రూ.కోట్లు మింగిన ‘క్యామెల్‌’ | Garika Eswaramma Arrest In Women Bank Fraud Case PSR Nellore | Sakshi
Sakshi News home page

రూ.కోట్లు మింగిన ‘క్యామెల్‌’

Published Fri, May 25 2018 12:48 PM | Last Updated on Fri, Aug 10 2018 8:42 PM

Garika Eswaramma Arrest In Women Bank Fraud Case PSR Nellore - Sakshi

మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ గరిక ఈశ్వరమ్మ

సూళ్లూరుపేట/సూళ్లూరుపేట రూరల్‌: టీడీపీ నాయకురాలు, సూళ్లూరుపేట మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్, క్యామెల్‌ మహిళా కో–ఆపరేటివ్‌ మహిళా బ్యాంక్‌ అధినేత గరిక ఈశ్వరమ్మ ఆర్థిక నేరంలో చిక్కుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన నాబార్డు, సూళ్లూరుపేట స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాల నుంచి పలురకాలుగా మొత్తం రూ.9.21 కోట్ల రుణంను ఈశ్వరమ్మ పొందింది. అయితే తిరిగి రూ.7.08 కోట్లు చెల్లించకపోవడంతో సూళ్లూరుపేట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. నాబార్డు అనుబంధ సంస్థ అయిన జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ అధికారులు సుధాభారతి, శేఖర్‌బాబులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్సై కె.ఇంద్రసేనారెడ్డి కేసు నమోదు చేశారు. బ్యాంక్‌ అధికారులు నేరుగా ఎస్పీని కలిసి వివరాలు తెలియజేసి ఆయన సూచన మేరకు సూళ్లూరుపేటకు వచ్చి ఫిర్యాదు చేయడంతో ఈశ్వరమ్మ అధికార పార్టీ నాయకురాలైనా వెంటనే కేసు నమోదైంది. మంగళవారం రాత్రి ఎస్సై సూళ్లూరుపేటలోని క్యామెల్‌ సేవా సంస్థ కార్యాలయానికి వెళ్లి ఈశ్వరమ్మ, మహిళా బ్యాంకు అధ్యక్షురాలు వనితలను అరెస్ట్‌ చేశారు.

పరసా జోక్యంతో..  
మంగళవారం రాత్రి ఈశ్వరమ్మను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టాగా టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పరసా వెంటరత్నం స్థానిక పోలీసులకు ఫోన్‌ చేసి ఆమెను వెంటనే విడుదల చేయాలని చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో ఎస్సై ఈశ్వరమ్మకు ఒక మహిళా హోంగార్డును కాపలాగా ఇచ్చి పంపించారు. తిరిగి వస్తానని చెప్పి వెళ్లిన ఈశ్వరమ్మ బుధవారం సాయంత్రమైనా రాకపోవడంతో ఎస్సై వాకబు చేసి పరారైనట్టు నిర్ధారించుకున్నారు. కాగా నిందితురాలు బెయిల్‌ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.

క్యామెల్‌తోనే మొదలైన ప్రస్థానం
ఈశ్వరమ్మ భర్త ఈశ్వరయ్య తొలుత మునెమ్మ అనే మహిళతో కలసి క్యామెల్‌ సేవాసంస్థను ఏర్పాటుచేశారు. ఫారిన్‌ కంట్రిబ్యూషన్‌ రెగ్యులేటరీ యాక్ట్‌ కింద సంస్థ నమోదయ్యాక దానికి విదేశీ నిధులు రావడం మొదలైంది. దీంతో ఈశ్వరయ్య చిత్తూరు జిల్లాలోని మేర్లపాక గ్రామానికి చెందిన ఈశ్వరమ్మను పెళ్లాడి సంస్థను ఆమె చేతుల్లో పెట్టాడు. సునామీ రావడం, పలు కార్యక్రమాల కోసం విదేశీ నిధులు ఇబ్బడిముబ్మడిగా రావడంతో సంస్థ ఆర్థికంగా నిలదొక్కుకుంది. అప్పుడే ఈశ్వరమ్మ మహిళా బ్యాంక్‌ను స్థాపించి గ్రామాల్లో పొదుపు సంఘాలను ఏర్పాటుచేసింది.

మొదలైన అక్రమాలు
క్యామెల్‌ మహిళా బ్యాంక్‌ ప్రత్యేకంగా ఇచ్చే పొదుపు రుణాల్లో భారీ కుంభకోణం చోటుచేసుకుంది. గ్రూపులకు రుణం ఇచ్చినట్లు రికార్డు చేసి అందులో సగం మాత్రమే దోచినట్లు సహకార సంఘ అధికారుల విచారణలో తేలింది. దీంతో వారు బాధిత సభ్యులు ఇచ్చిన వాంగ్మూలాలను ఆధారంగా చూపించి పోలీసులకు ఫిర్యాదు చే శా రు. ఇదిలా ఉండగా ఎస్‌బీఐ వారు ఇది వరకే మహిళా బ్యాంక్‌కు నోటీసులు ఇవ్వడంతో ఈశ్వర మ్మ కొంతమేర ఆస్తులను సదరు బ్యాంక్‌కు అ టాచ్‌ చేసినట్లు తెలిసింది. అయితే నాబార్డుకు ఎ లాంటి చెల్లింపులు జరగకపోవడంతో దాని అనుబంధ సంస్థ సహకార బ్యాంకు పోలీసులకు ఫి ర్యాదు చేసింది. ఇదిలాఉండగా ఈశ్వరమ్మ బ్యాం కుల నుంచి తీసుకున్న రుణం సొమ్ము చాలావరకు రియల్‌ఎస్టేట్‌ వ్యాపారంలో వెచ్చించి తీ వ్రంగా నష్టపోయినట్లు పలువురు చెబుతున్నారు. 

టీడీపీలో చేరి..
సూళ్లూరుపేటలో క్యామెల్‌ ఒక సేవా సంస్థ నుంచి రాజకీయ వ్యవస్థగా మారింది. 2009లో ఈశ్వరమ్మ ప్రజారాజ్యం పార్టీ తరఫున అసెంబ్లీ సీటు తెచ్చుకుని ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చి 35 వేల ఓట్లు సాధించింది. ఆ తర్వాత కాలంలో ఆమె కాంగ్రెస్‌ పార్టీలో చేరి వాకాటి నారాయణరెడ్డి గ్రూపులో స్థిరపడింది. ఆ పార్టీలో నుంచే సూళ్లూరుపేట పురపాలకానికి చైర్మన్‌ పదవికి పోటీ చేసి కౌన్సిలర్‌గా ఎన్నికైంది. ఆ తర్వాత నాటకీయ పరిణామాల మధ్య ఈశ్వరమ్మను పురపాలకానికి ఉపాధ్యక్షురాలైంది. తర్వాత ఆమె వాకాటితో కలసి టీడీపీలో చేరింది. వ్యక్తిగత మరుగుదొడ్ల సొమ్మును కూడా కాజేసినట్లు ఆరోపణలున్నాయి. కాగా ఆమెకు అనుకూలమైన కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నప్పటికి అసలు నిందితురాలు పరారీలో ఉండటంతో కేసు ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement