సాక్షి ప్రతినిధి, కడప: అధికారం మాదే...ఎమ్మెల్యే చెప్పాడంటూ మాకు తెలియకుండా పనులు చేశావో...నీకుంటుంది. మాతో శత్రుత్వం చేస్తే రాష్ట్రంలో మరెక్కడా పనిచేయలేవు, అభివృద్ధి పనులైనా.. నూతన నియామకాలైనా మేము చెప్పినట్లు చేస్తే సరి...లేదంటే నీ ఇష్టం...ముందే చెబుతున్నా... తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ గురువారం ఓ మున్సిపల్ కమిషనర్‌పై విరుచుకపడిన తీరిది ఎన్నికల్లో ఇష్టానుసారంగా పనిచేశావు... మావాళ్లే టార్గెట్‌గా వ్యవహరించావు.. ఇకనైనా చెప్పినట్లు విను.. లేదంటావా.. నీదారి చూసుకో.
మంచిగా చెబుతున్నా అర్థం చేసుకో.. నాలోని లోపలి మనిషిని లేపొద్దు.. ఓ ఎస్‌ఐపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన నాయకుడి చిందులు జిల్లాలో బెదిరింపుల పర్వం మొదలైంది. అధికారులే టార్గెట్‌గా నాయకులు హెచ్చరికలు చేస్తున్నారు. అధికారం మాదేనంటూ హుకుం జారీ చేస్తున్నారు. నూతనంగా ఏర్పడ్డ ఎర్రగుంట్ల మున్సిపాలిటీలో భారీ తేడాతో తెలుగుదేశం పార్టీ ఓటమి చవిచూసింది. ప్రతిపక్షపాత్ర సైతం దక్కలేదు. 20 మంది కౌన్సిలర్లలో రెండింటిని మాత్రమే టీడీపీ సొంతం చేసుకుంది. అయితే అక్కడి పాలకపక్షాన్ని కాదని, తాము చెప్పినట్లే వినాలంటూ ము న్సిపల్ కమిషనర్‌పై స్వరం పెంచారు. మాజీ సర్పంచ్ స్థాయి నాయకుడు సైతం కమిషనర్‌పై దూషణలకు దిగుతున్నారంటే తెలుగుదేశం పార్టీ నేతల అధికారదాహం ఇట్టే అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
పోలీసు అధికారులకు తప్పని బెదిరింపులు...
సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక సీట్లు తెలుగుదేశం పార్టీ వశమయ్యాయి. ఆపార్టీ అధికారిక పగ్గాలు చేపట్టకమునుపే అధికారులకు వత్తిళ్లు ఆరంభమయ్యాయి. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ తాము చెప్పినట్లు వినాలంటూ దేశం నేతలు దర్పం ప్రదర్శిస్తున్నారు. అందులో భాగంగా పోలీసు అధికారులపై ముందుగా కన్నేశారు. పోలీసు యంత్రాంగాన్ని వశపర్చుకుంటే గ్రామాల్లో పైచేయి సాధించవచ్చనే ధీమాతో ఉన్నట్లు సమాచారం. అందులో భాగంగా మైదుకూరు సబ్‌డివిజన్‌లో ఓ ఎస్‌ఐకి టీడీపీ తరపున పోటీ చేసిన ఓడిన అభ్యర్థి స్వయంగా పోన్ చేసి బెదిరింపులకు దిగినట్లు సమాచారం. తాము చెప్పినట్లు వినాలంటూ సుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అధికారానికి పదేళ్లుగా దూరంగా ఉన్న తెలుగుతమ్ముళ్లలో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే తలంపు మెండుగా కన్పిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
ఘెర పరాభవం...అయినా కనువిప్పేదీ...
జిల్లాలో రెండు పార్లమెంటు స్థానాలు, తొమ్మిది ఎమ్మెల్యే స్థానాలను కోల్పోయి తెలుగుదేశం పార్టీ ఘెర పరాభవం చవిచూసింది. 2009 లాగే 2014లో ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. ఎన్నికల్లో డబ్బును వరదలా పారించినా, అనైతిక కలయికలు చేపట్టినా ప్రజల నుంచి ఛీత్కారం తప్పలేదని పరిశీలకులు పేర్కొంటున్నారు. తొమ్మిది నియోజకవర్గాల్లో తిరస్కారానికి గురైన తెలుగుతమ్ముళ్లు ఇకనైనా జిల్లా అభివృద్ధిపై దృష్టి సారించాలని పలువురు హితవు పలుకుతున్నారు.
మాతో పెట్టుకోవద్దు
Published Fri, May 23 2014 1:38 AM | Last Updated on Tue, Oct 16 2018 7:36 PM
Advertisement