సాక్షి ప్రతినిధి, కర్నూలు: నష్టం జరిగిపోయింది. తెలుగు ప్రజలను నిలువునా చీల్చేశారు. ఒంటరి పోరు సాగించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వని అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజకీయ భవిష్యత్ దృష్ట్యా రాజీ‘డ్రామా’లకు తెర తీశారు. విభజనను అడ్డుకునేందుకు తమ ప్రాణాలు అడ్డేస్తామని చెప్పిన నాయకులు ప్రజల ముందుకు వెళ్లలేక ముఖం చాటేస్తున్నారు. ఎన్నికలు ముంచుకొస్తుండటంతో రాజకీయ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఆ పార్టీ వీడుతున్నామంటూ సరికొత్త డ్రామాకు తెరతీశారు.
ఈ కోవలో మంగళవారం టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాప్‌రెడ్డిలు పార్టీ సభ్యత్వంతో పాటు మంత్రి పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక టీడీపీ నాయకుల తీరు నీరో చక్రవర్తిని తలపిస్తోంది. ఎవరేమైపోయినా ఫర్వాలేదు.. ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ధ్యేయంతో చేసిన నీచ రాజకీయం సీమాంధ్రను కోలుకోలేని దెబ్బతీసింది. మూడు నెలలకు పైగా ఉద్యోగ.. ఉపాధ్యాయ.. విద్యార్థులు.. న్యాయవాదులు.. కార్మికులు.. రైతులు.. చిన్నా పెద్ద తేడా లేకుండా అలుపెరగని పోరు సాగించారు. వీరితో కలసి నడవాల్సిన అధికార పార్టీ నేతలు సమైక్యవాదులపై కేసులు బనాయించి జైల్లో పెట్టించడం ద్వారా వారు ఎటువైపు మొగ్గుచూపుతున్నారో బయటపెట్టారు. ఆ సందర్భంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే పోరుబాట పట్టింది. మొదటి నుంచి ఆ పార్టీ నాయకులు తమ పదవులను తృణప్రాయంగా భావించి రాజీనామాలు చేశారు. ఆ తర్వాత కూడా ఆందోళనల్లో పాల్పంచుకుంటూ సమైక్యవాదులకు వెన్నుదన్నుగా నిలిచారు. తమతో పాటు నడవాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చినా కాంగ్రెస్, టీడీపీ నాయకులు చెవికెక్కించుకోలేదు. తీరా విభజన కాయమైపోయిన తరుణంలో ఆ రెండు పార్టీలు అందరూ కలసి రావాలని కోరడంతో ప్రజలు నవ్వుకున్నారు. కీలకమైన సమయంలో తమ పదవులను అంటిపెట్టుకున్న నాయకులు ఇప్పుడు రాజీనామాలు చేసినా ఒరిగేదేమీ లేదనే చర్చ జరుగుతోంది. కేవలం వారి భవిష్యత్తు కోసమే వీరంతా పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నారని సమైక్యవాదులు మండిపడుతున్నారు.
ఆ పార్టీలు గల్లంతే
విభజన పాపాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్.. మద్దతు తెలిపిన తెలుగుదేశం పార్టీలు ఇక గల్లంతేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి రాజీనామా చేసిన టీజీ, ఏరాసులు ఏ పార్టీలోకి వెళ్లాలో తెలియక తికమకపడుతున్నారు. ఇకపోతే పాణ్యం, ఆలూరు, కోడుమూరు, నందికొట్కూరు ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, నీరజారెడ్డి, మురళీకృష్ణ, లబ్బి వెంకటస్వామిలు కూడా రాజీనామా చేయనున్నట్లు సమాచారం.
వీరంతా ఏ పార్టీ వైపు అడుగులేస్తారో తెలియని సందిగ్ధం నెలకొంది. ఆయా స్థానాల్లో ద్వితీయ శ్రేణి నాయకులు పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బాబు రెండు కళ్ల సిద్ధాంతం తమ ఉనికినే ప్రశ్నార్థకం చేసిందని టీడీపీ నేతలు మదనపడుతున్నారు. రాజీనామా చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆలోచనలో వారు తలమునకలవుతున్నారు. మరికొందరు పార్టీలోనే ఉంటూ తమ విభజనకు మొదటి నుంచీ వ్యతిరేకమని ప్రజలను నమ్మించేందుకు ప్రణాళికలు రచిస్తుండటం గమనార్హం.
కోట్ల పయనమెటో?
కర్నూలు కాంగ్రెస్‌కు పెద్దదిక్కుగా ఉన్న కేంద్ర రైల్యేశాఖ సహాయ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని పార్టీ శ్రేణులతో పాటు ఆయన వర్గీయుల్లో ఉత్కంఠ నెలకొంది. మంత్రి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తారా? లేక అదే పార్టీలో కొనసాగుతారా? అనే చర్చ జరుగుతోంది. వారం రోజుల క్రితం ఆయన రెండు రోజుల పాటు కాంగ్రెస్ అధిష్టానంపై విరుచుకుపడటం తెలిసిందే. విభజన పూర్తి కావడం.. ఆ పార్టీ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా బాట పట్టడంతో కోట్ల పయనం ఎటోనని నాయకులు ఎదురుచూస్తున్నారు. ఈ విషయమై ఆయన అభిప్రాయం తెలుసుకునేందుకు మీడియా ప్రతినిధులు యత్నించగా ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉండటంతో.. జిల్లాకు ఎప్పుడు చేరుకుంటారో.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అంతా ఎదురుచూస్తున్నారు.
కొత్త డ్రామా..రాజీనామా
Published Wed, Feb 19 2014 3:39 AM | Last Updated on Fri, Mar 22 2019 6:18 PM
Advertisement
Advertisement