 లక్షల మందికి ప్రయోజనం?
అర్హులైనప్పటికీ భూ యజమానులైన కొందరు రైతులకు రైతు భరోసా పథకం వర్తింపజేయడంలో సమస్యలు ఏమిటని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ప్రశ్నించారు. ఆధార్ కార్డు కాపీలు సమర్పించకపోవడం, వెబ్‌ల్యాండ్‌లో నంబర్లు సరిగా లేకపోవడం, పట్టాదారు పాస్ పుస్తకంలో ఉన్న బ్యాంకు ఖాతాలు ఆధార్ సీడింగ్ కాకపోవడం తదితర కారణాలతో అర్హులైనప్పటికీ కొందరు రైతులకు రైతు భరోసా పథకాన్ని వర్తింప చేయలేకపోయినట్లు అధికారులు వివరించారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్ స్పందిస్తూ అర్హులైన ఏ ఒక్క రైతుకుగానీ కౌలు రైతుకు గానీ రైతు భరోసా పథకం అందలేదన్న విమర్శ ఉండకూడదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే సమస్యలను పరిష్కరించేందుకు శనివారం ప్రత్యేకంగా రైతు భరోసా పథకంపై స్పందన కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. దీని ద్వారా కనీసం మరో 5 లక్షల మంది భూ యజమానులైన రైతులకు రైతు భరోసా పథకం వర్తిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇప్పటిదాకా 40,84,738 మందికి లబ్ధి
అక్టోబర్ 15వతేదీ నుంచి ఇప్పటివరకు రూ.3,256.41 కోట్లను 40,84,738 మంది రైతులు, కౌలు రైతుల ఖాతాలకు జమ చేసినట్టు అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తెలిపారు. ఈనెల 15లోగా మరో 2.99 లక్షల మంది దేవదాయ, ఈనాం, అటవీ భూములు, సర్వే చేయని భూములను సాగు చేసుకుంటున్న కౌలు రైతులు, గిరిజనులకు కూడా రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించేలా చర్యలు చేపట్టినట్టు వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. చనిపోయిన రైతుల కుటుంబాలకు కూడా సాయం అందిస్తున్నట్టు వివరించారు. ప్రతి గ్రామంలో రైతు భరోసా లబ్దిదారులతో పాటు తిరస్కరించిన వారి జాబితాను కూడా ప్రదర్శించి అభ్యంతరాలను స్వీకరిస్తున్నట్టు తెలిపారు.
సందేహాల నివృత్తికి హెల్ప్‌లైన్
రబీ సీజన్ ఇప్పుడే మొదలు కావడం.. రైతులు, కౌలు రైతుల్లో అవగాహన పెరిగి ఇప్పడిప్పుడే సాగు ఒప్పందాలు చేసుకుంటున్నందున కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందించే గడువును డిసెంబర్ 15 వరకు పెంచాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. సాధారణ రైతులకు నవంబర్ 15లోగా రైతు భరోసా సాయాన్ని అందించాలన్నారు. రైతుల సందేహాలను తీర్చేందుకు ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, సీఎం ముఖ్య కార్యదర్శి (రాజకీయ) ప్రవీణ్ ప్రకాశ్, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి కె.ధనుంజయ్‌రెడ్డి, సీఎం సలహాదారు, నవరత్నాల అమలు కమిటీ ఉపాధ్యక్షుడు శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment