రాజకీయంగా అణగదొక్కే కుట్ర ఇది
వైఎస్సార్‌సీపీ నేత గురునాథరెడ్డి విమర్శ
హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ నేతను దారుణంగా హతమార్చి, మళ్లీ అదే పార్టీకి చెందిన వారినే పోలీసులు అరెస్టు చేయడం వెనుక రాజకీయ కుట్ర ఉందని, తమ పార్టీని అణగదొక్కడానికే టీడీపీ ప్రభుత్వం ఇలా చేస్తోందని మాజీ ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లా రాప్తాడులో వైఎస్సార్‌సీపీ నేత శివప్రసాదరెడ్డి హత్య తరువాత చోటు చేసుకున్న సంఘటనలకు బాధ్యునిగా చేస్తూ గురునాథరెడ్డిపై కేసు నమోదు చేసిన ఆ జిల్లా పోలీసులు ఆదివారం 2 గంటల ప్రాంతంలో హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో అరెస్టు చేశారు. దీనికి ముందు గురునాథరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ సంఘటనలతో తనకేమీ సంబంధం లేకపోయినా కేసు నమోదు చేశారని, తాను స్వచ్ఛందంగా అరెస్టు అవుతున్నానని వెల్లడించారు. ఆ రోజున తమ పార్టీ నేత ప్రసాదరెడ్డి హత్య జరిగిన అరగంటకు తాను రాప్తాడు ఎమ్మార్వో కార్యాలయానికి చేరుకున్నానని, అక్కడ ఉన్నంత సేపూ ఎస్పీ, డీఎస్‌పీ, ఇతర పోలీసు అధికారుల మధ్యలోనే ఉన్నానని, ఈ సందర్భంలో ఎవరి వద్దా తాను ఒక్క మాటా మాట్లాడలేదన్నారు.
పోలీసులందరూ ఉండగానే చోటు చేసుకున్న విధ్వంసకాండకు తమను బాధ్యులను చేయడమేమిటని ఆయన ప్రశ్నించారు. అధికారంలో లేని వైఎస్సార్‌సీపీపై కక్ష సాధింపులకు దిగడం తప్ప మరొకటి కానే కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసాదరెడ్డిని ప్రభుత్వ కార్యాలయంలోకి పిలిపించి చంపడమే కాక పోలీసులందరి సమక్షంలో జరిగిన విధ్వంసకాండకు తిరిగి తమపైనే అభియోగం మోపడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.తమ కుటుంబం ఎప్పుడూ ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహించలేదని, గొడవలకు దూరంగా ఉంటామని, గన్‌మెన్‌లను కూడా తీసుకోలేదన్నారు. రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలపై సోమవారం గవర్నర్‌ను ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కలవనున్న నేపథ్యంలో ముందు రోజు అరెస్టు చేయడం టీడీపీ కుట్రలో భాగమని గురునాథరెడ్డి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గురునాథరెడ్డిని అనంతపురం తరలిస్తూ మార్గమధ్యలో ప్యాపిలి పోలీస్‌స్టేషన్‌లో కొద్దిసేపు ఉంచారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ హత్యలకు పాల్పడిన వారిని వదిలేసి ఆందోళనలతో ఏమాత్రం సంబంధం లేని వైఎస్సార్ సీపీ నాయకులను అరెస్టుచేయడం బాధాకరమన్నారు.
సమాధానం చెప్పని డీఎస్‌పీ..
ఏ అభియోగాలపై అరెస్టు చేస్తున్నారని మీడియా ప్రశ్నించినపుడు డీఎస్‌పీ సమాధానం ఇవ్వకుండా విసురుగా గురునాథరెడ్డిని వాహనంలో ఎక్కించుకుని తీసుకు వెళ్లారు. అరెస్టు చేస్తున్న సమయంలో వైఎస్సార్‌సీపీ తెలంగాణ విభాగం ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్, పార్టీ ఏపీ ఫిర్యాదుల విభాగం ఛైర్మన్ ఎ.నాగనారాయణమూర్తి ఉన్నారు.
పోలీసుల వైఖరిని వారిద్దరూ తీవ్రంగా ఖండించారు. వైఎస్సార్‌సీపీ నాయకుడిని చంపింది చాలక మళ్లీ ఆ పార్టీ నేతలనే అరెస్టు చేయడం ఏమిటని శివకుమార్ ప్రశ్నించారు. మండల రెవెన్యూ మెజిస్ట్రేట్ అయిన ఎమ్మార్వో కార్యాలయంలోనే అందరూ చూస్తుండగా ప్రసాదరెడ్డిని హతమార్చడం చూస్తే ప్రభుత్వ పాలన ఏ దిశగా సాగుతోందో ఇట్టే అర్థం అవుతోందని నారాయణమూర్తి విమర్శించారు.
అక్రమ అరెస్టులపై నిరసన
నేడు అనంతపురం నగర బంద్‌కు పిలుపు
అనంతపురం: వైఎస్సార్‌సీపీ నాయకుడు భూమిరెడ్డి శివప్రసాదరెడ్డి హత్యానంతరం జరిగిన విధ్వంసానికి సంబంధించి వైఎస్సార్‌సీసీ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేయడంపై ఆ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, రాప్తాడు నియోజకవర్గ పార్టీ నాయకుడు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి అరెస్టును నేతలు ఖండించారు. అరెస్టులకు నిరనసగా సోమవారం అనంతపురం నగర బంద్‌కు పిలుపునిచ్చారు. కాగా పార్టీ నేతల అరెస్టు నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు నగరంలో ఆదివారం రాత్రి పార్టీ కార్యాలయం నుంచి ఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించాయి. గురునాథరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డిలను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చంద్రశేఖరరెడ్డిని ఆదివారం రాత్రి పోలీసులు రిమాండ్‌కు తరలించారు.