జోరుగా రిజిస్ట్రేషన్లు
కాకినాడ లీగల్ :నగర, పట్టణ ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువ ఆగస్టు ఒకటి నుంచి 30 శాతం పెరగబోతుందన్న వార్తతో జూలైలో చివరిరోజైన గురువారం రిజిస్ట్రేషన్లు ముమ్మరంగా జరిగాయి. జిల్లావ్యాప్తంగా రెండువేల వరకు క్రయవిక్రయాలు జరగ్గా, ఆ శాఖకు రూ.2 కోట్ల ఆదాయం సమకూరిందని అంచనా. సాధారణంగా కాకినాడ, రాజమండ్రి జిల్లా రిజిస్ట్రార్ల పరిధిలోని 32 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ద్వారా రోజూ రాష్ర్ట ఖజానాకు కోటి నుంచి కోటిన్నర ఆదాయం వస్తుంది. రోజూ కాకినాడ, రాజమండ్రి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సగటున 50, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 10 నుంచి 30 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. భూముల విలువ పెరిగితే రిజిస్ట్రేషన్ రుసుము పెరుగుతుందన్న భావనతో క్రయవిక్రయదారులు ఎగబడడంతో గురువారం రిజిస్ట్రార్ కార్యాలయాలు కిటకిటలాడాయి.
ఏటా మాదిరే ఈ ఏడాది కూడా ఆగస్టు ఒకటి నుంచి భూముల మార్కెట్ విలువలను పెంచాలని నిర్ణయించిన పెంపు బాధ్యతను జిల్లాస్థాయి కమిటీకి అప్పగించింది. పలు దఫాలు సమావేశమైన ఈ కమిటీ చివరకు 30 శాతం మేర పెంచాలని తీర్మానించింది. ఆగస్టు ఒకటి నుంచి పెంపు వర్తించేలా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ఇదే గురువారం నాటి ముమ్మర రిజిస్ట్రేషన్లకు కారణమైంది. అయితే భూముల విలువ పెంపును తాత్కాలికంగా వాయిదా వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ (ఇన్‌చార్జి) విజయలక్ష్మి ‘సాక్షి’కి తెలిపారు. జిల్లాస్థాయి కమిటీ నిర్ణయం అమలుపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చే వరకు రిజిస్ట్రేషన్లు పాత రేట్లతోనే జరుగుతాయన్నారు.