నమ్మకం ఉంచండి
అనంతపురం క్రైం : ప్రజలు పోలీసులపై నమ్మకం ఉంచాలని కొత్త ఎస్పీ రాజశేఖర్ బాబు కోరారు. సమస్యలతో స్టేషన్ మెట్లెక్కే బాధితులకు సత్వర న్యాయం అందిస్తామని స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం 11.10 గంటలకు ఎస్పీ సెంథిల్‌కుమార్ బాధ్యతల నుంచి తప్పుకోగా.. ఆ స్థానంలో కొత్త ఎస్పీగా రాజశేఖర్‌బాబు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇరువురూ శాంతిభద్రతల గురించి మాట్లాడుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్‌లో రాజశేఖర్‌బాబు మాట్లాడుతూ.. ఫ్యాక్షన్‌ను రూపుమాపేందుకు శ్రమిస్తామని, ఇందుకు రాజకీయ నేతలు సహకరించాలన్నారు. పోలీసులు స్వేచ్ఛగా పనిచేసుకెళ్లే వాతావరణానికి అన్ని చర్యలు తీసుకుంటానన్నారు.
బాధితుల పక్షాన నిలిచేలా ప్రణాళికా బద్దంగా వ్యవహరిస్తామన్నారు. ప్రజల పట్ల సిబ్బంది కూడా మర్యాద పూర్వకంగా మెలిగేలా సూచనలు చేస్తానన్నారు. జిల్లాతో ఇప్పటికే తనకు అనుబంధం ఉండడంతో శాంతి భద్రతల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తానన్నారు. మహిళలపై పెరుగుతున్న ఆకృత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు తమ సమస్యలు, ఇబ్బందులు చెప్పుకునేందుకు ప్రతి సోమవారం ఏర్పాటు చేసిన ‘గ్రీవెన్స్’ను యథావిధిగా నిర్వహిస్తానన్నారు. సిబ్బంది సంక్షేమానికి కూడా పెద్దపీట వేస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో గట్టి బందోబస్తు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఘన స్వాగతం
జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకున్న ఎస్పీ రాజశేఖర్‌బాబుకు ఘన స్వాగతం లభించింది. పోలీసు లాంఛనాలతో గౌరవ వందనం చేశారు. అనంతరం పలువురు అధికారులు ఎస్పీని చాంబర్‌లో కలిసి పుష్పగుచ్చాలు అందించారు. ఎస్పీని కలిసిన వారిలో అదనపు ఎస్పీ రాంప్రసాద్‌రావు, ఓఎస్డీ సూర్యప్రకాష్, డీఎస్పీ నాగరాజ, పీటీసీ డీఎస్పీ ఏ.శ్రీనివాసులు, సీఐలు విజయ్‌కుమార్, మన్సూరుద్దీన్, దేవానంద్, గోరంట్ల మాధవ్, మధు, జిల్లా మినిస్టీరియల్ స్టాఫ్, జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు త్రిలోక్‌నాథ్, అనంతపురం, పెనుకొండ పోలీస్ సబ్ డివిజినల్ అధికారులు ఉన్నారు.