డీఈవో పోస్టుకు ఫైటింగ్ !
- బరిలో మువ్వా, దేవానందరెడ్డి, శామ్యూల్
- తననే కొనసాగించాలంటూ ఇన్‌చార్జ్ డీఈవో పైరవీలు
- మంత్రులకూ సవాలుగా మారిన వ్యవహారం
సాక్షి, చిత్తూరు: జిల్లా విద్యాశాఖాధికారి పోస్టు కోసం నలుగురు ఢీ అంటే ఢీ అంటున్నారు! ఎవరి పరిధిలో వారు ప్రయత్నాలు సాగి స్తున్నారు. గతంలో నెల్లూరు డీఈవోగా పనిచేసిన మువ్వా రామలిం గం, పాడేరు ఐటీడీఏ అధికారి దే వానందరెడ్డి, మదనపల్లె డెప్యూటీ డీఈవో, ప్రస్తుత ఇన్‌చార్జ్ డీఈవో శామ్యూల్, ఓ మహిళా అధికారి తీవ్రంగా పోటీ పడుతున్నట్లు సమాచారం. వారిలో ఒకరికిజిల్లా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి నారాయణ మద్దతు పలుకుతున్నట్లు ప్రచారంలో ఉంది.
జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా వర్గాలుగా విడిపోయి డీఈవో పోస్టు కోసం పైరవీలు నెరుపుతున్నట్లు తెలిసింది. దీంతో డీఈవో పోస్టు బేరం భారీగా ఉన్నట్లు విద్యాశాఖ వర్గాల్లో చర్చ సాగుతోంది. గతంలో నెల్లూరు డీఈవోగా పనిచేసిన మువ్వా రామలింగం ఎక్కడా పోస్టింగ్ ఇవ్వక పోవడంతో ఖాళీగా ఉన్నారు. చిత్తూరు డీఈవోగా రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.
ఆయనకు రాష్ర్ట మంత్రి నారాయణ హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మంత్రి నారాయణకు అత్యంత సన్నిహితుడు కావడంతో రామలింగం భరోసాతో ఉన్నారని సమాచారం. రామలింగం గతంలో కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో పనిచేసిన సమయంలో ఆయనకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి. నెల్లూరులో పనిచేస్తుండగా ఆయనను కలెక్టర్ సస్పెండ్ చేయడంతో పోస్టింగ్ లేక ఖాళీగా ఉన్నారు. ఇదిలావుండగా పాడేరులో ఐటీడీఏలో పనిచేస్తున్న దేవానందరెడ్డి డీఈవోగా రావడానికి అనంతపురం జిల్లాకు చెందిన మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆశీస్సులు కోరినట్లు సమాచారం.
శ్యామ్యూల్ ముమ్మర యత్నం !
ప్రస్తుతం ఇన్‌చార్జ్ డీఈవోగా ఉన్న శామ్యూల్ రెగ్యులర్ పోస్టులోకి రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. డీఈవో ప్రతాప్‌రెడ్డి కడపకు బదిలీ కావడంతో మదనపల్లి డెప్యూటీ డీఈవోగా ఉన్న శ్యామ్యూల్‌కు ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఆయన మంత్రి బొజ్జలతో పాటు, జెడ్పీ చైర్‌పర్సన్, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు, పలువురు టీడీపీ ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకొంటున్నట్లు తెలుస్తోంది.
ఓ మహిళా ప్రిన్సిపాల్ కూడా...
డీఈవో పోస్టు కోసం ఓ మహిళా ప్రిన్సిపాల్ కూడా పోటీలో ఉన్నట్లు సమాచారం. జిల్లాకు చెందిన కొందరు అధికారపార్టీ నేతలు ఆమెకు మద్దతు పలుకుతున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల నేపథ్యంలో డీఈవో పోస్టు ఖరీదుగా మారినట్లు సమాచారం.