కొత్తగూడెం అర్బన్, న్యూస్‌లైన్:
వేతనాల కోసం కాంట్రాక్ట్ కార్మికులు స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట శుక్రవారం చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఇద్దరు మహిళలు స్పృహ తప్పి పడిపోయారు. ఐదు నెలలుగా వేతనాలు రాకపోవడంతో కొత్తగూడెం మున్సిపాలిటీలోని వివిధ డిపార్ట్‌మెంట్లలోని కాంట్రాక్ట్ కార్మికులంతా సీఐటీయూ ఆధ్వర్యంలో రెండు రోజుల క్రితం మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కూడా వారు మున్సిపల్ కార్యాలయం ఎదుట సాయంత్రం వరకు ధర్నా నిర్వహించినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో సాయంత్రం వేళలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ లక్ష్మణరావు, ఇతర కార్యాలయ సిబ్బందిని నిర్బంధించిన మహిళా కార్మికులు బతుకమ్మ ఆటలు ఆడారు.
ఈ నేపథ్యంలో ఇద్దరు మహి ళా కార్మికులు దుర్గమ్మ, రాజమణిలు బతుక మ్మ ఆటలాడుతూ స్పృహ కోల్పోయి కిందపడ్డారు. విషయం తెలుసుకున్న వన్‌టౌన్ సీఐ నరేష్‌కుమార్ మున్సిపల్ కార్యాలయానికి వచ్చి వారిని చికిత్సనిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మున్సిపల్ కార్యాలయంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని భావించిన సీఐ సంబంధిత కాంట్రాక్టర్‌కు ఫోన్ చేసి వేతనాలకు సంబంధించిన వివరాలు, ఎందుకు చెల్లించలేదు, ఎప్పుడు చెల్లిస్తారు తదితర వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ రవికి ఫోన్‌చేసి మాట్లాడారు. మరోపక్క కాంట్రాక్టు కార్మికులు ఆందోళన కొనసాగిస్తున్నారు.
వేతనాల కోసం ధర్నా
Published Sat, Oct 12 2013 2:58 AM | Last Updated on Tue, Oct 16 2018 6:35 PM
Advertisement