‘సైబర్’ టై్ | Cyber ​​criminals | Sakshi
Sakshi News home page

‘సైబర్’ టై్

Published Thu, Oct 30 2014 4:31 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

Cyber ​​criminals

ఏటీఎంలో డబ్బు డ్రా చేయాలంటే బ్యాంకు ఖాతాదారులు బెంబేలెత్తుతున్నారు. వారిని నీడలా వెన్నంటి ఉండి.. వారి ఏటీఎం కార్డు వివరాలను తస్కరించే ముఠా చెలరేగిపోతోంది. ఆ వివరాలతో ఆన్‌లైన్‌లో సొమ్ము కాజేస్తూ ఏటీఎం కార్డుదారులకు కంటిపై కునుకులేకుండా చేస్తోంది. దర్శి ప్రాంతంలో ఒకే నెలలో ఇలాంటి ఉదంతాలు అనేకం చోటుచేసుకున్నాయి.
 
* దర్శిలో ఒకే నెలలో అనేక ఉదంతాలు
* లబోదిబోమంటున్న బాధితులు

దర్శి : ఏటీఎంలలో డబ్బులు తీసేప్పుడు సైబర్ నేరగాళ్లు వెంటాడుతున్నారు. ఎందుకో తెలియదుగానీ ఎక్కువగా ఆంధ్రా బ్యాంక్ ఏటీఎం కలిగి ఉన్నవారే వారి టార్గెట్. తాజాగా ఓ ఖాతాదారుడు ఈ నెల 22న స్టేట్‌బ్యాంకు ఏటీఎంలో డబ్బులు పోగొట్టుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఇప్పటికే ఇలాంటి ఫిర్యాదులు పోలీసులకు ఓ అర డజను వరకు అందినట్టు సమాచారం. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దర్శికి చెందిన తిరుమలరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆంధ్రాబ్యాంకు ఏటీఎం కార్డు ద్వారా ఈ నెల 22న దర్శి పట్టణం అద్దంకి రోడ్డులోని ఎస్‌బీఐ ఏటీఎంలోకి వెళ్లారు. ఈ లోపు డబ్బు కోసం వచ్చినట్లుగా ముగ్గురు వ్యక్తులు అతని వెనుకే  నిలబడ్డారు.

ఏటీఎం కార్డు పెట్టిన శ్రీనివాసులరెడ్డి.. మిగతా ప్రాసెస్‌ను చేయాలని వారిని కోరాడు. దీంతో వారు రూ.వెయ్యి నగదు డ్రా చేసి ఇచ్చారు. అప్పుడే ఏటీఎం కార్డు నంబరు, పాస్‌వర్డ్, సీవీవీ నంబర్లను వారు గమనించినట్లు తెలుస్తోంది. అదే రోజు సాయంత్రం శ్రీనివాసులరెడ్డి ఖాతా నుంచి మూడు సార్లు రూ.1500 చొప్పున ఆన్‌లైన్‌లో పర్ఛేజ్ చేసినట్లు మేసేజ్ వచ్చింది. ఏటీఎం కార్డు తన వద్దే ఉండగా రూ.4500 నగదు డ్రాచేసినట్లు వచ్చిన మెసేజ్ చూసి ఆయన కంగారుపడ్డారు. మరుసటి రోజు ఆంధ్రాబ్యాంకు మేనేజరును సంప్రదించగా, పాయింట్ ఆఫ్ సేల్స్(పీఓఎస్) ద్వారా  ఇంటర్నెట్‌లో ఆ డబ్బు వేరే అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ అయిందని తెలిపారు.
 
డబ్బు చేరిన ఖాతా వివరాలు ఇవ్వాలని కోరగా, ఆ నంబరు తమవద్ద ఉండదని, సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాలంటూ సలహా ఇచ్చారు. అకౌంట్ స్టేట్‌మెంటు మాత్రం ఇచ్చారు. దీంతో బుధవారం ఆయన దర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 15న పొదిలో రోడ్డులోని ఎస్‌బీఐ ఏటీఎం వద్ద ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది.

మొత్తుకున్నా భద్రత కల్పించరు
దర్శి పట్టణంలో ఆరు ఏటీఎంలకు ఒక్కదానిలోనూ సెక్యూరిటీ లేదు. అవరమున్నా, లేకున్నా ఎప్పుడూ ఎక్కువ మంది ఒకేసారి ఏటీఎంల్లోకి ప్రవేశిస్తున్నారు. మహిళలు నగదు డ్రా చేయాలంటే మరీ ఇబ్బందిగా ఉంటోంది. వీటినే సైబర్ నేరగాళ్లు అనుకూలంగా మార్చుకుంటున్నారు. బ్యాంకు అధికారులు ఏటీఎం కేంద్రాలకు సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని వినియోగదారులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement