జోసఫ్‌ లైంగిక వేధింపుల కేసు దర్యాప్తు ముమ్మరం | Investigation Intensifies Joseph molestation abuse case | Sakshi
Sakshi News home page

జోసఫ్‌ లైంగిక వేధింపుల కేసు దర్యాప్తు ముమ్మరం

Published Sun, Aug 19 2018 10:52 AM | Last Updated on Tue, Oct 2 2018 6:54 PM

 Investigation Intensifies Joseph molestation abuse case - Sakshi

ఒంగోలు: స్థానిక రైల్‌పేటలోని పాస్టర్‌ కొడవటిగంటి జోసఫ్‌ (76) లైంగిక వేధింపుల కేసులో విచారణను అధికారులు ముమ్మరం చేశారు. శనివారం ఉదయం రెండో జాయింట్‌ కలెక్టర్‌తో పాటు పలువురు అధికారులు బాలసదన్‌లో ఉన్న బాధిత బాలికల వివరాలను పాఠశాల రికార్డులతో పోల్చి చూశారు. 46 మంది మాత్రమే బాలసదన్‌లో ఉండటంతో మిగిలిన ఏడుగురు ఏమయ్యారనే దానిపై హాస్టల్‌ వార్డెన్‌ను పిలిపించి విచారించారు. ఆమె ఇచ్చిన నంబర్లకు ఫోన్‌ చేసి వారు తమ ఇళ్ల వద్దే క్షేమంగా ఉన్నట్లు నిర్థారించుకున్నారు. అనంతరం విద్యార్థినులతో ఉపాధ్యాయులు మాట్లాడేందుకు అనుమతించారు. పిల్లలు ఇంకా ఏమైనా వివరాలు వెల్లడిస్తారని అధికారులు భావించగా ఉపా«ధ్యాయినులను పట్టుకొని విద్యార్థినులు భోరున విలపించారు. వారు విలపిస్తున్న తీరు చూసి ఉపా«ధ్యాయినులు సైతం కంటతడి పెట్టుకోవడం స్థానికులను కలచివేసింది. 

పిల్లలను ఎక్కడ ఉంచాలి?
బాలసదన్‌లో ఉన్న పిల్లలను ఎక్కడ ఉంచాలన్న దానిపై తర్జనభర్జన కొనసాగుతోంది. జిల్లా యంత్రాంగం ఒక వైపు పిల్లలను తమ తల్లిదండ్రులతో పాటు పంపించాలని యోచిస్తుంటే బాలల సంరక్షణ కమిటీ సభ్యులు మాత్రం పిల్లలను బయటకు పంపితే కేసు నీరుగార్చేందుకు అవకాశాలు లేకపోలేదనే అనుమానం వ్యక్తం చేసినట్లు సమాచారం. బాలసదన్‌లో లేదా కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలల్లో మాత్రమే చేర్పించేందుకు విద్యాశాఖ అధికారులు సిద్ధపడ్డారు. ఇలా అధికారులే బాలికలను ఎక్కడ ఉంచాలన్న దానిపై తర్జన భర్జన పడుతున్న నేపథ్యంలో వారు తీసుకునే తుది నిర్ణయం భవిష్యత్తులో కేసుపై ప్రభావాన్ని తప్పక చూపతుందనే వాదన వినవస్తోంది.

వెలుగులోకి కొత్త కోణాలు..
ఈ కేసులో పలు కొత్త అంశాలు కూడా దర్యాప్తు అధికారుల దృష్టికి వచ్చినట్లు సమాచారం. అంతే కాకుండా వాటికి ఇద్దరు కారకులనే ఆరోపణలు వస్తుండడంతో తాజా ఆరోపణలపై కూడా దర్యాప్తు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గతంలో కేంద్ర నిఘా బృందాలు విదేశాల నుంచి డబ్బులు రప్పించుకునే స్వచ్ఛంద సంస్థల నుంచి ప్రతి మూడు నెలలకోసారి ఆడిట్‌ రిపోర్టులు తెప్పించుకునేవి. వాటి ప్రకారం నిధులు ఎంత వస్తున్నాయి? వాటిని ఎలా ఖర్చు చేస్తున్నారనే వివరాలను పరిశీలించే వారు.

 కానీ ఇటీవల మారిన ఉత్తర్వుల మేరకు వారు కేవలం ఎఫ్‌ఆర్‌సీకి దరఖాస్తు చేసుకునే సమయంలో మాత్రమే విదేశాల నుంచి నిధులు తెప్పించుకునే సంస్థలపై కేంద్ర నిఘా బృందాలు విచారణ చేపడుతున్నాయని, ఆ తర్వా ఆ సంస్థల పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలు బాహాటంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వీటికి సంబంధించిన వివరాలను ఎలా సేకరించాలనే దానిపై అధికారులు దృష్టి సారించారు. మరో వైపు సత్వరమే స్పందించాల్సిన మహిళా హక్కుల కమిషన్‌ చైర్‌పర్సన్‌ కూడా ఈ ఘటనపై ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం, కనీసం బాధిత బాలికలను పరామర్శించేందుకు రాకపోవడంపై కూడా అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. 

అన్ని హోమ్‌లపై దర్యాప్తు
జిల్లాలో ఇప్పటి వరకు 76 సంస్థలు హోమ్‌ల నిర్వహణకు అనుమతి తీసుకున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. హోమ్‌ల నిర్వహణకు అనుమతులు తీసుకున్నా అందులో వీధి బాలలు, అనాథ బాలలను చేర్చుకునే క్రమంలో తప్పకుండా బాలల సంరక్షణ కమిటీకి తెలియజేయాలనే నిబంధన ఉంది. ఇప్పటి వరకు చాలా సంస్థలు ఈ వ్యవహారాన్ని నిర్లక్ష్యం చేసినట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై ఎస్పీ సత్యఏసుబాబు మాట్లాడుతూ అన్ని హోమ్‌లపై దర్యాప్తు ముమ్మరం చేస్తున్నామన్నారు. అంతే కాకుండా ప్రస్తుతం కేసు ప్రాథమిక దశలోనే ఉందని, నూతనంగా వెలుగులోకి వస్తున్న వారి పేర్లపై కూడా దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. కేసును లోతుగా నిశితంగా దర్యాప్తు చేస్తామని ఎస్పీ ప్రకటించారు. 

ఐఈఆర్‌ఎఫ్‌ వద్ద ఉద్రిక్తం
ఒంగోలు టౌన్‌: స్థానిక ఐఈఆర్‌ఎఫ్‌ వద్ద çశనివారం ఉద్రిక్తం చోటుచేసుకొంది. ఐఈఆర్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చిల్డ్రన్‌ హోమ్‌ను మూసివేయాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ, ఐద్వా ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. నిర్వాహకులు, ఆందోళనకారుల మ«ధ్య వాగ్వాదం జరిగింది. కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఐద్వా జిల్లా కార్యదర్శి ఎస్‌కే మున్వర్‌సుల్తానా మాట్లాడుతూ మతం ముసుగులో పెద్ద మనుషులుగా చెలామణి అవుతూ విద్యాబుద్ధులు నేర్పాల్సిన యాజమాన్యం కీచకులుగా వ్యవహరించడం సిగ్గు చేటన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సీహెచ్‌ వినోద్‌ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంగా, శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న నాయకులపై పాఠశాల యాజమాన్యం గూండాలతో దాడిచేయించడం సిగ్గుచేటన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ నగర కార్యదర్శి కె.చిన్నపరెడ్డి, ఐద్వా నగర కార్యదర్శి కె. రమాదేవి పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement