రైతుకూలీ గర్జన
రైతుకూలీ గర్జన
Published Mon, Oct 21 2013 3:03 AM | Last Updated on Fri, Sep 1 2017 11:49 PM
సాక్షి నెట్‌వర్క్: అవిశ్రాంతంగా సాగుతున్న సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమం వరుసగా 82వరోజైన ఆదివారం కూడా ఉధృతంగా కొనసాగింది. సమైక్య రాష్ర్ట పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో 16వ నంబర్ జాతీయ రహదారిపై రైతుకూలీ గర్జన నిర్వహించారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ గర్జనలో కూలీలు సమైక్యనినాదాలు హోరెత్తించారు. ఇప్పటికే పలు సమస్యలు ఎదుర్కొంటున్న రైతులు, కూలీలు.. రాష్ర్టం ముక్కలైతే మరింత దుర్భరస్థితి ఎదుర్కోవాల్సివస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయర ంగం సుభిక్షంగా ఉండాలంటే రాష్ర్టం సమైక్యంగానే ఉండాలని నినదించారు. ముమ్మిడివరంలో 216 జాతీయ రహదారిపై విద్యార్థులు బైఠాయించి నిరసన తెలిపారు. అమలాపురంలో అభ్యుదయ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శించిన సమైక్యాంధ్ర బుర్రకథ వీక్షకులకు ఉత్తేజాన్ని నింపింది. కృష్ణాజిల్లా ముదినేపల్లి మండలం వడాలి చెరువులో విద్యార్థులు, ఉపాధ్యాయులు జలదీక్ష చేశారు. నందివాడ మండలం టెలిఫోన్ నగర్‌లో ఉపాధ్యాయులు రిలేదీక్షలు చేపట్టారు.
మాదిగల సింహగర్జన
అనంతపురం జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మాదిగల సింహగర్జన విజయవంతమైంది. సభలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనతో ప్రధానంగా నష్టపోయేది మాదిగలేనని అన్నారు. ఇండియన్ ముస్లిం మైనార్టీ ఆర్గనైజేషన్(ఐఎంఎం) నాయకులు నగరంలో భారీర్యాలీ నిర్వహించారు. సమైక్యం కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన హిందూపురం మునిసిపల్ మెప్మా అధికారి రాయల్ విజయభాస్కర్ పట్టణంలోనిఅంబేద్కర్ సర్కిల్‌లో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో పట్టణ జేఏసీ అధ్యక్షుడు వరదారెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ విద్యార్థులు జాతీయ పతాకాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో సీమాంధ్రలోని 13జిల్లాలకు చెందిన ఐకేపీ ఉద్యోగులు సమావేశమై సమైక్యఉద్యమాన్ని ఉధృతం చేయాలని తీర్మానిం చారు. వచ్చే నెల మూడున విజయవాడలో సీమాంధ్ర ఐకేపీ ఉద్యోగుల సభను నిర్వహించాలని నిర్ణయించినట్టు సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు చెప్పారు. భవిష్యత్ కార్యాచరణపై త్వరలో తిరుపతిలో సమావేశమవుతామన్నారు.
గడపగడపకూ సమైక్యనాదం
వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు సమైక్యాంధ్రప్రదేశ్ పరిరక్షణ లక్ష్యంగా అలుపెరుగని పోరాటం చేస్తున్న పార్టీ శ్రేణులు విభిన్నరూపాల్లో ఆందోళనలు చేపట్టాయి. పార్టీనేతలు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి సమైక్యాంధ్ర ఆవశ్యకతను వివరిస్తున్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం రాయుడుపాకలులో పార్టీ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో ‘గడపగడపకూ వైఎస్సార్‌సీపీ సమైక్య నాదం’ కార్యక్రమం చేపట్టారు. మలికిపురం మండలం శంకరగుప్తంలో వైఎస్సార్‌సీపీ రాజోలు నియోజకవర్గ కో ఆర్డినేటర్ జయప్రకాష్ ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర కోసం ప్రార్థనలు చేశారు. విశాఖ జిల్లా చోడవరంలో పార్టీ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. మునగపాక మెయిన్‌రోడ్డులో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాద్ నేతృత్వంలో రాస్తారోకో నిర్వహించి సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కృష్ణాజిల్లా నూజివీడు, కైకలూరుల్లో పార్టీ కార్యకర్తలు మానవహారాలు చేపట్టారు.
చిత్తూరు జిల్లా పలమనేరులో మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో సీమాంధ్ర కేంద్ర మంత్రుల మాస్క్‌లను గాడిదలకు తగిలించి ఊరేగించారు. మదనపల్లెలో ఎమ్మెల్సీ దేశాయ్ తిప్పారెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్‌లో రోడ్డుపై బైఠాయించారు. తిరుపతిలో రిలే నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలకు ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి మద్దతు తెలిపారు. శ్రీకాళహస్తిలోనియోజకవర్గ సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి దీక్షా శిబిరం వద్ద అరటి పండ్లు అమ్మి నిరసన తెలిపారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలో వైఎస్సార్‌సీపీ నేత దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో జీపులు, సుమోలతో ర్యాలీని నిర్వహించారు. రైల్వేకోడూరులో పార్టీ కార్యకర్తలు రోడ్డుపై ధర్నా చేపట్టారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో రిలేదీక్షా శిబిరాన్ని పార్టీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత ప్రారంభించారు.
జేడీశీలంకు సమైక్య సెగ
కేంద్ర మంత్రి జేడీశీలంకు గుంటూరు జిల్లాలో సమైక్య సెగ తగిలింది. కాకుమాను మండలం అప్పాపురం గ్రామానికి వస్తున్న ఆయన్ను సమైక్య వాదులు కాకువూను ప్రధాన కూడలిలో అడ్డుకున్నారు. గ్రావు సర్పంచ్ కొసనా వుధుసూధన్ రావు ఆధ్వర్యంలో వుంత్రి వాహనాన్ని చుట్టుముట్టారు. వుంత్రి పదవికి రాజీనావూ చేసి సమైక్యాంధ్ర సాధన కోసం ఉద్యమించాలని డివూండ్ చేశారు. దానికి వుంత్రి సమాధానమిస్తూ రాజీనావూల వల్ల ఒరిగేదేమీలేదని, పదవిలో ఉండి సవుస్యను పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతోనే రాజీనామా చేయలేదని తెలిపారు. పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది.
Advertisement