సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లాలో కనుమ పండుగ కనువిందుగా జరుగుతోంది. మరక దున్నెందుకు ఏడాదంతా చాకిరీచేసి సహకరించిన గోవులకు రైతులు పూజలు నిర్వహిస్తున్నారు. పంటలకు క్రిమికీటకాల బెడద తొలగించటంలో అండగా నిలిచే పక్షులకు ధాన్యాన్ని ఆహారంగా పెట్టి రుణం తీర్చుకొంటున్నారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల్లో పాల్గొని కనుమ కమనీయతను ఆస్వాదిస్తున్నారు
ఈడుపుగల్లు, ఉప్పులూరు, గోడవర్రు, అంపాపురంలలో కోడిపందాలు జోరుగా సాగుతున్నాయి. సంప్రదాయబద్ధంగా సాగుతుండటంతో యువత పెంపుడు పుంజులను దింపి సై అంటున్నారు. చివరి రోజు కావటంతో రైతులు, మహిళలు, యువత పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ముగ్గుల పోటీలు, కోలాటాలు ఆకట్టుకుంటున్నాయి. పదేళ్ల తర్వాత సంపూర్ణ సంక్రాంతి సంబరాన్ని ఆస్వాదిస్తున్నామని రైతు కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. కనుమ సంబరాల్లో మంత్రి కొడాలి నాని, ఆయన కుమార్తె, కుమారుడు పాల్గొన్నారు.
పెనమలూరు నియోజకవర్గంలో సంపూర్ణ సంక్రాంతి వేడుకలు సాగుతున్నాయి. సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలతో పాటు కోడిపందాల బరిలోనూ యువత మేమే సైతం అంటూ ముందుకొచ్చారు. ఇంత సరదాగా సంక్రాంతి జరుపుకోవడం చెప్పలేని ఆనందాన్ని కలిగిస్తోందని యువత అంటున్నారు.
జగ్గయ్యపేట పాత గడ్డపై వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షులు చౌడవరపు జగదీష్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకల్లో వైఎస్సార్‌సీపీ యువ నేతలు సామినేని వెంకట కృష్ణప్రసాద్, ప్రశాంత్ బాబు, తన్నీరు నాగేశ్వరావు, తుమ్మల ప్రభాకర్, నూకల సాంబశివరావు, నూకల రంగా, నంబూరి రవి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment