ఖమ్మం, న్యూస్‌లైన్ : విద్యార్థులకు చిన్న తనం నుంచే శాస్త్ర, సాంకేతిక రంగాలపై అవగాహన కల్పించి, వారిలో దాగిఉన్న సృజనాత్మకతను వెలికితీసి భావి శాస్త్రవేత్తలుగా తయారు చేసే ఉద్దేశంతో చేపట్టిన ఇన్‌స్పైర్ కార్యక్రమం జిల్లాలో తూ తూ మంత్రంగా ప్రారంభమైంది. గత మూడేళ్లుగా వరస వైఫల్యం చెందుతున్నా విద్యాశాఖ అధికారులు గుణపాఠం నేర్వకపోవడంతో ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు విద్యార్థులు ఉత్సాహం చూపలేదు. అధికారుల పర్యవేక్షణ లోపంతో హాజరైన వారు కూడా విజ్ఞాన పరమైన అంశాలలో కాకుండా అట్టముక్కలు, ఆకులు, పండ్ల ప్రదర్శనలకే పరిమితమయ్యారు.
ఉత్సాహం చూపని విద్యార్థులు...
అధికారుల అలసత్వం, కొరవడిన ప్రచారంతో ఇన్‌స్పైర్ కార్యక్రమంలో పాల్గొనేందుకు విద్యార్థులు ఉత్సాహం చూపడం లేదు. 2011లో తొలిసారిగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి 1048 మోడళ్లను ఎంపిక చేసినా వాటిలో 300 పాఠశాలల నుంచి ప్రదర్శనలు రాలేదు. మరుసటి సంవత్సరం 450 మోడళ్లకు గానూ 150 ప్రదర్శనలు మాత్రమే వచ్చాయి. ఈ సంవత్సరం మొదటి విడుతలో 328, రెండో విడుతలో 158 మొత్తం 486 మోడళ్లతోపాటు గతంలో ఎంపిక చేసిన వాటిలో ప్రదర్శనలో పాల్గొనని 351 మోడల్స్ కలుపుకుని మొత్తం 837 ప్రదర్శనలు వస్తాయని భావించారు. అయితే ఆదివారం ఖమ్మంలోని ఎస్‌ఎఫ్‌ఎస్ పాఠశాలలో తొలిరోజు ప్రదర్శనలో మధ్యాహ్నం వరకు 150 ప్రదర్శనలు రాగా సాయంత్రం వరకు ఈ సంఖ్య 300 దాటిందని అధికారులు చెపుతున్నారు. ఒక్కో ప్రదర్శన తయారు చేసేందుకు రూ. 5 వేల చెక్కును ముందుగానే పాఠశాల ప్రధానోపాధ్యాయుడి ఖాతాలో జమ చేశారు. అయినా ప్రదర్శనలో పాల్గొనే విద్యార్థుల సంఖ్య ఏ ఏడుకాఏడు తగ్గిపోతోంది. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాలు కలిపి 1276 యూపీఎస్, ఉన్నత పాఠశాలలు ఉండగా, కేవలం 486 పాఠశాలల నుంచే దరఖాస్తులు రావడం గమనార్హం.
మొక్కుబడిగా ప్రదర్శనలు...
ఎంపిక చేసిన మోడళ్లలో అత్యధిక పాఠశాలలు పాల్గొనకపోవడంతో పాటు పాల్గొన్నవారు కూడా మొక్కబడి ప్రదర్శనలకే పరిమిత మయ్యారు. ఆయా పాఠశాలల్లో భౌతిక, రసాయన, భూగోళ, జీవశాస్త్రాలు బోధించే ఉపాధ్యాయులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సమాజానికి సందేశాన్ని ఇవ్వడంతోపాటు, నూతన ఆవిష్కరణలు తయారు చేసేందుకు ప్రోత్సహించాలి. వారి ఆలోచనలు, విజ్ఞానాన్ని జోడించి విద్యార్థులతో ప్రదర్శనలు తయారు చేయించాలి. కానీ ఆదివారం వచ్చిన వాటిలో అలా కసరత్తు చేసినవి నామమాత్రమేననే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రూ. 5 వేలు తీసుకున్నాం కదా.. ఏదో ఒకటి తయారు చేస్తే సరిపోతుందనే ఆలోచనతో నెట్‌లో ఉన్న పలు బొమ్మలను డౌన్‌లోడ్ చేసిన అట్టముక్కలపై అతికించడం, మారె ్కట్‌లో దొరికే పండ్లు, ఆకులు అలాలు పేర్చి ప్రదర్శనగా చూపించడం విడ్డూరమని పలువురు విమర్శిస్తున్నారు. రూ. 5 వేలు ఇస్తే కేవలం రూ.100, 200 ఖర్చుచేసి ప్రదర్శనలు ఇస్తారా అని జిల్లా అధికారులు సదరు ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఇదేం ఇన్‌స్పైర్ !
Published Mon, Aug 12 2013 2:28 AM | Last Updated on Fri, Sep 1 2017 9:47 PM
Advertisement
Advertisement