హైదరాబాద్, బొబ్బిలిలో వడగళ్ల వాన
తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు మళ్లీ వచ్చాయి. నాలుగైదు రోజుల క్రితం వరకు పడిన వర్షాలు మధ్యలో మాయమైపోయి.. మళ్లీ వచ్చాయి. బుధవారం సాయంత్రం ఉన్నట్టుండి పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమైంది. కాసేపటికే చిరుజల్లులుగా మొదలై.. తర్వాత భారీగా వడగళ్ల వాన కురిసింది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఈ వర్షాల కారణంగా సచివాలయం వద్ద ఓ హోర్డింగ్ కూలిపోయింది. దాంతో అటువైపుగా బైకు మీద వెళ్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి.
అమీర్పేట, పంజాగుట్ట, నాంపల్లి, కూకట్పల్లి ప్రాంతాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురవగా, కోఠి, మలక్పేట, దిల్సుఖ్నగర్ లాంటి ప్రాంతాల్లో వడగళ్లతో కూడిన వర్షం పడింది. ఖైరతాబాద్, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, సనత్నగర్, హిమాయత్ నగర్, ఆర్టీసీ క్రాస్రోడ్స్, చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం కురిసింది. అలాగే, విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రాంతంలో కూడా వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది.