సాక్షి ప్రతినిధి, కర్నూలు: విభజనకు కారణమైన కాంగ్రెస్.. అందుకు సహకరించిన టీడీపీలో టిక్కెట్ల లొల్లి రచ్చకెక్కుతోంది. కాంగ్రెస్‌లో ఉంటే మనుగడ లేదని భావించిన ఆ పార్టీ నాయకులు.. వైఎస్‌ఆర్‌సీపీలోకి వెళ్లే అవకాశం లేక టీడీపీలో చేరిపోయారు.
ఇప్పటి వరకు ఆ పార్టీ జెండా మోసిన వారిని కాదని ఇటీవల పార్టీలోకొచ్చిన నేతలకు అధినేత రెడ్ కార్పెట్ వేస్తుండటం కార్యకర్తలకు మింగుపడటం లేదు. సార్వత్రిక ఎన్నికల వేళ టిక్కెట్ల విషయంలోనూ ఆయన రెండు కళ్ల సిద్ధాంతంతోనే ముందుకెళ్తుండటం పోట్లాటలకు కారణమవుతోంది. పాణ్యం టిక్కెట్ విషయంలో తాజా మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి, రియల్టర్ కె.జె.రెడ్డి మధ్య బుధవారం వివాదం చెలరేగింది. కాంగ్రెస్‌ను వీడిన ఏరాసు పాణ్యం టిక్కెట్ ఆశిస్తున్నారు. అంతకు ముందే టిక్కెట్ హామీతో పార్టీలో చేరిన కె.జె.రెడ్డి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.
ఒకరికి తెలియకుండా మరొకరికి అధినేత టిక్కెట్‌పై హామీ ఇవ్వడం ఎన్నికల వేళ గందరగోళానికి తావిస్తోంది. బుధవారం కల్లూరు టీడీపీ కార్యాలయంలో ఏరాసు విలేకరుల సమావేశం ఉందని.. టిక్కెట్ ఖరారైన విషయమై మాట్లాడతారంటూ ఆయన పీఏ ఒకరు మీడియా ప్రతినిధులకు సమాచారం చేరవేశారు. తీరా అక్కడికెళ్లగా పార్టీ మండల కార్యకర్తల సమావేశం జరుగుతుండటం మీడియా ప్రతినిధులను ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే కార్యాలయం ఎదుట ఏరాసు ఫొటోతో ఫ్లెక్సీ ఉండటంతో.. టిక్కెట్ ఖరారు కానప్పుడు ఫ్లెక్సీ ఎలా ఏర్పాటు చేస్తారంటూ కె.జె.రెడ్డి వర్గీయులు చించేయడం ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీకి చెందిన ఓ ముఖ్య నాయకుడు ఈ డ్రామాకు తెరతీసినట్లు చర్చ జరుగుతోంది.
ఆళ్లగడ్డలో గంగుల వర్సెస్ ఇరిగెల
నియోజకవర్గంలో గంగుల వర్సెస్ ఇరిగెల మధ్య ఏళ్ల తరబడిగా టిక్కెట్ వార్ కొనసాగుతోంది. 1997లో ఇరిగెల కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. మొదట గంగులను సంప్రదించినా ఎన్నికలకు దూరంగా ఉంటానని చెప్పడంతో ఇరిగెలకు అవకాశం దక్కింది. 1999లో గుంగుల ప్రతాప్‌ర్‌రెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. ఎన్నికల అనంతరం గంగుల బీజేపీలో చేరిపోయారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరడంతో 2004లో ఆళ్లగడ్డ కాంగ్రెస్ టికెట్‌పై ఇరిగెల ఆశలు పెట్టుకున్నారు.
చివరి నిమిషంలో గంగుల కాంగ్రెస్‌లో చేరి టికెట్ దక్కించుకున్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో 2009, 2012లో జరిగిన ఎన్నికల్లో ఇరిగెల రాంపుల్లారెడ్డి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినా గెలుపొందలేకపోయారు. ఈ సారి కూడా టీడీపీ తరఫున పోటీ చేయాలని భావించినా.. గంగులను అధినేత చంద్రబాబు బుధవారం టీడీపీలో చేర్చుకోవడంతో ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఇన్నాళ్లు టిక్కెట్ తనకేనని నమ్మి పని చేస్తున్న ఇరిగెలకు చంద్రబాబు చేయివ్వడంతో ఆయన వర్గం అసంతృప్తితో రగిలిపోతున్నారు.
కర్నూలు కాంగ్రెస్‌లో ‘పంచాయితీ’
కాంగ్రెస్ మాజీ మేయర్ ఫిరోజ్ బేగం, ప్రముఖ వ్యాపారవేత్త అహ్మద్ అలీఖాన్ మధ్య టిక్కెట్ విషయమై వివాదం చేలరేగింది. కర్నూలు టికెట్ అలీఖాన్‌కు ఖరారు చేశారనే ప్రచారం జరుగుతోంది. ఇదే టిక్కెట్‌ను ఆశిస్తున్న ఫిరోజ్‌బేగంకు విషయం తెలిసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వీరిద్దరి మధ్య టిక్కెట్ విషయమై గొడవ చోటు చేసుకున్నట్లు సమాచారం.
టీడీపీలో రె‘బెల్స్’
Published Thu, Mar 13 2014 2:56 AM | Last Updated on Fri, Mar 22 2019 6:18 PM
Advertisement
Advertisement