మెడికో ఆత్మహత్యాయత్నం
Published Thu, Feb 13 2014 1:35 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
రిమ్స్ క్యాంపస్, న్యూస్‌లైన్: ఓ వైద్యవిద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన కలకలం రేపింది. విశాఖ పట్నం సమీపంలోని సింహాచలానికి చెందిన బండారి లోకేష్ రిమ్స్ వైద్య కళాశాలలో ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం సాయంత్రం వరకు సహా విద్యార్థులతో ఉన్నాడు. సాయంత్రం బయటకు రాకుండా హాస్టల్ గదిలోనే ఉన్నాడు. రాత్రి 8.30 గంటలకు సహవిద్యార్థి ప్రవీణ్‌కుమార్ గదిలోకి వెళ్లగా లోకేష్ అపస్మారక స్థితిలో ఉండడాన్ని గమనించాడు. హాస్టల్‌లోని ఇతర విద్యార్థులకు సమాచారం ఇచ్చాడు. లోకేష్ బ్యాగ్‌లో ఓలనాన్ జోపిన్ అనే నిద్ర మాత్రలు చింపి ఉండటాన్ని గమనించారు. సుమారు 36 నిద్ర మాత్రలు వేసుకున్నట్టు చింపి ఉన్న మాత్రల కవర్‌ను చూసి విద్యార్ధులు పోల్చారు. వెంటనే రిమ్స్‌లోని క్యాజువాల్టీలో చేర్పించారు. అధిక మోతాదులో నిద్ర మాత్రలు మింగడంతో పరిస్థితి విషమించించడంతో అతనిని పట్టణంలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
ఆలస్యంగా పోలీసు రిపోర్టు
వైద్య విద్యార్థి ఆత్మహత్యాయత్నంపై పోలీసులకు ఆలస్యంగా ఫిర్యాదుచేశారు. రిమ్స్ క్యాజువాల్టీలో చేర్చినా రిమ్స్ అవుట్ పోస్టు పోలీసులకు కూడా సమాచారం ఇవ్వలేదు. ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త తీసుకున్నారు. కిమ్స్‌కు తరలించిన తర్వాత అక్కడ కూడా పరిస్థితి బాగాలేదని తెలుసుకున్న రిమ్స్ అధికారులు అవుట్ పోస్టు పోలీసులకు సమాచారమిచ్చారు. కిమ్స్‌కు వెళ్లి కేసు నమోదు చేసుకోవాలని తెలిపారు. దీంతో తప్పనిసరి పరిస్ధితుల్లో అవుట్‌పోస్టు పోలీసులు కిమ్స్‌కు వెళ్లి రిమ్స్ అవుట్ పోస్టు పోలీసులు కేసు నమోదు చేసుకుని వచ్చారు.
రేకెత్తుతున్న అనుమానాలు
మూడో సంవత్సరం పరీక్ష తప్పాడని,
మూడవ సంవత్సరం పరీక్ష తప్పాడని తోటి విద్యార్థులు తెలిపారు. గురువారం నుంచి ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతుండడంతో ఆందోళనకు గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉంటాడని చెబుతున్నారు. కానీ ఈ సంఘటనపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. రిమ్స్‌లో ర్యాగింగ్ జరిగిందా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా లోకేష్ ఆత్మహత్య యత్నం చేసినట్టు తెలిసింది.
Advertisement