కొత్త పార్టీ పెట్టాలా ? నిశబ్దంగా ఉండాలా ?
రాష్ట్రంలో కొత్త పార్టీ ఏర్పాటు చేయాలా లేక నిశబ్దంగా ఉండాలా అనే మీమాంశంలో అపద్దర్మ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీ బహిష్కృతులైన సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలతో తన నివాసంలో భేటీ అయ్యారు. రేపు, ఎల్లుండు కూడా వరుసగా తనతో వచ్చే నేతలలో ఆయన భేటీ కానున్నారు.
కొత్త పార్టీ అంశంపై ఆయన ఈ సందర్భంగా సదరు ఎంపీలతో చర్చించనున్నారు. సమైక్యవాది అని ముద్రపడిన కిరణ్ కొత్త పార్టీ ఏర్పాటు చేస్తే అది సీమాంధ్రకే పరిమితమా లేక తెలంగాణలో కూడా ఏర్పాటు చేయాలా అనే కోణంలో ఆలోచించనున్నారు. అంతేకాకుండా కొత్త పార్టీ పెడితే ప్రజలు ఎంత మంది తన పార్టీ వైపు మొగ్గు చూపుతారని విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.
సమైక్యమే తన విధానం అంటూ కిరణ్ కుమార్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవిలో ఉండగా నినదించారు. అందులో భాగంగానే అసెంబ్లీకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ బిల్లు తప్పుల తడకగా అభివర్ణించారు. ఆ క్రమంలో బిల్లును తిప్పి రాష్ట్రపతికి పంపారు. అయితే రాష్ట్రపతి ఆ బిల్లును పార్లమెంట్కు పంపారు. దీంతో బిల్లు ఇరు సభలలో ఆమోదం పొందింది.
ఈ నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే పదవులతోపాటు కాంగ్రెస్ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కిరణ్ రాజీనామాను గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. అపద్దర్మ సీఎంగా కొనసాగాలని గవర్నర్ కోరారు. అయిన కిరణ్ అపద్దర్మ సీఎంగా ఇప్పటి వరకు బాధ్యతలు చేపట్టలేదు. కాగా సీఎం కిరణ్ కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయని గత నాలుగైదు నెలలుగా రాష్ట్రంలో పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే.