ఆన్‌లైన్ లావాదేవీలకు బ్రేక్
నరసాపురం (రాయపేట), న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన ప్రక్రియలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖల కార్యకలాపాలకు సంబంధించి బైఫరకేషన్ (విభజన) ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. జూన్ 2న ప్రస్తుత ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలుగా ఆవిర్భవించనున్న సంగతి తెలిసిందే. పలు ప్రభుత్వ శాఖల్లో లావాదేవీలన్నీ ప్రస్తుతం ఆన్‌లైన్ ద్వారా జరుగుతున్నాయి. విభజన కారణంగా ఈ నెల 30 సాయంత్రం 5 గంటల నుంచి జూన్ 2వ తేదీ వరకు ఆన్‌లైన్ లావాదేవీలకు బ్రేక్ వేయనున్నట్టు సమాచారం. ప్రభుత్వ శాఖల్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలోని లావాదేవీలన్నీ ప్రస్తుతం ఆన్‌లైన్ ద్వారానే జరుగుతున్నాయి. వీటి నిర్వహణకు రాష్ట్రమంతటికీ ఒక సర్వర్‌ను ఏర్పాటు చేసి దానిద్వారా సేవలను అందిస్తున్నారు.
విభజన కారణంగా ఈ శాఖ సర్వర్‌ను ఈ నెల 30 సాయంత్రం నుంచి అధికారులు బైఫరకేషన్ చేయనున్నారు. 31వ తేదీ శనివారం జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పూర్తిస్థాయిలో రిజిస్ట్రేషన్లు, ఇతర సేవలు నిలిచిపోనున్నాయి. ఒకటో తేదీ ఆదివారం సెలవు. రెండో తేదీ నాటికి విభజన పూర్తయితే రిజిస్టేషన్లు ప్రారంభవుతాయని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని సిబ్బంది చెబుతున్నారు. మీ సేవ కేంద్రాల ద్వారా జారీ అయ్యే ఆస్తిపై రుణ లావాదేవీలు (ఈసీ), పబ్లిక్ నకలు కాపీ (సీసీ) ధ్రువపత్రాల జారీని 30వ తేదీ నుంచి నిలుపుదల చేయనున్నారు. రవాణా శాఖలో పూర్తిస్థాయిలో, వాణిజ్య పన్నుల శాఖ, రెవెన్యూ, ఇతర శాఖల్లో పాక్షికంగా కార్యకలాపాలు ఆన్‌లైన్ ద్వారానే కొనసాగుతున్నాయి. 30వ తేదీ నుంచి 2వ తేదీ వరకు ఈ కార్యాలయాల్లో కూడా సేవలు స్తంభించనున్నట్టు తెలిసింది.