బాక్సైట్ భగభగలు
చింతపల్లి: ప్రశాంతంగా ఉన్న విశాఖ మన్యంలో మళ్లీ బాక్సైట్ సెగ రాజుకుంది. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా సీపీఐ పాదయాత్ర ముగింపు సందర్భంగా మంగళవారం సీపీఐ ఆధ్వర్యంలో చింతపల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. గిరిజన సంఘాలు, వైఎస్సార్‌సీపీతోపాటు కమ్యూనిస్ట్ పార్టీలు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నాయి. ఇంతకాలం స్తబ్దుగా ఉన్న మావోయిస్టులు మళ్లీ ఇప్పుడు బాక్సైట్ వ్యతిరేకపోరు పేరుతో తెరవెనుక చురుగ్గా కదులుతున్నారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలు చేపడతామని ప్రకటించింది. ఆగస్టు 10న విశాఖలో నిర్వహించిన గిరిజన సదస్సులో సీఎం చంద్రబాబు దీనిపై స్పష్టమైన ప్రకటన చేశారు. అప్పటి నుంచి మన్యంలో నిరసన జ్వాలలు మిన్నంటుతూనే ఉన్నాయి.
దళసభ్యులు బాక్సైట్ వ్యతిరేక ఉద్యమాలకు సిద్ధం కావడంతో రాజకీయ నాయకుల గుండెల్లో గుబులు చోటుచేసుకుంటోంది. కంటి మీద కునుకు లేకుండా అధికారపార్టీ నాయకులు గడుపుతున్నారు. ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా కొన్నేళ్లుగా గిరిజనులు అలుపెరుగని ఉద్యమాలు సాగిస్తున్న విషయం తెలిసిందే. విపక్షంలో ఉన్నంతకాలం బాక్సైట్ తవ్వకాలకు తాము వ్యతిరేకమంటూ టీడీపీ నమ్మబలికింది. అప్పట్లో చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావులు జీకేవీధిలో జరిగిన బహిరంగ సభల్లో బాక్సైట్‌కు వ్యతిరేకంగా విల్లంబులు ఎక్కిపెట్టి మరీ శపథం చేశారు. బాక్సైట్ కారణంగానే జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు సమిడి రవిశంకర్, ఉంగ్రంగి సోమలింగం, జీకేవీధి వైస్ ఎంపీపీ సాగిన సోమ లింగంలు మావోయిస్టుల చేతిలో ప్రాణాలుకోల్పోయిన విషయం తెలిసిందే.
ఈ ప్రాంతంలోని స్థానిక ప్రజాప్రతినిధులు పదవులకు, పార్టీలకు రాజీనామాలు చేసి అప్పట్లో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశారు. బాక్సైట్ తవ్వకాల అంశానికి కొంతకాలం తాత్కాలికంగా తెరపడింది. మన్యంవాసులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రశాంత వాతావరణం నెలకొంది. టీడీపీ అధికారంలోకి రాగానే మళ్లీ ఆ తుట్టెను కదిపింది. బాక్సైట్ తవ్వకాల అంశాన్ని మరోసారి తెరపైకి తె చ్చింది. దీంతో ఏజెన్సీలో వాతావరణం మళ్లీ వేడెక్కింది. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న మావోయిస్టులు దీనిని తమకు అనుకూలంగా మలచుకుని బాక్సైట్ వ్యతిరేక ఉద్యమాలకు గిరిజనులను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే గరిమండ, ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లోను, జి.మాడుగుల మండలంలోను గిరిజనులతో భారీ సమావేశాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంత రాజకీయనాయకులు, గిరిజనులు మరోసారి తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు. దినదినగండం..నూరేళ్ల ఆయుష్షుగా కాలం వెళ్లదీస్తున్నారు.