అమలాపురం, న్యూస్‌లైన్ : జిల్లా రాజకీయాలను శాసించే మెట్టలో రాజకీయం బంధాలు, బంధువుల పాలనతో పెనవేసుకుపోయింది. ప్రధానంగా ప్రత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం నియోజకవర్గాల నుంచి పలు కుటుంబాల వారు, వారి బంధువులు రాజకీయంగా ఉన్నత పదవులు సాధించారు. జగ్గంపేట నియోజకవర్గం నుంచి సుదీర్ఘకాలం తోట కుటుంబీకులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన దివంగత తోట సుబ్బారావు, తోట గోపాలకృష్ణ, తోట వెంకటాచలం, తాజా మాజీ రాష్ట్రమంత్రి తోట నర్శింహం అన్నదమ్ముల బిడ్డలే. తోట వెంకటాచలానికి నర్శింహం సొంత తమ్ముడు. తోట సుబ్బారావు ఎమ్మెల్యేగా, రాష్ట్రమంత్రిగా పనిచేయడంతోపాటు కాకినాడ పార్లమెంట్ సభ్యునిగా కూడా పనిచేశారు. ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన జ్యోతుల నెహ్రూ మాజీమంత్రి తోట సుబ్బారావుకి మేనల్లుడు.
ప్రస్తుతానికి కాకినాడ పార్లమెంట్ వైఎస్సార్‌సీపీ కోఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్ సైతం తోట కుటుంబీకులకు మేనల్లుడి వరుస. తోట కుటుంబానికి చెందిన దివంగత గోపాలకృష్ణ పెద్దాపురం నుంచి ఎమ్మెల్యేగా, కాకినాడ ఎంపీగా పనిచేశారు. తాజాగా ఇతని కుమారుడు తోట సుబ్బారావునాయుడు పెద్దాపురం వైఎస్సార్‌సీపీ కో ఆర్డినేటర్‌గా ఉన్నారు. జిల్లాలో రాజకీయంగా చక్రం తిప్పిన దివంగత మాజీమంత్రి పంతం పద్మనాభం పెద్దాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఆయన అన్న కుమారుడు పంతం గాంధీమోహన్ ఇదే నియోజకవర్గానికి తాజామాజీ ఎమ్మెల్యే.
ప్రత్తిపాడు నియోజకవర్గంలో సైతం కుటుంబపాలనకే ఓటర్లు పెద్దపీట వేశారు. ముద్రగడ కుటుంబం నుంచి దివంగత ముద్రగడ వీరరాఘవులు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించగా ఆయన కుమారుడు పద్మనాభం అక్కడే ఎమ్మెల్యేగా గెలవడంతోపాటు రాష్ట్రమంత్రిగాను, కాకినాడ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఇదే నియోజకవర్గం నుంచి పర్వత కుటుంబానికి చెందిన పర్వత గుర్రాజు సోదరుడు పర్వత సుబ్బారావు, ఆయన భార్య పర్వత బాపనమ్మలు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. సుబ్బారావుకు తాజా మాజీ ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు సోదరుని కుమారుడు కావడం గమనార్హం.
అన్నదమ్ముల పిల్లలైన వరుపుల జోగిరాజు, వరుపుల సుబ్బారావులు సైతం ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేలుగా చేశారు. తోట కుటుంబీకులకు పంతం కుటుంబీకులు మేనమామ బిడ్డలవుతారు. వీరికి కాకినాడ నుంచి పార్లమెంట్ సభ్యులుగా, కేంద్రమంత్రులుగా పనిచేస్తున్న మల్లిపూడి శ్రీరామ సంజీవరావు కుటుంబానికి బంధుత్వాలున్నాయి. మొత్తం మీద మెట్ట రాజకీయాల్లో చక్రం తిప్పే తోట, వరుపుల, పంతం, జ్యోతుల, మల్లిపూడి కుటుంబాల మధ్య బంధుత్వాలు ఉండడం గమనార్హం.
తుని అసెంబ్లీ నియోజకవర్గంలో సైతం కుటుంబపాలన జరిగింది.
ఈ నియోజకవర్గం తాజామాజీ ఎమ్మెల్యే రాజా అశోక్‌బాబు కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. అశోక్‌బాబు తాత ఎస్.ఆర్.వి.వి.కృష్ణంరాజు (బులిబాబు) మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలవగా, ఆయన కుమార్తె, అశోక్‌బాబు మేనత్త ఎం.ఎన్.విజయలక్ష్మీదేవి సైతం ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక కోనసీమలో కుటుంబపాలన అనగానే గుర్తుకు వచ్చేది కుడుపూడి కుటుంబీకులు. ఈ కుటుంబానికి చెందిన కుడుపూడి సూర్యనారాయణ, ఆయన కుమారుడు కుడుపూడి ప్రభాకరరావులు ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.
ప్రభాకరరావుకు చిట్టబ్బాయి వరుసకు సోదరుడే. మెట్ట నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన తోట నర్శింహానికి అమలాపురానికి చెందిన మాజీమంత్రి మెట్ల సత్యనారాయణరావు సొంత మామగారు. మెట్లకు రాజోలు మాజీ ఎమ్మెల్యే దివంగత మంగెన గంగయ్య వియ్యంకుడు కావడం గమనార్హం.
కుటుంబ బంధాలు రాజకీయ అందలాలు
Published Tue, Apr 1 2014 12:51 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
Advertisement
Advertisement