సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో దాదాపు ఏడు లక్షల మంది ఉద్యోగులు చురుగ్గా పాల్గొంటున్నారు. మరోవైపు రెండో దశలో పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, రెవెన్యూ కార్యాలయాల్లో సుమారు 8 లక్షల మందికి వ్యాక్సిన్ వేయడానికి కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్‌కు ఒక్క ఆరోగ్యశాఖ సిబ్బందే కాదు మిగతా ఉద్యోగుల సేవలు కూడా ఎంతో కీలకం. ఇలాంటి సమయంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధం కావడం, ఉద్యోగులపై ఎన్నికల విధుల భారం మోపడం అంటే వారి ప్రాణాలను బలి పెట్టడమేననే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు కరోనా సెకండ్ వేవ్‌తో భీతిల్లిపోతున్నాయి.
మన దేశంలోనూ ఢిల్లీ, కేరళ లాంటి చోట్ల సెకండ్ వేవ్‌లో కేసులు భారీగా పెరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికీ సగటున రోజుకు 200 కేసులు పైనే నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రానికి టీకా రావడం ఊరటనిచ్చినా స్థానిక ఎన్నికల ప్రక్రియతో గందరగోళం నెలకొంది. ఒకవైపు హెల్త్‌కేర్ వర్కర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుండగా మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌కు సిద్ధం కావడం వైద్య నిపుణులు, ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, 60 ఏళ్లు పైబడిన వారు ఓటింగ్‌కు రావడమంటే ప్రాణాలతో చెలగాటమాడినట్లేనని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కేరళలో స్థానిక ఎన్నికలు జరిగిన అనంతరం కోవిడ్ కేసులు భారీగా పెరగడం దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా చెబుతున్నారు.
అదనపు విధులు ఎలా?
కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో వైద్యులు, పోలీసులు ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ వర్కర్లు, ఏఎన్‌ఎంలు, రెవెన్యూ, మున్సిపాలిటీ, పంచాయతీరాజ్, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాలు పంచుకుంటున్నారు. మండల స్థాయిలో టాస్క్‌ఫోర్స్ కమిటీ చైర్మన్‌లుగా తహసిల్దార్లు పర్యవేక్షిస్తున్నారు. గ్రామ పరిధిలో పంచాయతీ ఈవోలు, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్‌లు టాస్క్‌ఫోర్స్ కమిటీలో నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. మరోవైపు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ల పర్యవేక్షణ అంతా వ్యాక్సినేషన్‌పైనే ఉంది. ఒక కేంద్రంలో ఒకరోజు వ్యాక్సిన్ వేస్తే దాన్ని ఒక సెషన్ అంటారు. అలా 40 వేలకుపైగా సెషన్స్ వేయాల్సి ఉంది.
ఒక్కో సెషన్‌కు 10 నుంచి 12 మందికి పైగా సిబ్బంది అవసరమున్నట్టు ఆరోగ్య శాఖ తేల్చింది. వీరంతా ఒకవైపు తమ విధులను నిర్వర్తిస్తూనే అదనంగా ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారు. ఉదాహరణకు పోలీస్ సిబ్బంది వ్యాక్సినేషన్‌లో నిరంతరం నిమగ్నం కావాల్సి ఉంటుంది. వీరు వ్యాక్సిన్ తీసుకోవడంతోపాటు కొద్ది రోజులు వైద్యుల పరిశీలనలో ఉండాలి. అనంతరం టీకా ప్రక్రియను పర్యవేక్షించాలి. ఇలా రకరకాల విధులు నిర్వహించాలి. ఇతర సిబ్బంది విషయం చూసినా వారు టీకా తీసుకోవడంతోపాటు కొద్ది రోజులు పర్యవేక్షణలో ఉండటం అవసరం. అలాంటప్పుడు వారికి పంచాయతీ ఎన్నికల విధులు అప్పగిస్తే ఎలా నిర్వహించగలరనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
బందోబస్తులో పోలీస్ సిబ్బంది..
వ్యాక్సిన్ నిల్వ కేంద్రాలు, సరఫరాకు సంబంధించి పోలీసులు పటిష్టంగా బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు. సెంట్రల్ డ్రగ్‌స్టోర్ నుంచి ప్రాంతీయ వ్యాక్సిన్ సెంటర్‌కు, అక్కడ నుంచి జిల్లా వ్యాక్సిన్ కేంద్రానికి, అక్కడనుంచి పీహెచ్‌సీకి, వ్యాక్సిన్ కేంద్రానికి చేరే వరకు రోజూ వేలాదిమంది పోలీసులు బందోబస్తులోనే ఉంటున్నారు. వ్యాక్సిన్ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఈనెల 17న జరగాల్సిన పోలియో కార్యక్రమాన్ని సైతం కేంద్రం వాయిదా వేయడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో ఎన్నికల విధులు నిర్వహించాలనడం ప్రాణ సంకటమేనని అధికారులు పేర్కొంటున్నారు. పైగా ఫిబ్రవరి 1 నుంచి రెండో దశ వ్యాక్సిన్‌కు పంచాయితీ, రెవెన్యూ, మున్సిపల్ కార్యాలయాలను ఇప్పటికే సిద్ధం చేశారు.
60 ఏళ్లు దాటిన వారి పరిస్థితి ఏమిటి?
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 60 ఏళ్లు దాటిన వారు కోవిడ్ నేపథ్యంలో బయటకు రాకూడదు. కానీ ఎన్నికలు నిర్వహిస్తే ఓటు వేసేందుకు బయటకు వస్తారు. వ్యాక్సిన్ తీసుకోకుండా వారంతా పెద్ద సంఖ్యలో బయటకు వస్తే పెద్దల ఆరోగ్యానికి ఎవరు బాధ్యత వహిస్తారనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ఎన్నికల వల్లే కేసులు పెరిగాయి: కేరళ మంత్రి
2020 డిసెంబర్‌లో స్థానిక ఎన్నికలు జరగడం వల్ల తమ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరిగాయని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి కె.కె.శైలజ.. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్‌కు వివరించారు. ఎన్నికల కారణంగా వైరస్ వ్యాప్తి భారీగా పెరిగిందని, ఎన్నికలకు ముందు కరోనా వ్యాప్తి అంతగా లేదని మంత్రికి వివరించారు. ఎన్నికలు జరిగితే కేసులు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం ముందే హెచ్చరించిందన్నారు. కరోనా కారణంగా గుజరాత్‌లోనూ స్థానిక ఎన్నికలు వాయిదా వేశారు.
ఎన్నికల ప్రచారంతో వైరస్ వ్యాప్తి తీవ్రం
రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నందున ప్రచారం ఉధృతంగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కరోనా బాగా వ్యాప్తి చెందవచ్చు. స్థానిక ఎన్నికలనగానే 80 ఏళ్ల వృద్ధులు కూడా ఓటింగ్‌కు ఆసక్తి చూపుతారు. ఈ పరిస్థితుల్లో వారికి వైరస్ సోకితే బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఎన్నికల సందర్భంగా నియంత్రణ చర్యలు తీసుకోవడం అంత సులభం కాదు.
- డా.రాంబాబు, ప్రొఫెసర్, కింగ్‌జార్జి ఆస్పత్రి, విశాఖపట్నం
ప్రతి ప్రాణమూ ప్రభుత్వానికి ముఖ్యమే
కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరి ప్రాణాన్నీ కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే వారిలో చాలామంది 50 ఏళ్లకు పైబడిన వారు, రకరకాల వ్యాధులతో బాధపడే వారున్నారు. వీరందరికీ రెండు నెలల్లో వ్యాక్సిన్ ఇచ్చాక ఆ తర్వాత ఎన్నికల విధులకు పంపడం సమంజసం. వ్యాక్సిన్ తీసుకుంటే వారిలో వ్యాధి నిరోధకత పెరుగుతుంది.
- డా.కె.ప్రభాకర్‌రెడ్డి, హృద్రోగ నిపుణులు, కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి
Comments
Please login to add a commentAdd a comment