దర్శిలో ఫ్యాన్‌ గాలి | Darshi Constituency Review | Sakshi
Sakshi News home page

దర్శిలో ఫ్యాన్‌ గాలి

Published Wed, Mar 20 2019 11:30 AM | Last Updated on Thu, Mar 28 2019 5:27 PM

Darshi Constituency Review - Sakshi

సాక్షి, దర్శి టౌన్‌ (ప్రకాశం): దర్శి నియోజకవర్గంలో ఫ్యాన్‌ గాలి వీస్తోందా..? వచ్చే నెలలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుకే అధికంగా ఓట్లు పోలై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించబోతోందా..? నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తే అదే ఖాయమనిపిస్తోంది. 2014 ఎన్నికల్లో కేవలం 1,374 ఓట్ల తేడాతో వైఎస్సార్‌ సీపీ చేజారిన దర్శి నియోజకవర్గం.. ఈసారి భారీ మెజార్టీతో ఆ పార్టీ ఖాతాలో చేరబోతోందని నియోజకవర్గంలోని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గత ఎన్నికల్లో దర్శి నుంచి టీడీపీ తరఫున పోటీచేసి గెలిచి మంత్రిగా పనిచేసిన శిద్దా రాఘవరావు హయాంలో నియోజకవర్గంలో అవినీతి అక్రమాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. శిద్దా అండదండలతో ఐదేళ్లపాటు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. ఇష్టారాజ్యంగా దోచుకున్నారు. అభివృద్ధి అనేది ఆచూకీ లేకుండా పోయింది.

ఈ నేపథ్యంలో ఓటమి భయంతో ప్రస్తుత ఎన్నికల్లో శిద్దా కుటుంబం దర్శి నుంచి పోటీకి దూరం కాగా, స్థానిక టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిన కదిరి బాబూరావు పరిస్థితి అయోమయంగా ఉంది. కనిగిరి టికెట్‌ కోసం ఆయన పోటీపడగా దక్కకపోవడంతో దర్శి నుంచి పోటీ చేసేందుకు ఆయన విముఖత చూపుతున్నారు. కదిరి బాబూరావు పోటీకి విముఖత చూపడంతో.. శిద్దా కుటుంబం కూడా దూరమై ఇప్పటికే నిరుత్సాహంగా ఉన్న దర్శి నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు మరింత నీరుగారిపోయారు. దర్శి నుంచి గెలవలేనన్న కదిరి వ్యాఖ్యలు, పోటీకి శిద్దా దూరం కావడమే నియోజకవర్గంలో ఆ పార్టీ దుస్థితికి నిదర్శనంగా ఉన్నాయి. ఈ పరిణామాలన్నింటితో పాటు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న మద్దిశెట్టి వేణుగోపాల్‌ బలంగా అవతరించడంతో ఫ్యాన్‌ జోరు మరింత పెరిగింది. తద్వారా నియోజకవర్గంలో వైఎస్సార్‌ సీపీ విజయం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

దర్శి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 14 సార్లు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. అందులో ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్న నారపుశెట్టి శ్రీరాములు మృతి చెందగా జరిగిన ఉప ఎన్నిక కాగా, మిగిలిన 13 సార్లు సాధారణ ఎన్నికలే. ఈ ఎన్నికల్లో రెండుసార్లు ఇరుపక్షాలను సమానంగా ఆదరించగా, మరో రెండుసార్లు ఇండిపెండెంట్‌ అభ్యుర్థులను నియోజకవర్గ ఓటర్లు గెలిపించారు. ప్రస్తుతం వచ్చే నెలలో 15వ సారి నిర్వహించనున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం రసవత్తరంగా మారింది.

1952లో జిల్లాలోనే పెద్ద నియోజకవర్గంగా ఏర్పాటు...
1952లో దర్శి నియోజకవర్గం ఏర్పడింది. దర్శి, కురిచేడు, దొనకొండ, ముండ్లమూరు, తాళ్లూరు, మర్రిపూడి, కొనకనమిట్ల, పుల్లలచెరువు, త్రిపురాంతకం కలిపి మొత్తం 9 మండలాల్లోని ప్రాంతాలతో జిల్లాలోనే పెద్ద నియోజకర్గంగా ఏర్పడింది. 2009లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన పునర్విభజనలో దర్శి, దొనకొండ, కురిచేడు, ముండ్లమూరు, తాళ్లూరు మండలాలతో ప్రస్తుతం దర్శి నియోజకవర్గం కొనసాగుతోంది.

ఐదేళ్లుగా సాగర్‌ జలాలు అందక కుంటుపడిన అభివృద్ధి...
దర్శి నియోజకవర్గంలో సాగర్‌ ఆయకట్టు 1.60 లక్షల ఎకరాలు ఉంది. గడిచిన ఐదేళ్ల టీడీపీ పాలనలో సాగర్‌ నీరు అందకపోవడంతో నియోజకవర్గ అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. నియోజకవర్గానికి అసలు సాగర్‌ జలాలే రాకముందు దర్శి పట్టణం చిన్నపాటి పల్లెగా ఉండేది. అనంతరం సాగర్‌ జలాల రాకతో ఈ ప్రాంతం సస్యశ్యామలమైంది. కనిగిరి ప్రాంతంలోని రైతులంతా ఈ ప్రాంతానికి వలసలు రావడంతో వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ కూడా బాగా అభివృద్ధి చెందింది.  18 పాల శీతలీకరణ కేంద్రాల ద్వారా 1.30 లక్షల లీటర్ల పాలను దర్శి నియోజకవర్గంలో సేకరిస్తుంటారు. కానీ, గత ఐదేళ్లుగా టీడీపీ పాలనలో సాగర్‌ నీరు అందక వ్యవసాయం చేసే పరిస్థితి లేకుండా పోయింది. కొన్నేళ్లుగా రైతుల ఆందోళనలతో దర్శి పట్టణం దద్దరిల్లుతోంది. మంత్రి శిద్దా సొంత నియోజకవర్గం అయినప్పటికీ ఏమాత్రం అభివృద్ధి చెందకపోగా, కనీసం రైతులకు సాగర్‌ నీరు కూడా అందకపోవడంపై నియోజకవర్గ ప్రజలు తీవ్ర అసహనంగా ఉన్నారు.

2,11,506 మంది ఓటర్లు...
2009లో నియోజకవర్గంలో 1,78,564 మంది ఓటర్లు ఉండగా, 2014లో ఆ సంఖ్య 1,94,640కు చేరింది. 2019లో ఇప్పటి వరకు 2,11,506 మంది ఓటర్లు ఉండగా, అందులో పురుషులు 1,06,698 మంది, మహిళలు 1,04,798 మంది ఉన్నారు.

నియోజకవర్గంలో ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల్లో ఫలితాలు ఇలా ఉన్నాయి...

ఎన్నికల
సంవత్సరం
 గెలిచిన అభ్యర్థి, పార్టీ  పోలైన   ఓట్లు    ప్రత్యర్థి, పార్టీ  పోలైన   ఓట్లు
1955  దిరిశాల వెంకటరమణారెడ్డి, కాంగ్రెస్‌  14,980    శింగరాజు  రామకృష్ణయ్య, సీపీఐ    12,775
1962  దిరిశాల వెంకటరమణారెడ్డి,   కాంగ్రెస్‌  14,411   నుసుం కాశిరెడ్డి, సీపీఐ    13,533
1967  ఎం.రావిపాటి, స్వరాజ్‌పార్టీ  32,931    దిరిశాల వెంకటరమణారెడ్డి, కాంగ్రెస్‌  24,885
1972     దిరిశాల రాజగోపాల్‌రెడ్డి,
కాంగ్రెస్‌
 31,125 ఎం.రావిపాటి, ఇండిపెండెంట్‌  26,407
1978       బి.జ్ఞానప్రకాష్, ఇందిరా కాంగ్రెస్‌  24,225    మువ్వల శ్రీహరి, జేఎన్‌పీ   22,767
1983    కాటూరి నారాయణస్వామి, ఇండిపెండెంట్‌  43,730    డి.రాజగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్‌    27,272
1985 నారపుశెట్టి శ్రీరాములు, టీడీపీ  42,471  సానికొమ్ము పిచ్చిరెడ్డి,   కాంగ్రెస్‌    42,193
1989   సానికొమ్ము పిచ్చిరెడ్డి, కాంగ్రెస్‌    56,165   వేగినాటి కోటయ్య,   టీడీపీ    54,879
1994        నారపుశెట్టి శ్రీరాములు, టీడీపీ  50,769    మహ్మద్‌ గౌస్‌ షేక్, కాంగ్రెస్‌    34,071
1997 నారపుశెట్టి పాపారావు, టీడీపీ    63,432   సానికొమ్ము పిచ్చిరెడ్డి,   కాంగ్రెస్‌    55,031
1999  సానికొమ్ము పిచ్చిరెడ్డి, కాంగ్రెస్‌    70,387  వేమా   వెంకటసుబ్బారావు,   టీడీపీ    57,209
2004  బూచేపల్లి సుబ్బారెడ్డి,   ఇండిపెండెంట్‌  50,431  కదిరి బాబూరావు,   టీడీపీ    48,021
2009  బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి,   కాంగ్రెస్‌    66,418    మన్నం వెంకటరమణ,   టీడీపీ    53,028 
2014

 శిద్దా రాఘవరావు, టీడీపీ

 88,821    బూచేపల్లి  శివప్రసాద్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ  87,447

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement