సాక్షి, కడప : జిల్లాలోని పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని నిధుల కొరత వేధిస్తోంది. జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించి బిల్లులు అందకపోవడంతో ఏజెన్సీ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం పెరిగిన ధరల నేపధ్యంలో వంట చేయడం కష్టంగా మారుతోంది. కూరగాయలు, పప్పుదినుసులు, బియ్యం, గుడ్డు, అరటిపండు లాంటివి విద్యార్థులకు అందించాలంటే.... ప్రభుత్వం సక్రమంగా బిల్లులు అందిస్తే తప్ప లేకపోతే ఇబ్బందులు తప్పవు. జిల్లాలో లక్షలాది మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఆహారాన్ని అందిస్తున్నా.... ఏజెన్సీ నిర్వాహకులకు బిల్లులు ఇవ్వకపోవడంతో వారు ఎప్పుడు వస్తాయోనని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కొంతమంది అప్పో సప్పో చేసి బయటి నుంచి తీసుకొచ్చిన డబ్బుతో ఏజెన్సీలను నిర్వహిస్తున్నారు. జిల్లాలో 6498 వంట ఏజెన్సీలు ఉండగా, 3558 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో విద్యార్థులు సుమారు 2.50 లక్షల మందికి పైగా చదువుకుంటున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ట్రెజరీలో మగ్గుతున్న నిధులు
మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి నిధులు మంజూరయ్యాయి. అందుకు సంబంధించి సుమారు రూ. 12 కోట్లు మంజూరై ట్రెజరీలకు వచ్చినా ఇంతవరకు పంపిణీకి నోచుకోలేదు. డిసెంబరు మూడవ వారంలోనే నిధులు ట్రెజరీలకు వచ్చినట్లు తెలుస్తోంది.
అయితే, ప్రభుత్వం విడుదల చేసిన నిధులు ట్రెజరీల నుంచి ఎందుకు విడుదల చేయడం లేదన్నది అర్థం కావడం లేదు. ఏది ఏమైనా వెంటనే నిధులు విడుదల చేయాలని పలువురు వంట ఏజెన్సీల నిర్వాహకులు కోరుతున్నారు.
ఈ ఫోటోలో కనిపిస్తున్న మహిళ పేరు బషీరున్నీసా. ఈమె కడప ఉర్దూ బాలికల పాఠశాలలో వంట ఏజెన్సీ నిర్వాహకురాలు. ఉర్దూ పాఠశాలలో సుమారు 640 మంది పిల్లలకు ప్రతిరోజు వంట చేస్తోంది. అయితే, వారం కాదు, పది రోజులు కాదు...రెండు నెలలుగా బిల్లులు రాకపోతే ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుంది. ప్రస్తుతం ఈమె కూడా అదే అంటోంది. కూరగాయలు, బియ్యం, గుడ్లు ధరలు పెరిగిన నేపధ్యంలో వెంటనే నిధులిస్తేనే కొనుగోలుకు అవకాశం ఉంటుందని, అప్పులు తెచ్చి ఎంతకాలం వంట చేయాలని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది.
మధ్యాహ్న భోజనానికి నిధుల పొగ
Published Sun, Mar 1 2015 2:21 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM
Advertisement