అగళి, న్యూస్‌లైన్ : ఓ ప్రధానోపాధ్యాయుని ఇంటిపై దాడి చేసిన దుండగులు వేటకొడవళ్లు, కత్తులతో అతన్ని గాయపరచడమే కాకుండా, అతని తల్లి మెడలోని బంగారు గొలుసును లాక్కువెళ్లిన సంఘటన అనంతపురం జిల్లా అగళి మండలం రామనపల్లిలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. అగళి ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడుగా పనిచేస్తున్న రవీంద్రమూర్తి తల్లిదండ్రులతో కలసి రామన్నపల్లికి సమీపంలోని తోటలో ఉన్న ఇంట్లో నివసిస్తున్నాడు. ఈయన భార్య రమాదేవి సమీపంలోని కసాపురం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండగా, తండ్రి విశ్రాంత ఉపాధ్యాయుడు. రవీంద్రమూర్తి పాఠశాల ముగిసిన తర్వాత ప్రైవేటు క్లినిక్ (ఆర్‌ఎంపి) నిర్వహిస్తుంటాడు. బుధవారం తెల్లవారుజామున మోటార్ సైకిల్‌పై వచ్చిన నలుగురు దుండగులు వారి ఇంటి ముందు వాహనాన్ని నిలిపారు.
అందులో ఓ వ్యక్తి వీరి ఇంటి వద్దకు వచ్చి బయటి గదిలో నిద్రిస్తున్న తల్లిని నిద్రలేపాడు. తాగేందుకు నీరు ఇవ్వాలని వేడుకున్నాడు. అందుకు ఆమె నిరాకరించినా, బలవంతం చేయడంతో చివరికి తలుపు తెరచి తన వద్ద ఉన్న నీళ్ల బాటిల్‌ను వారికి ఇచ్చేందుకు ప్రయత్నించింది. అంతలోనే ఆమెను తోసుకుంటూ మిగిలిన దుండగులు వేటకొడవళ్లు, కత్తులతో ఇంట్లోకి చొరబడ్డారు. ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసును లాక్కుని, మిగతా వాటిని ఇవ్వాలంటూ అడుగుతుండగా ఆమె కేకలు వేసింది. దీంతో వెనుక గదిలో పడుకున్న కుమారుడు రవీంద్రమూర్తి వెంటనే తల్లిని రక్షించుకునేందుకు ప్రయత్నించగా, అతనిపై వేటకొడవలితో దుండగులు దాడి చేశారు.
దీంతో అప్రమత్తమైన అతను దుండగుని చేతిలోని కొడవలిని లాక్కుని ప్రతిఘటించాడు. దీంతో ఓ దుండగుని వీపుపై గాయమైంది. అంతలోనే మరో దుండగుడు కత్తితో దాడి చేయడంతో రవీంద్రమూర్తి వీపునకు గాయమైంది. విషయం గమనించిన ఆయన భార్య పోలీసులు, గ్రామస్తులకు సమాచారం అందించినట్లు గుర్తించిన దుండగులు పరారయ్యారు. సమాచారం అందుకున్న డీఎస్పీ సుబ్బారావు, సీఐ హరినాథ్, గుడిబండ ఎస్‌ఐ హరినాథ్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఫోరెన్సిక్, డాగ్‌స్క్వాడ్ బృందాలను రప్పించారు. గాయపడిన ప్రధానోపాధ్యాయుడిని మడకశిర ఆసుపత్రికి తరలించి, ఆయన భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. నగలు, డబ్బు కోసమే దుండగులు దాడికి తెగబడినట్లు తెలుస్తోంది.
దోపిడీ దొంగల బీభత్సం
Published Thu, Dec 5 2013 3:04 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
Advertisement