మట్టిపోసి మాయజేసి | Mattiposi mayajesi | Sakshi
Sakshi News home page

మట్టిపోసి మాయజేసి

Published Tue, Nov 18 2014 2:06 AM | Last Updated on Sat, Sep 2 2017 4:38 PM

మట్టిపోసి మాయజేసి

మట్టిపోసి మాయజేసి

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే రూ.9 కోట్లు కొల్లగొట్టేందుకు సిద్ధమయ్యారు. నాసిరకంగా చేపట్టిన పనులకు సంబంధించి నిధులు మంజూరు చేయించుకునేందుకు ఆ ఎమ్మెల్యే అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. బిల్లు చేయకుంటే రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఎక్కడా పనిచేయలేరని అధికారులను తీవ్రస్థాయిలో హెచ్చరించినట్లు విశ్వసనీయ సమాచారం. నాసిరకంగా చేస్తున్న పనులకు నిధులు మంజూరు చేయడానికి అధికారులెవ్వరూ సాహసించటం లేదు.

అధికారపార్టీ నేతల ఒత్తిళ్లకు ఓ అధికారి రిజర్వాయర్ నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతల నుంచి తప్పుకుంటే.. మరో అధికారి సెలవులో వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వివరాల్లోకెళితే.. వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని కలువాయి మండలంలో సుమారు 15 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కేశమనేనిపల్లి, తోపుగుంట, కండాపురం, చవటపల్లి వద్ద నాలుగు రిజర్వాయర్లు నిర్మించాలని భావించింది.

ఆ మేరకు 2009లో రూ.24 కోట్లు మంజూ రు చేసింది. ఆ మేరకు ఓ కాంట్రాక్టర్ తోపుగుంట, కండాపురం, కేశమనేనిపల్లి రిజర్వాయర్ పనులను ప్రారంభించారు. అయితే ఆ కాంట్రాక్టర్ రిజ ర్వాయర్ పనులను మధ్యలో ఆపేశాడు. పనులు చేయలేనని చేతులెత్తేశాడు.

 నాసిరకం మట్టితో రిజర్వాయర్ పనులు
 కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో రిజర్వాయర్ నిర్మాణ పనులు చేపట్టలేనన్న కాంట్రాక్టర్ టీడీపీ అధికారంలోకి వచ్చాక పనులు చేస్తానని ముందుకొచ్చినట్లు సమాచారం. కాంట్రాక్టర్ ఒప్పుకోవటానికి వెనుక టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే హస్తం ఉన్నట్లు తెలిసింది. ‘నీకు నేను అండగా ఉంటాను. ఏదోలా పనులు పూర్తి చేసేయ్. బిల్లుల మంజూరు నేను చూసుకుంటాను.

అందులో నాకు వాటా ఇవ్వాలి’ అని ఒప్పందం కుదుర్చుకున్నాకే కేశమనాయనపల్లి రిజర్వాయర్ పనులను చేపట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. ఎమ్మెల్యే అండగా నాసిరకం మట్టి (సుద్ద) మట్టితో హడావుడిగా కట్టనిర్మాణం చేస్తున్నారు. సుద్దమట్టి తీసుకొచ్చి కట్టపై పోసి రోలింగ్ చేసినట్లు స్థానికులు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షానికి కట్టలు కోసుకుపోతున్నాయని, అదేవిధంగా కట్టపై నడవాలంటే కాలు మట్టిలో కూరుకుపోతున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కట్ట అనేక చోట్ల కోసుకుపోయి దర్శనమిస్తోంది.

 బిల్లు చేయాలంటూ అధికారులకు ఎమ్మెల్యే బెదిరింపులు
 రిజర్వాయర్ పనులు పూర్తి నాసిరకంగా చేస్తున్నారు. ఇప్పటి వరకు చేసిన పనులకు సంబంధించి బిల్లులు మంజూరు చేయాలని పనులను పర్యవేక్షిస్తున్న అధికారిపై టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అందుకు ఆ అధికారి ససేమిరా అన్నట్లు తెలిసింది.

ఎమ్మెల్యే నుంచి ఒత్తిళ్లు అధికం కావటంతో తనపై అధికారులకు లేఖ రాసినట్లు సమాచారం. రిజర్వాయర్ పనుల పర్యవేక్షణ బాధ్యతలను తనను తప్పించమని వేడుకున్నారు. స్పందించిన ఉన్నతాధికారులు అతడ్ని ఆ బాధ్యతల నుంచి తప్పించి వేరొకరికి బాధ్యతలు అప్పగించారు. అతనిపైనా ఎమ్మెల్యే బిల్లుల మంజూరుకు ఒత్తిడి తెస్తున్నారు. అతను కూడా రిజర్వాయర్ పనులను పరిశీలించారు.

పనులు పూర్తి నాసిరకంగా ఉండటంతో బిల్లు చేయటానికి ఆయనా ససేమిరా అన్నట్లు తెలిసింది. దీంతో ఎమ్మెల్యే ఇరిగేషన్ ఈఈపై ఒత్తిడి చేశారు. ఈఈ తన వద్దకు ఫైల్ వస్తే మంజూరుకు సంతకం చేస్తానని చెప్పి తప్పించుకున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ‘వెంటనే బిల్లులు మంజూరు చేయకపోతే  రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఎక్కడా పనిచేయలేవు’ అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించినట్లు విశ్వసనీయ సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement