ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు ఇప్పటి వరకు సంతృప్తికరంగా ఉన్నప్పటికీ పట్టణ ప్రాంతాల నుంచే ఎక్కువగా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. అక్కడ మరిన్ని పటిష్ట చర్యలు తీసుకోవాలి.
ప్రతి నియోజకవర్గంలో క్వారంటైన్ సదుపాయం వద్ద ఒక వైద్య బృందం ఉంటుంది. ఇళ్లలో ఉండడానికి ఇష్టం లేని వారు నేరుగా క్వారంటైన్‌కు రావొచ్చు. జిల్లాల్లో క్వారంటైన్ కోసం 16,723 పడకలు ఇప్పటికే ఏర్పాటు చేశాం. వీటి సంఖ్యను పెంచాలి.
దాదాపు 5 వేల మంది రాష్ట్రంలోని వివిధ సెంటర్లలో ఉన్నారు. వీరందరికీ తిండిలేదు.. సదుపాయాలు లేవనే మాట రాకూడదు. రోజూ ఒకే ఆహారం కాకుండా మెనూ మార్చి ఇవ్వాలి. సబ్బులు, దుప్పట్లు అన్నీ సమకూర్చాలి. సరిహద్దుల్లో ఉన్న మన వాళ్లను కూడా ఇదే రకంగా చూసుకోవాలి. ప్రతి షెల్టర్ వద్ద అక్కడే ఉండేలా ఒక రెసిడెంట్ అధికారిని పెట్టాలి.
సాక్షి, అమరావతి: పట్టణ ప్రాంతాల్లో కరోనా వైరస్ నియంత్రణకు ప్రతి ఇంటినీ జల్లెడ పట్టాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రతి ఇంటిలోని వారి ఆరోగ్య స్థితిగతులపై రెండు దశల్లో ప్రతి రోజూ సర్వే చేయించాలని స్పష్టం చేశారు. కరోనా వైరస్ పూర్తిగా అదుపులోకి రావాలంటే మరిన్ని గట్టి చర్యలను తీసుకోవాలని సూచించారు. కరోనా నియంత్రణలో భాగంగా ఆసుపత్రులు సిద్ధం చేయడం, ప్రతి జిల్లాలో 5 వేల క్వారంటైన్ బెడ్స్ ఏర్పాటు దిశగా అడుగులు, వ్యవసాయ, అనుబంధ రంగాల కార్యకలాపాల కొనసాగింపు, వృద్ధాశ్రమాలు, అనాథలకు నిత్యావసరాల పంపిణీ, రబీ ధాన్యం కొనుగోళ్లు, రేషన్ పంపిణీ తదితర అంశాలపై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీవోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గ్రామ, వార్డు వలంటీర్లు, సచివాలయాల సిబ్బంది, డాక్టర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, పోలీసు సిబ్బంది సమష్టిగా పని చేస్తున్నారని సీఎం ప్రశంసించారు. ఇదే సమయంలో లాక్‌డౌన్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని, లేకపోతే దాని ఉద్దేశం నెరవేరదని చెప్పారు. ఈ సమీక్షలో ముఖ్యమంత్రి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
క్రిటికల్ కేసుల కోసం ప్రత్యేక ఆసుపత్రులు
వైరస్ సోకిన వారిలో దాదాపు 5 శాతం కేసులు సంక్లిష్టంగా మారే అవకాశాలు ఉన్నాయి. విశాఖలో విమ్స్, కృష్ణా జిల్లాలో సిద్దార్థ ప్రభుత్వ ఆసుపత్రి, నెల్లూరులో జీజీహెచ్, తిరుపతిలో పద్మావతి (స్విమ్స్) ఆస్పత్రుల్లో క్రిటికల్ కేర్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ జిల్లాలకు చెందిన కలెక్టర్లు వీటిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ప్రస్తుతం ఈ నాలుగు ప్రధాన ఆస్పత్రుల్లో ఉన్న 1,370 బెడ్లను 1,680కు పెంచుతున్నాం. వెంటిలేటర్లతో కూడిన బెడ్ల సంఖ్యను 148 నుంచి 444కు పెంచుతున్నాం.
జిల్లాల్లో ప్రత్యేక ఆసుపత్రులు
కరోనా సోకిన దాదాపు 15 శాతం కేసులు ఆస్పత్రుల్లో చేర్పించాల్సి ఉంటుంది. ఇందు కోసం జిల్లాల వారీగా ఆసుపత్రులను, సౌకర్యాలను పెంచుతున్నాం. మొత్తమ్మీద ఈ ఆస్పత్రుల్లో నాన్ ఐసీయూ బెడ్ల సామర్థ్యాన్ని 6,762 నుంచి 8,050కి పెంచుతున్నాం. అలాగే ఐసీయూ బెడ్లను 336 నుంచి 515కు పెంచుతున్నాం. ఇవి పూర్తిగా కోవిడ్ పాజిటివ్ వారికి సేవలు అందిస్తాయి. కలెక్టర్లు ఈ ఆస్పత్రులను స్వయంగా పర్యవేక్షించాలి. ఒక్కో ఆస్పత్రికి ఒక్కో ప్రత్యేకాధికారిని నియమించాలి.
జాగ్రత్తలతో వ్యవసాయ కార్యకలాపాలు
► అన్ని జాగ్రత్తలతో మనిషికి మనిషికి మధ్య కనీసం మీటరు భౌతిక దూరం పాటిస్తూ మధ్యాహ్నం ఒంటి గంట వరకు వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాలన్నీ కొనసాగించాలి. ఆ తర్వాత వలంటీర్లు, వైద్య సిబ్బంది సర్వేకు అందుబాటులో ఉండాలి. నిల్వ చేయలేని పంటల విషయంలో రైతులకు సమస్యలు రాకూడదు. వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులు దీనిపై దృష్టి పెట్టాలి.
► ధాన్యానికి మంచి రేటు రావాలి. మిల్లర్లు అందరికీ గట్టిగా చెప్పాలి. కలెక్టర్లు, మార్కెటింగ్ , పౌరసరఫరాల అధికారులు దీనిపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలి.
► వ్యవసాయ ఉత్పత్తుల తరలింపు మీద, గూడ్స్ మీద ఆంక్షలు పెట్టకూడదు. సరుకుల రవాణాను అడ్డుకోవద్దని స్పష్టంగా చెబుతున్నా. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. దిగువ స్థాయి పోలీసుల వరకూ ఈ సమాచారం వెళ్లాలి.
► అంపెడా ప్రకటించిన రేట్ల ప్రకారం ఆక్వా ఎగుమతిదారులు కొనుగోలు చేసేలా చూడాలి. గ్రామ సచివాలయాల్లో ఈ రేట్లను ప్రదర్శించాలి. కాల్‌సెంటర్ నంబర్ కూడా ఇవ్వాలి.
ఎక్కువ ధరలకు అమ్మితే కఠిన చర్యలు
► వచ్చే 15 రోజులకు నిత్యావసరాల వస్తువుల ధరలు ప్రతి జిల్లాలో, ప్రతి దుకాణం వద్ద ప్రదర్శించాలి. ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలి. సూపర్ మార్కెట్లలో కూడా ఇవే ధరలకు అమ్మాలి. ఎక్కువ ధరకు విక్రయిస్తే ఫిర్యాదు చేయాల్సిన కాల్ సెంటర్ నంబర్ కూడా ఆ బోర్డులో ఇవ్వాలి. ఇది అమలు చేయాల్సిన బాధ్యత మున్సిపల్ కమిషనర్‌దే.
► రైస్, పప్పు, ఆయిల్ మిల్లులు, ఫుడ్ ప్రాసెసింగ్, కోల్డ్ స్టోరేజీలు, వేర్ హౌసింగ్‌లు పని చేయించడానికి అవకాశం ఇవ్వాలి. తగిన జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి.
► వృద్ధ, అనాథ ఆశ్రమాలకు నిత్యావసరాలను అందించాలి. 1వ తేదీ నుంచి పెన్షన్లు డోర్ డెలివరీ చేయాలి. వలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలకు మాస్కులు అందించాలి. రేషన్ దుకాణాల వద్ద మనిషికి మనిషికి మధ్య భౌతిక దూరం కచ్చితంగా పాటించాలి. అవసరమైతే దుకాణాల సంఖ్యను పెంచే అవకాశాలను పరిశీలించాలి.
► వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు కన్నబాబు, బొత్స, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలంసాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ గౌతం సవాంగ్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇలా చేద్దాం
► విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు జనసాంద్రత ఎక్కువగా ఉండటంతో అర్బన్ ప్రాంతాల్లో వైరస్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు ఈ సమయంలో ముఖ్య పాత్ర పోషించాలి.
► రెండు రకాల బృందాలతో కోవిడ్–19 నివారణ చర్యలను పటిష్టంగా చేపట్టాలి. మొదటి దశ బృందంలో వార్డు వలంటీర్లు, స్వయం సహాయక సంఘాల ప్రైమరీ రీసోర్స్ పర్సన్లు, వార్డు సచివాలయంలో ఉండే హెల్త్ కార్యదర్శి, అదనపు ఏఎన్‌ఎం, ఆశా వర్కర్ ఉంటారు. ఈ బృందం ప్రతి ఇంటినీ రోజూ సర్వే చేసి వైరస్ లక్షణాలు ఉన్న వారిని గుర్తించాలి. మొదటి రోజు ఒక వ్యక్తిని మనం చూసినప్పుడు వైరస్ లక్షణాలు కనిపించకపోవచ్చు. ఆ తర్వాత కనిపించవచ్చు. అందుకే ప్రతి రోజూ ప్రతి ఇంటినీ సర్వే చేయాలి.
► రెండో స్థాయిలో ప్రతి కార్పొరేషన్‌లో వార్డుకు ఓ డాక్టర్‌ను ఏర్పాటు చేయాలి. మున్సిపాల్టీల్లో ప్రతి మూడు వార్డులకు ఒక డాక్టర్‌ను ఉంచాలి. మొదటి దశ బృందం నుంచి వచ్చే డేటాను ప్రతిరోజూ పర్యవేక్షించి, ఆ మేరకు చర్యలు తీసుకోవాలి.
► వృద్ధులు, బీపీ, సుగర్ లాంటి వ్యాధులతో బాధపడుతున్న వారి మీద ఇది ఎక్కువ ప్రభావం చూపుతోంది. అందుకనే ప్రైమరీ, సెకండరీ లెవల్ టీవ్
Comments
Please login to add a commentAdd a comment