నీరు పల్లమెరుగు అంటారు.. అరుతే ఎస్సారెస్పీ అధికారులకు కనీసం ఆ సూత్రం కూడా తెలియనట్లుంది. కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ నిర్మిస్తున్న వరదకాలువ తూములను పరిశీలిస్తే ఎవరికైనా ఈ సందేహం రాకమానదు మరి. నీటికి అందని ఎత్తులో తూముల నిర్మాణం చేపడుతూ అన్నదాతల ఆశలపై నీరు చల్లుతున్నారు. ఏకంగా రూ.3.58 కోట్ల నిధులను నీళ్లపాలుజేస్తున్నారు. దీంతో వరదకాలువ తూములపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులు వాటి నిర్మాణం తీరుతో ఉసూరుమంటున్నారు.
కోరుట్ల, న్యూస్‌లైన్ : ఎస్సారెస్పీలో అదనంగా చేరే వరదనీటి విని యోగం కోసం వరదకాలువ నిర్మించాలన్న ప్రతిపాదన ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండగా.. 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి చొరవతో పనులు ప్రారంభమై ఐదేళ్లలో పూర్తయ్యాయి. వరదకాలువ నిజామాబాద్ జిల్లా బాల్కొండ వద్ద మొదలై మోర్తాడ్, కమ్మర్‌పల్లి మండలాల మీదుగా 50 కిలోమీటర్లు, ఆ తర్వాత కరీంనగర్ జిల్లాలో ఇబ్రహీంపట్నం, మెట్‌పల్లి, కథలాపూర్, పెగడపల్లి, రామడుగు మండలాల నుంచి బోయినపల్లి మం డలం మధ్యమానేరు వరకు సుమారు 120 కిలోమీటర్ల మేర కొనసాగుతుంది.
ఈ మధ్యలో ఎక్కడా తూములు లేవు. 2008-09 సీజన్‌లో వరదకాలువకు మొదటిసారిగా నీరు వదిలారు. అప్పటి నుం చి ఎస్సారెస్పీలో నీరు అదనంగా చేరినప్పుడల్లా వరదకాలువకు వదులుతున్నారు. కళ్లముందే నీరు తరలిపోతున్నా తమకు ప్రయోజనం లేకపోవడంతో కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల రైతులు ఆందోళనలు చేశారు. పరివాహక ప్రాంతాల్లో ఉన్న చెరువులు నింపుకుని వాటి నుంచి పంటలు పండించుకోవడానికి కాలువకు తూములు ఏర్పాటు చేస్తే వేల ఎకరాల్లో భూములు సాగులోకి వస్తాయని ఆశపడ్డారు. ఈ క్రమంలో వరదకాలువకు తూములు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది.
నీటికి అందని ఎత్తులో..
రైతుల ఆశలకు తోడు రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో వరదకాలువకు ఎక్కడెక్కడ తూములు ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అంశంపై అధికారులు 2012లో సర్వే నిర్వహించారు. దీని ప్రకారం నిజామాబాద్ జిల్లాలో 6, కరీంనగర్ జిల్లాలో 10 తూముల ఏర్పాటుకు ప్రతిపాదిం చారు. వీటి నిర్మాణానికి ఒక్కో తూముకు రూ.18 నుంచి 25 లక్షల చొప్పున మొత్తం రూ.3.58 కోట్లు కేటాయించారు.
ఆరు నెలల క్రితం పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు 14 తూముల పనులు సగానికి మించి పూర్తికాగా.. మరో రెండింటి పనులు ప్రారంభం కాలేదు. తూములు నీటికి అందని ఎత్తులో ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నా రు. వరదకాలువ బెడ్ లెవల్‌కు ఆరున్నర మీట ర్ల ఎత్తులో వీటిని నిర్మించడంతో ఈ ఎత్తుకు నీరు చేరే విషయంలో సందేహాలు నెలకొన్నా యి. సాధారణంగా ఎస్సారెస్పీలో నీటి మట్టం 1,070 అడుగులకు మించి, పైనుంచి వరదనీటి ప్రవాహ ఉధృతి అధికంగా ఉన్న సమయంలో వరదకాలువకు నీరు వదులుతారు. ఇప్పటివరకు పలు సందర్భాల్లో వరదకాలువకు 6 నుంచి 10 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు.
ఈ మేర నీటిని వదులుతున్నా కాలువలో నీరు తూముల మట్టానికి చేరడం లేదు. చాలా చోట్ల తూములకు రెండు నుంచి మూడు మీటర్ల్ల దూరంలో నీటిమట్టం ఉంటోంది. ఎస్సారెస్పీ నుంచి 12 నుంచి 15 వేల క్యూసెక్కుల నీరు వదిలితేనే తూములకు నీరందే అవకాశాలున్నాయని స్పష్టమవుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకే తూములకు నీరు చేరకపోతే ఇంకెప్పుడు చేరుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. తూములు సక్రమంగా నిర్మిస్తే 20 వేల ఎకరాల భూములకు నీరందే అవకాశాలున్నాయి. సాంకేతిక లోపాలతో నిర్మిస్తున్న తూములకు వెచ్చిస్తున్న నిధులు వృథా అయ్యే అవకాశాలున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఉత్తుత్తి తూములు
Published Thu, Nov 7 2013 3:32 AM | Last Updated on Mon, Aug 27 2018 9:19 PM
Advertisement