శిథిల జీవితాలకు చేయూత
తుపాను తాకిడితో శిథిలమైన జీవితాలను చూసి చెమ్మగిల్లని కన్ను లేదు.. కరగని హృదయం లేదు. కడలిలో రేగిన కల్లోలం.. తీరాన్ని తాకిన వేళ సృష్టించిన బీభత్సంతో.. అన్నివిధాలా నష్టపోయిన ‘హుదూద్’ బాధితులకు చేయూతనిచ్చేందుకు జిల్లాలో అనేకమంది ముందుకు వస్తున్నారు. చేతనైన రీతిలో సహాయం అందిస్తున్నారు.
జోలె పట్టిన న్యాయవాదులు
కాకినాడ లీగల్ : కాకినాడలో న్యాయవాదులు గురువారం జోలె పట్టారు. బార్ అసోసియేషన్ తరఫున వారు ఇప్పటివరకూ రూ.1.50 లక్షల విరాళం ఇచ్చారు. మరింత సాయం సమకూర్చేందుకు నగరంలోని ప్రధాన కూడళ్లలో వ్యాపారులు, ప్రజలు, ప్రయాణికుల నుంచి రూ.30 వేల విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమాన్ని శుక్రవారం కూడా కొనసాగిస్తామని కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పేపకాయల రామకృష్ణ, కంబాల శ్రీధర్ చెప్పారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తుపాను బాధితులకు సహాయం అందజేయాలని సీనియర్ న్యాయవాది జవహర్ అలీ కోరారు.
వారం రోజులపాటు రోజుకు లక్ష లీటర్ల మంచినీరు
ఆల్కాట్‌తోట (రాజమండ్రి) : ఓఎన్‌జీసీ రాజమండ్రి అసెట్ ఆధ్వర్యంలో తుపాను బాధితులకు రెండో విడతగా రోజుకు లక్ష లీటర్ల చొప్పున వారం రోజుల పాటు మంచినీరు అందించనున్నారు. ఇందుకు సంబంధించిన తొలి ట్యాంకర్‌ను అసెట్ మేనేజర్ దేబశీష్ సన్యాల్ గురువారం జెండా ఊపి విశాఖకు పంపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అవసరమైతే మరిన్ని రోజులు మంచినీరు సరఫరా చేయడానికి ఏర్పాటు చేశామన్నారు. మొదటి విడత రూ.8 లక్షల విలువైన 1000 ఆహార పొట్లాలు, మినరల్ వాటర్ బాటిల్స్ పంపిణీ చేశామన్నారు.
భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో..
ప్రకాశ్‌నగర్ (రాజమండ్రి) : వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేకరించిన 70 వేల వాటర్ ప్యాకెట్లు, 3 టన్నుల బియ్యం, దుస్తులను లారీలో గురువారం విశాఖపట్నం పంపించారు. ట్రస్ట్ డెరైక్టర్ ఆదిరెడ్డి వాసు, రాజమండ్రి కార్పొరేషన్‌లో పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గుత్తుల మురళీధరరావు, విప్ ఈతకోటి బాపన సుధారాణి, కార్పొరేటర్లు పిల్లి నిర్మల, మజ్జి నూకరత్నం, మాజీ కార్పొరేటర్లు మానే దొరబాబు, నల్లా రామాంజనేయులు, నాయకులు ఆర్‌వీవీ సత్యనారాయణచౌదరి, నరవ గోపాలకృష్ణ, కానుబోయిన సాగర్ తదితరులు పాల్గొన్నారు.
తుపాను బాధితుల సహాయ శిబిరం ఏర్పాటు
అమలాపురం : తుపాను బాధితులకు విరాళాలు సేకరించేందుకు కోనసీమ జిల్లా సాధన సమితి స్థానిక హైస్కూల్ సెంటర్‌లో గురువారం శిబిరం ఏర్పాటు చేసింది. దాతల నుంచి దుస్తులు, బిస్కట్లు, పాలు, పండ్లు, రొట్టెలు, విరాళాలు, పుస్తకాలు సేకరించారు. ఈ నెల 19 వరకూ శిబిరం కొనసాగుతుందని సాధన సమితి నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు మట్టపర్తి మురళీకృష్ణ, న్యాయవాది యార్లగడ్డ రవీంద్ర తెలిపారు. డీసీసీబీ డెరైక్టర్ జవ్వాది బుజ్జి, కౌన్సిలర్ మట్టపర్తి రజనీకుమారి తదితరులు పాల్గొన్నారు.
5 లారీలతో ఆహార పదార్థాల తరలింపు
కోటగుమ్మం (రాజమండ్రి) : ఆహార పదార్థాలతో సిద్ధం చేసిన 5 లారీలను రాజమండ్రిలో రాష్ట్ర అడవులు, సహకార శాఖల మంత్రి బొజ్జల గోపాలకృష్ణ గురువారం జెండా ఊపి విశాఖకు పంపించారు. ఈ లారీల్లో పాల ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు, పప్పులు, కూరగాయలు, వాటర్ ప్యాకెట్లు కూడా తరలించారు. తుపాను బాధితుల సహాయార్థం మంత్రికి రాజమండ్రి డివిజన్ సహకార సిబ్బంది రూ.70 వేల చెక్కు అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ కో ఆపరేటివ్ రిజిస్ట్రార్ కె.పద్మ, జిల్లా కో ఆపరేటివ్ ఆడిట్ అధికారి కె.కృష్ణశృతి పాల్గొన్నారు.
తుపాను బాధితులకు చేయూత
గోకవరం : తుపాను బాధితులకు వెయ్యి వాటర్ ప్యాకెట్లు, 2,500 బ్రెడ్లు, వెయ్యి బిస్కట్ ప్యాకెట్లు, 1,500 పాల ప్యాకెట్లు, 20 బస్తాల బియ్యం, 100 కేజీల కూరగాయలు పంపినట్టు కొత్తపల్లి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ప్రగళ్లపాటి సుబ్బారావు (తాతబాబు) తెలిపారు. వీటిని గురువారం వ్యాన్‌పై తరలించారు. దీనిని సంఘం గౌరవాధ్యక్షుడు ప్రగళ్లపాటి బాబులు జెండా ఊపి ప్రారంభించారు. వీటిని బాధితులకు పంచేందుకు సంఘం కార్యదర్శి పి.శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు భద్రాద్రి, కోశాధికారి సుధీర్, సంయుక్త కార్యదర్శి ప్రసాద్ తదితరులు బయలుదేరి వెళ్లారు.