సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇప్పటివరకు 13 మంది కోవిడ్ – 19 (కరోనా వైరస్) అనుమానితులను గుర్తించి చికిత్స అందచేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ గురువారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. వీరిలో ఆరుగురి రక్త నమూనాలను బుధవారం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి పంపించారు. ఈ ఫలితాలు శుక్రవారం రానున్నాయి. మిగతా ఆరుగురి ఫలితాలు శనివారం లేదా ఆదివారం అందే అవకాశముంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై వైద్య ఆరోగ్యశాఖ మార్గదర్శకాలను రూపొందించింది. కలెక్టర్లు, వైద్య ఆరోగ్య సిబ్బంది దీనిపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించింది. వ్యాధి లక్షణాలతో బాధపడే వారికి వైద్య సేవలు అందించేవారు, రోగి సహాయకులు, గర్భిణులు, చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది.
23 నమానాల్లో 11 నెగిటివ్..
రాష్ట్రానికి వివిధ దేశాల నుంచి వచ్చిన 330 మంది ప్రయాణికులను ఇప్పటివరకు పరీక్షించారు. వీరిలో 102 మంది ఇంట్లోనే వైద్య పరిశీలనలో ఉండగా మరో 216 మందికి 28 రోజుల పరిశీలనా కాలం పూర్తైంది. తాజాగా ఒంగోలు ఒక అనుమానిత కేసు నమోదు కాగా మొత్తం 13 మంది ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. విశాఖలో నమోదైన ఐదు అనుమానిత కేసుల్లో ఇద్దరికి స్వైన్ ఫ్లూ లేదని తేలింది. కోవిడ్‌కు సంబంధించిన నివేదికలు రావలసి ఉంది. ఇప్పటివరకు 23 మంది నుంచి నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించగా 11 నమూనాలు నెగిటివ్‌గా తేలాయి. విదేశాల నుంచి తిరిగి వచ్చే వారు 28 రోజుల పాటు ఇంట్లోనే కచ్చితంగా వైద్య పరిశీలనలో ఉండాలని అధికారులు సూచించారు.
కుటుంబ సభ్యులతో కలవకూడదని, బహిరంగ ప్రదేశాల్లో సంచరించవద్దని, కరోనా లక్షణాలు కనిపిస్తే తప్పకుండా మాస్క్ ధరించాలని పేర్కొన్నారు. 108 అంబులెన్సు సేవలను వినియోగించుకుని ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాలని కోరారు. కాగా విజయవాడలో కోవిడ్ అనుమానితులకు చికిత్స చేసేందుకు ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులను రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు డాక్టర్ కె.వెంకటేష్ గురువారం పరిశీలించారు. కోవిడ్ లక్షణాలు ఉన్న వారు క్యాజువాలిటీకి రాకుండా ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసి సిబ్బంది, వైద్యులు, నర్సులను ప్రత్యేకంగా నియమించాలని ఆదేశించారు.
కోవిడ్ పర్యవేక్షణకు రాష్ట్రస్థాయి కమిటీ
రాష్ట్రంలో కోవిడ్–19 (కరోనా) వైరస్ నియంత్రించడానికి తొమ్మిదిమందితో రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీచేశారు. కోవిడ్–19ను నియంత్రించడానికి, నిఘాకు అవసరమైన లాజిస్టిక్ కొనుగోలుకు వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా ఏర్పాటు చేసిన ఈ కమిటీకి ఏపీ ఎంఎస్‌ఐడీసీ ఎండీ మెంబర్ కన్వీనర్‌గా, ఆరోగ్య, కుటంబ సంక్షేమశాఖ కమిషనర్, నేషనల్ హెల్త్ మిషన్ ఎండీ, ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్, ఏపీవీవీపీ కమిషనర్, వైద్య విద్య డైరెక్టర్, ఆర్ధికశాఖ ప్రతినిధి, ఎన్‌హెచ్‌ఎం ఫైనాన్స్ ఆఫీసర్ సభ్యులుగా ఉంటారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కరోనా వైరస్ అనుమానితుల సంఖ్య జిల్లాలవారీగా
శ్రీకాకుళం: 3
విశాఖపట్నం: 5
తూర్పు గోదావరి: 1
పశ్చిమ గోదావరిలో: 2
కృష్ణా: 1
ప్రకాశం: 1
మొత్తం: 12
ఆలయాల్లోనూ ‘కోవిడ్’పై ప్రచారం
కోవిడ్–19 వైరస్ వ్యాప్తి చెందకుండా రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లోనూ జాగ్రత్త చర్యలు చేపట్టాలని దేవదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆలయ ప్రాంగణాల్లో.. ఈ వైరస్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని దేవదాయ శాఖ కమిషనర్ పద్మ గురువారం ఆదేశాలిచ్చారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖ సూచించిన జాగ్రత్తల గురించి ఆలయాల్లో మైక్ ద్వారా ప్రచారం చేయాలని అన్ని దేవస్థానాల కార్యనిర్వహణాధికారులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment