శాసన మండలి డిప్యూటీ చైర్మన్ కారు బీభత్సం
విజయవాడ: విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లను ఆంధ్రప్రదేశ్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే 108 సాయంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన అనంతరం డిప్యూటీ చైర్మన్ కారు ఆపకుండా వెళ్లిపోయినట్లు సమాచారం. కాగా.. ప్రమాదం ఘటనపై ఆయన స్పందించారు. 'మా కారు ఆపలేదన్నది అవాస్తవం. కానిస్టేబుళ్లను మా కారు ఢీకొట్టిన మాట వాస్తవమే.
ప్రమాదం జరిగిన వెంటనే దగ్గరుండి క్షతగాత్రులను 108 సాయంతో ఆస్పత్రికి తరలించాము. రోడ్డు ఇరుకుగా ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని' రెడ్డి సుబ్రమణ్యం వివరించారు. క్షతగాత్రులు పశ్చిమగోదావరి జిల్లా ఇంటెలిజెన్స్ విభాగంలో పని చేస్తున్న కె. పాండురంగారావు, విజయనగరం ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన కె. అశోక్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.