సాక్షి, నిజామాబాద్ : వర్షాలు భారీగా కురిసి, ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండడంతో ఈసారి రబీపై ఆశలు చిగురిస్తున్నాయి. సాధారణంగా రబీలో ఆరు తడి పంటలు ఎక్కువగా సాగు చేస్తారు. నీటి నిల్వలు పుష్కలంగా ఉండడంతో ఈసారి వరి పంట కూడా ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఆ శాఖ అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం రబీలో సుమారు 2.90 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యే అవకాశాలున్నాయి. 1.05 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 80 వేల ఎకరాల్లో శనగ, 27 వేల ఎకరాల్లో పొద్దుతిరుగుడు, 55 వేల ఎకరాల్లో జొన్న, ఎరజ్రొన్న, 75 వేల ఎకరాల్లో గోధుమ, బాజ్రా, కంది, పెసర, చెరుకు తదితర పంటలు వేసుకునే అవకాశాలున్నాయి. గతేడాది రబీలో 5.05 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు సాగయ్యాయి. పూర్తి ఆయకట్టుకు నీరు
జిల్లా వరప్రదాయిని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 15.90 టీఎంసీల నీరుంది. గతేడాది ఇదే సమయానికి 5.2 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఈసారి ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో పూర్తి స్థాయి ఆయకట్టు 1.90 లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశాలున్నాయని నీటిపారుదల శాఖ అధికారులు పేర్కొంటు న్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, కౌలాస్‌నాలా, రామడుగు తదితర ప్రాజెక్టుల్లోనూ నీటి మట్టం ఆశాజనకంగా ఉంది. దీంతో వీటి పరిధిలో సాగు విస్తీర్ణం పెరగనుందని అధికారులు భావిస్తున్నారు. భూగర్భ జలాలు కొంత మేరకు పెరగడంతో బోర్ల వద్ద కూడా వరి పంట సాగయ్యే అవకాశాలున్నాయి. ఎరువుల కోసం ప్రతిపాదనలు
పెరగనున్న సాగు విస్తీర్ణానికి సరపడా ఎరువుల కేటాయిం పుల కోసం అధికారులు ప్రణాళికను రూపొందించారు. 1.29 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని పేర్కొంటూ వ్యవసాయశాఖ డెరైక్టరేట్‌కు ప్రతిపాదనలు పంపారు. 69 వేల మెట్రిక్ టన్నుల కాంప్లెక్‌స ఎరువులు, 24 వేల మెట్రిక్ టన్నుల డీఏపీ, 26,500 మెట్రిక్ టన్నుల పొటాష్ ఎరువులు అవసరపడతాయని ఆ ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. ఏటా యూరియా కొరతతోనే రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఖరీఫ్ సీజన్‌లోనూ ఈ సమస్య తలెత్తింది. యూరియా కోసం రైతులు సొసైటీల వద్ద పడిగాపులు కాశారు. రాస్తారోకోలు, నిరసనలకు సైతం దిగారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని సరిపడా ఎరువులు కేటాయించాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు.
సబ్సిడీపై విత్తనాల పంపిణీ
ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించే చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈసారి కూడా సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేస్తోంది. 33 శాతం సబ్సిడీపై శనగ, వేరుశనగ, మొక్కజొన్న తదితర విత్తనాలను అందిస్తోంది. జిల్లా అధికారులు ఇంతకు ముందే పంపిన ప్రతిపాదనల మేరకు జిల్లాకు 10 వేల క్వింటాళ్ల శనగ విత్తనాలను ప్రభుత్వం కేటాయించింది. 5,500 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు, 4,776 క్వింటాళ్ల మొక్కజొన్న, 400 క్వింటాళ్ల పొద్దుతిరుగుడు, 50 క్వింటాళ్ల నువ్వు విత్తనాలను కేటాయించారు. ఇప్పటికే జిల్లాలో విత్తనాల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఆయా మండలాల్లో ఏర్పాటు చేసిన విత్తన పంపిణీ కేంద్రాల ద్వారా ఈ విత్తనాలను అందిస్తున్నారు.
భారీగా పెరగనున్న సాగు విస్తీర్ణం
Published Wed, Oct 9 2013 4:28 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement