నిను వీడని నీడను.. | influence of the Maoists in the district | Sakshi
Sakshi News home page

నిను వీడని నీడను..

Published Sat, Sep 28 2013 3:49 AM | Last Updated on Fri, Sep 1 2017 11:06 PM

influence of the Maoists in the district

కరీంనగర్ క్రైం, న్యూస్‌లైన్ : జిల్లాలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారుల వద్ద గన్‌మెన్లు పాతుకుపోయారు. భద్రతా కారణాల దృష్ట్యా వీరిని ఆరు నెలలకోసారి వీరిని మార్చాలనే నిబంధన ఉన్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. జిల్లాలో గతంలో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండడంతో టార్గెట్లుగా ఉన్న పలువురు నాయకులకు, అధికారులకు ప్రభుత్వం గన్‌మెన్‌లను కేటాయించింది.
 
 90మందికి పైగా నాయకులు, అధికారుల వద్ద 160 మంది గన్‌మెన్‌లు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో 60 మందికి పైగా ఏడాదికాలంగా ఒకేచోట పనిచేస్తున్నారని సమాచారం. నిబంధనల ప్రకారం.. ఆరు నెలలకోసారి గన్‌మెన్‌లను తప్పనిసరిగా మార్చాలి. ర్యాండమ్ పద్ధతిలో నక్సల్స్‌పై అవగాహన ఉండి చురుకుగా వ్యవహరించేవారినే గన్‌మెన్‌లుగా ఎంపికచేయాలి. ప్రమాదాల్లో అధికారులను, నాయకులను రక్షించే విధానాలపైనా వీరికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు.
 
 వృత్తిశిక్షణలో భాగంగా ఆరు నెలలకోసారి వివిధ అంశాలపై ప్రత్యేక తర్ఫీదు ఇస్తారు. జిల్లాలో ఈ నిబంధనలేవీ అమలు కావడం లేదు. ఒక్కొక్క నాయకుడి వద్ద ఏళ్ల తరబడి పనిచేస్తున్నవారు ఉన్నారు. నాయకులు కూడా వీరిని వదులుకోవడం లేదు. ఒకవేళ బదిలీ చేసినా పట్టుబట్టి వెనక్కి పిలిపించుకుంటున్నారు. ఒకప్పుడు నేతల రక్షణకే పరిమితమైన గన్‌మెన్లు ఇప్పుడు అన్ని రకాల వ్యవహారాల్లో తలమునకలవుతున్నారు. నాయకుల వెంట ఉంటూ రాజభోగాలు అనుభవిస్తున్నారు. దీంతో కొందరు నాయకులకు గన్‌మెన్‌లుగా వెళ్లేందుకు పైరవీలు సైతం చేస్తుండడం గమనార్హం.
 
 ఆరోపణలొచ్చినా...
 కొందరు గన్‌మెన్లపై ఆరోపణలొచ్చినా సదరు నాయకులు, అధికారులు వెనకేసుకొస్తున్నారు. నేతల అండదండలతో రెచ్చిపోతున్నా ఉన్నతాధికారులు వారిపై చర్యలు తీసుకునేందుకు వెనకాడుతున్నారు. కొందరు అధికారులు సైతం గన్‌మెన్ల ద్వారా తమ పనులు చేయించుకునేందుకు ముందుకు వస్తుండడంతో ఇక వారికి అడ్డుఅదుపు లేకుండాపోతోంది. ఈ మధ్య కాలంలో మంత్రి శ్రీధర్‌బాబు గన్‌మెన్లుగా కొనసాగుతున్నవారు శిక్షణ సందర్భంగా పోలీసు సిబ్బందిపైనే దాడిచేశారు. ఓ ఏఆర్ కానిస్టేబుల్ ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీసుకోలేదు. గతంలో కూడా తప్పతాగి చిందులు వేసిన సంఘటనలున్నా... వారిపై కనీసం విచారణ కూడా చేపట్టలేదంటే గన్‌మెన్లకున్న పలుకుడి తెలుస్తోంది. మంత్రి గన్‌మెన్లపై ఇటీవల ఆరోపణలు ఎక్కువ కావడంతో పది రోజులపాటు కొత్తవారిని పంపించి మళ్లీ పాతవారినే గన్‌మెన్లుగా నియమించారు.
 
   మంత్రి శ్రీధర్‌బాబు వద్ద... ఆయన విప్‌గా పనిచేసినప్పటి నుంచి ఇప్పటివరకు వేణు(3829), యాదగిరి(348), బాలు(3048) గన్‌మెన్‌లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరితోపాటు రాజశేఖర్(2057), సంపత్‌కుమార్(1268), భాస్కర్(3050), జయప్రకాశ్(3014) కూడా ఏడాది కాలంగా పనిచేస్తున్నారు.
 
   కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ వద్ద సురేశ్ అనే గన్‌మెన్ మూడేళ్లుగా పనిచేస్తున్నారు.
  ప్రభుత్వ విప్ అరెపల్లి మోహన్ వద్ద కృష్ణ అనే గన్‌మెన్ మూడున్నరేళ్లు పనిచేయగా ఇటీవలే మార్చి కొత్తవారిని నియమించారు. మళ్లీ పాతవారినే నియమించాలని నేతలు అధికారులపై ఒత్తిడి తేవడంతో నియామకానికి వారు పచ్చజెండా ఊపారని సమాచారం.
 
  గతంలో ఇక్కడ డీఐజీగా పనిచేసిన రవిశంకర్ అయ్యన్నార్ దగ్గరినుంచి ఇప్పటి డీఐజీ వరకు గన్‌మెన్‌గా డిస్ట్రిక్ట్‌గార్డ్స్‌కు చెందిన వేణు పనిచేస్తున్నారు.
 
  గతంలో పని చేసిన పరిపాలన ఎస్పీల నుంచి ప్రస్తుత అడిషనల్ ఎస్పీ జనార్దన్‌రెడ్డి వరకు ఐదున్నరేళ్లుగా మెండిల్ అనే గన్‌మెనే విధులు నిర్వర్తిస్తున్నారు.గన్‌మెన్లను పర్యవేక్షించి, వారికి దిశానిర్ధేశం చేయాల్సిన ఆర్‌ఐ యాకుబ్‌రెడ్డి వద్ద ప్రసాద్ అనే గన్‌మెన్ మూడేళ్లుగా పనిచేస్తున్నారు.
 
   ఫయీమ్ అనే గన్‌మెన్ ఆరేళ్లుగా కలెక్టర్ల వద్ద పనిచేశారు. సుమితాడావ్రా పదవీకాలం నుంచి ఈ మధ్యే బదిలీ అయిన స్మితాసబర్వాల్ వరకు ఆయన విధులు నిర్వర్తించగా, కలెక్టర్‌గా వీరబ్రహ్మయ్య వచ్చిన తర్వాత మార్చారు.
 
  సీఐ సంజీవ్‌కుమార్ వద్ద మండెపల్లి శ్రీనివాస్ అనే గన్‌మెన్ ఆరేళ్లుగా పనిచేస్తున్నాడు. సదరు సీఐ రెండు డిపార్ట్‌మెంట్లు మారినా శ్రీనివాస్ మాత్రం మారలేదని సమాచారం. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement