పలాస, శ్రీకాకుళం పాతబస్టాండ్: తక్కువ రీచులకే అనుమతులు ఇవ్వడం.. ధర ఎక్కువగా నిర్ణయించడం.. మహిళా సంఘాల ముసుగులో అధికార పార్టీ నేతల దందాల కారణంగా జిల్లాలో ఇసుక అక్రమాలకు అంతులేకుండాపోతోంది. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడటంతో పాటు తీరప్రాంతాలను విచ్చలవిడిగా తవ్వేయడం వల్ల పర్యావరణానికీ ముప్పు ఏర్పడుతోంది. జిల్లాలో ప్రధా న నదులైన వంశధార, నాగావళి, మహేంద్రతనయ తీర ప్రాంతాల్లో ఇసుకాసురుల అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నట్లు ‘సాక్షో’ పరిశీలనలో తేలింది.
13 రీచులకే అనుమతి
జిల్లాలో మొత్తం 70 రీచ్‌లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో 13 రీచుల నిర్వహణకే ఇంతవరకు అనుమతి లభించింది ఒడిశా-ఆంధ్రా సరిహద్దుల్లో ఉన్న బల్లిమడ, సింగిడి, సోమరాజుపురం, కడుము, సిరుసువాడ ర్యాంపులకు ఇంకా అనుమతి రావాల్సి ఉంది. కాగా 13 రీచుల నిర్వహణకు డ్వాక్రా సంఘాలకు అప్పగించిన కలెక్టర్ నేతృత్వంలోని జిల్లాస్థాయి కమిటీ క్యూబిక్ మీటరు ఇసుకకు రూ.675 ధర నిర్ణయించింది. ఇసుక కావలసిన వారు డీడీ తీసి మీసేవ కేంద్రంలో దాన్ని ఇచ్చి రసీదు పొందాలి. సంబంధిత రీచుల్లో దాన్ని చూపిస్తే ఇసుక సరఫరా చేస్తారు. రవాణాకు పంచాయతీ కార్యాలయంలో వే బిల్లు కూడా తీసుకోవాలి. ఇసుక ర్యాంపు వద్ద స్థానిక అధికారులతో పాటు కమిటీల పర్యవేక్షణలో డ్వాక్రా సంఘాల మహిళలు ఇసుక విక్రయాలు నిర్వహించాలని. ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకే క్వారీ నిర్వహించాలని నిబంధనలు విధించారు.
టీడీపీ నేతల హల్‌చల్
అయితే ఎక్కడా అధికారుల పర్యవేక్షణ కనిపించడం లేదు. అధికారులు వస్తున్నా ఏదో కొద్దిసేపు కాలక్షేపం చేసి వెళ్లిపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. దీంతో డ్వాక్రా సంఘాల ముసుగులో ఉన్న తెలుగుదేశం నేతలు అడిందే ఆట, పాడిందే పాటగా వ్యవహారం సాగుతోంది. పేరుకు మహిళా సంఘాలకు రీచులను అప్పగించినా, తెరవెనుక టీడీపీవారి పెత్తనమే సాగుతోంది. వారు అధికారులతో కుమ్మక్కై ఒకే వేబిల్లుతో నాలుగైదు ఇసుక లోడ్లు తరలిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్తూరు మండలంలో ఈ దందా అంతా టీడీపీ కనుసన్నల్లోనే జరుగుతోంది. ఆ పార్టీ మండల కమిటీలో కీలకపాత్ర పోషిస్తున్న ఒక నాయకుడికి ఇదే నిత్యకృత్యం.
స్థానికుల వ్యతిరేకత
కొన్ని చోట్ల ఇసుక తవ్వకాలను స్థానికులు అడ్డుకుంటున్నారు. బూర్జ మండలం కాఖండ్యాం ఇసుక ర్యాంపును అక్కడి ప్రజలు అడ్డుకున్నారు. జేసీ వివేకయాదవ్ కూ డా పరిశీలనకు వెళ్లారు. తమ ఇబ్బందులు తెలియజేస్తూ ఇక్కడ ఇసుక తవ్వకాలు చేపట్టకూడదని స్థానికు లు విజ్ఞప్తి చేశారు. నాగావళి నది బలహీనపడుతుంద ని, తెలుగుదేశం నాయకుల స్వలాభం కోసమే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రీచుల్లో సామాన్య ప్రజలకు ఇసుక లభించడం లేదు. ప్రభుత్వ నిబంధనల కారణంగా ట్రాక్టర్లకు మాత్రమే అనుమతి లభిస్తోంది. దీంతో టైరు, నాటుబళ్లతో ఇసుక అమ్ముకు నే చిన్నా చితకా వ్యాపారులు ఉపాధి కోల్పోతున్నారు.
అడ్డదారుల్లో రవాణా
తక్కువ రీచులకు అనుమతి లభించడం, తీర ప్రాంతాలు ఎక్కువగా ఉండటంతో అనేక చోట్ల నదీ గర్భాల్లోని ఇసుకను వ్యాపారులు అక్రమంగా తవ్వి భూగర్భ జలాలకు నష్టం కలిగిస్తున్నారు. మహేంద్రతనయ పర్వతాల నుంచి ఒడిశా సరిహద్దులోని భామిని, కొత్తూరు, పాతపట్నం, పలాస, వజ్రపుకొత్తూరు, మందస, ఇచ్ఛాపురం, కంచిలి, సోంపేట మండలాల్లోని వివిధ గెడ్డలు, మహేంద్రతనయ పాయల నుంచి అక్రమంగా ఇసుక రవాణా సాగుతోంది. వంశధార, నాగావళి తీరప్రాంతాల్లో ఇదే తంతు కొనసాగుతోంది. దీంతో ఇసుక అక్రమ రవాణాను నియంత్రించడానికి సుమారు 40 రీచ్‌లకు సమీపంలో తీరంలో అధికారులు కందకాలు తవ్వించారు. అక్కడ ప్రభుత్వ సిబ్బందిని కమిటీలుగా వేసి కాపలా పెట్టారు. అయినా ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు. అనుమతులున్నచోట బహిరంగంగానే అక్రమాలు జరుగుతుండగా.. లేనిచోట దొంగచాటుగా జరుగుతున్నాయి.
అధికార రేటుకు మించి..
అవసరమైనంత ఇసుక లభించని పరిస్థితుల్లో వ్యాపారులు రేట్లను అమాంతం పెంచేసి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం లారీ(సుమారు 12 క్యూబిక్ మీటర్లు) ఇసుకను రూ.15 వేలకు అమ్ముతున్నారు. ప్రభుత్వానికి మాత్రం రూ.8,100 చెల్లిస్తున్నారు. అయితే రవా ణా ఖర్చులు, డ్రైవర్ బేటా, ఇతర ఖర్చులు సుమారు రూ.5 వేలు అవుతాయని వ్యాపారులు చెబుతున్నారు. గతంలో లారీ ఇసుక సుమారు రూ.8 వేలు ఉండగా, ఇప్పుడది దాదాపు రెట్టింపు కావడంతో నిర్మాణాలు నిలిచిపోయి, తమకు పనులు లేకుండాపోతున్నాయని భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ విధానాల వల్ల బడా కాంట్రాక్టర్లు, టీడీపీ నాయకులే లబ్ధి పొందుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ అంశాలపై డీఆర్‌డీఎ ఏపీడీ(లాండ్) జి.సుజాత‘సాక్షి’తో మాట్లాడుతూ నిబంధనల ప్రకారమే అంతా జరుగుతుందని, ఎక్కడా అవకతవకలు లేవన్నారు.
తవ్వినకొద్దీ అవినీతి!
Published Wed, Dec 10 2014 2:20 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement