సాక్షి, అమరావతి: కోవిడ్–19 కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సూక్ష్మస్థాయిలో చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. కంటైన్‌మెంట్‌ను మరింత పటిష్టంగా, కఠినంగా అమలుచేయడం ద్వారా వ్యాధి వ్యాప్తిని నివారించాలన్నారు. కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రతి వీధి చివర్లో నిత్యావసరాలు అందుబాటులో ఉంచాలని.. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే పాసు ఇచ్చి నిత్యావసరాలకు ఆ వ్యక్తిని మాత్రమే అనుమతించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. డయాలసిస్ లాంటి చికిత్సలకు ఇబ్బందులు రాకుండా చూడాలని, అలాగే.. అత్యవసర సేవలకు సమస్యల్లేకుండా చూడాలని కూడా ఆయన ఆదేశించారు. కోవిడ్–19 నివారణ చర్యలతో పాటు కర్నూలు, గుంటూరు జిల్లాల్లో వైరస్ వ్యాప్తిని నిరోధించడంపై ఎటువంటి చర్యలను చేపట్టాలనే అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో అధికారులు వెల్లడించిన అంశాలు, ముఖ్యమంత్రి ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి..
క్యాంపు కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
కర్నూలు, గుంటూరుల్లో ఒకట్రెండు ప్రాంతాల్లోనే..
► కర్నూలు, గుంటూరు నగరాల్లోని అన్ని ప్రాంతాలకూ కరోనా విస్తరించలేదని.. ఒకట్రెండు ప్రాంతాలకే పరిమితమైందని ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని వివరించారు.
► దీంతో ఇక్కడ వైరస్ కట్టడికి సూక్ష్మస్థాయిలో అనుసరించాల్సిన విధానాలపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.
► ఈ ప్రాంతాల్లోని ప్రతి వీధి చివర్లో నిత్యావసరాలు అందుబాటులో ఉంచాలని.. కుటుంబంలో ఒక వ్యక్తికి మాత్రమే పాసు ఇచ్చి అతనిని మాత్రమే కొనుగోళ్లకు అనుమతించాలని సీఎం ఆదేశించారు.
► కేసుల తీవ్రత అధికంగా ఉన్న నంద్యాలపై కూడా ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు.
► డయాలసిస్ లాంటి చికిత్సలు అవసరమైన వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని చెప్పారు.
► కోవిడ్ ఆస్పత్రులుగా కొన్నింటిని ప్రకటించినందున అక్కడ అందించే రోజువారీ సేవలను వేరే ఆస్పత్రులకు మార్చామని అధికారులు వివరించారు.
► రోగులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండడానికి ఆ సేవలను ఎక్కడకు మార్చామో కూడా వారికి సమాచారం ఇస్తున్నామన్నారు. అలాగే, ఎమర్జెన్సీ సేవలు అవసరమైన వారికి ఇబ్బందుల్లేకుండా కూడా చూస్తున్నామని వారు చెప్పారు.
► అంతేకాక.. వైద్యం కోసం టెలిమెడిసిన్‌ను సంప్రదిస్తున్న వారి సంఖ్య బాగా పెరిగిందని.. ఇప్పటివరకు 8,395 మంది దీని ద్వారా డాక్టర్లను సంప్రదించారని, వీరికి మందులు కూడా పంపిస్తున్నామని అధికారులు వివరించారు.
► దీనిపై సీఎం వైఎస్ జగన్ స్పందిస్తూ.. టెలిమెడిసిన్ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలుచేయాలని ఆదేశించారు.
► ఇందులో భాగంగా.. డీఆర్డీఓ ద్వారా మొబైల్ ల్యాబ్‌ను ఏర్పాటుచేసుకోవాలని కూడా ఆయన సూచించారు.
► వలస కూలీలు, వివిధ క్యాంపుల్లో ఉన్న వారిని పరీక్షించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు ఈ సందర్భంగా వివరించారు. సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రులు బొత్స, కన్నబాబు, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక సీఎస్ జవహర్ రెడ్డి పాల్గొన్నారు.
పంటల ధరలు, మార్కెటింగ్‌పై దృష్టి
► టమోటా, ఉల్లి, చీనీ (బత్తాయి) పంటలు సహా ఇతర ఉత్పత్తుల మార్కెటింగ్, ధరలపై దృష్టిపెట్టాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
► రైతుబజార్లను వీలైనంత ఎక్కువగా వికేంద్రీకరించాలని.. రైతుల నుంచి కొనుగోలు చేసిన ఉత్పత్తులు వీటి అందుబాటులోకి తీసుకురావాలని కూడా వైఎస్ జగన్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment