ఉపాధి సిబ్బంది సమ్మె బాట | Contract Employees Strike Vizianagaram | Sakshi
Sakshi News home page

ఉపాధి సిబ్బంది సమ్మె బాట

Published Fri, Dec 28 2018 6:33 AM | Last Updated on Fri, Dec 28 2018 6:33 AM

Contract Employees Strike Vizianagaram - Sakshi

కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌కు సమ్మె నోటీసు అందజేస్తున్న ఉపాధిహామీ కాంట్రాక్టు సిబ్బంది

విజయనగరం పూల్‌బాగ్‌:  ఉద్యోగాలు క్రమబద్ధీకరిస్తామన్నారు... వేతనాలు పెంచుతామన్నారు.. ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తామన్నారు.. అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు గడిచింది.. పాలన ముగిసేందుకు మరో ఆరునెలలే గడువు ఉంది.. ఇప్పటికీ ఒక్క హామీ నెరవేర్చలేదు... క్రమబద్ధీకరణ ఊసేలేదు.. ఎదురు ప్రశ్నించిన ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తున్నారు... ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారంటూ ఉపాధిహామీ సిబ్బంది మండిపడుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ వెలుగు సిబ్బంది బాటలోనే సమ్మెకు సిద్ధమవుతున్నారు. వచ్చేనెల 2 నుంచి సమ్మె చేస్తామని అధికారులకు నోటీసులు అందజేశారు. చాలీచాలని జీతాలతో ఎన్నో కష్టాలు పడుతున్న తమ డిమాండ్లు నెరవేర్చాలని ఎంతో కాలంగా కోరుతున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు విమర్శిస్తున్నారు.

13 ఏళ్లుగా పనిచేస్తున్నా..
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో 13 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ నేటికీ టెక్నికల్‌ అసిస్టెంట్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, ఏపీఓలు, ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్లు, ప్లాంటేషన్‌ సూపర్‌వైజర్లు, జూనియర్‌ ఇంజినీర్ల ఉద్యోగాలు క్రమబద్ధీకరణ కాలేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమానపనికి సమానవేతనం ఇవ్వాల్సి ఉండగా అది అమలు కావడంలేదు. సమానపనికి సమానవేతనం అమలు చేయాలని, టైమ్‌స్కేల్‌ అమలు చేయాలని వారు కోరుతున్నారు. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

టైంస్కేల్‌ అమలు చేయాలి
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 2016 పీఆర్సీని అనుసరించి టైంస్కేల్‌ అమలు చేయాలి. సమాన పనికి సమానవేతనం నిబంధన వర్తింపజేయాలి. 13 ఏళ్లుగా పనిచేస్తున్న మా ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలి.
– గర్భాపు సుందరరావు, జిల్లా అధ్యక్షుడు, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ సిబ్బంది జేఎసీ, విజయనగరం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement