రైలు కింద పడి చిన్నారి సహా తల్లి ఆత్మహత్య
Published Tue, Aug 13 2013 5:50 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
ఏలూరు (ఫైర్ స్టేషన్ సెంటర్), న్యూస్‌లైన్ : కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ మహిళ తన రెండేళ్ల కుమారుడి సహా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. కుమారుడి పుట్టిన రోజునే ఈ అఘాయిత్యానికి పాల్పడడం పలువురిని కంట తడిపెట్టించింది. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం చదలాడ గ్రామానికి చెందిన సూర్యనారాయణ, సుగుణావతి దంపతుల రెండో కుమార్తె సత్య శ్వేత (28)కు ఏలూరులోని రామకృష్ణాపురంలో నివాసం ఉంటున్న అకండ సత్యనారాయణ పెద్దకుమారుడు అకండ అజయ్ కల్యాణ్ కుమార్ తో నాలుగేళ్ల కిత్రం వివాహమైంది. అనంతరం వీరికి సత్యశరత్ (చెర్రీ) (2) జన్మించాడు. కల్యాణ్ కుమార్ ఏలూరులోని సీఆర్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో పార్ట్‌టైం లెక్చరర్‌గా పనిచేస్తున్నా డు. కొంతకాలం కాపురం సజావుగా సాగి న అనంతరం కలహాలు రావడంతో సత్యశ్వేత మూడు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది.
భార్యను సరిగా చూసుకుంటానని మామ సూర్యనారాయణకు కల్యాణ్ నెల క్రితం ఫోన్ చేయడంతో అత్తింటికి వచ్చింది. అప్పటి నుంచి కల్యాణ్ భార్య ను వేధించేవాడు. అత్త, మామ, మరుదులు అడ్డుకోలేదు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం సత్యశ్వేత రోదిస్తూ తన తండ్రి సూర్యనారాయణకు ఫోన్ చేసింది. వెంటనే ఏలూరు బయలుదేరి వస్తానని, పుట్టింటికి వచ్చేయాలని, చిన్నారి పుట్టినరోజును కూడా ఇక్కడే చేసుకుందామని తండ్రి ఆమెకు నచ్చజెప్పాడు. అంతలోనే 15 నిమిషాల తరువాత రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్టు తమకు సమాచారం అందిందని బంధువులు చెప్పారు. రైల్వే ఎస్సై అశోక్, హెడ్ కానిస్టేబుల్ మగ్భుల్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసును ఎస్సై ఆధ్వర్యంలో హెడ్ కానిస్టేబుల్ దర్యాప్తు చేస్తున్నారు.
భర్త వివాహేతర సంబంధమే కారణం
పెళ్లికి ముందే అజయ్ కల్యాణ్ కుమార్ కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని సత్యశ్వేత బంధువులు ఆరోపిం చారు. తనను వదిలివెళ్లిపోతే ఆ మహిళతోనే ఉంటానని చెప్పేవాడన్నారు. ఈ కారణంగానే సత్యశ్వేత కుమారుడి సహా ఆత్మహత్య చేసుకునేలా కల్యాణ్ కుమార్ ప్రేరేపించి ఉంటాడని ఆరోపిస్తున్నారు.
Advertisement
Advertisement