మూల్యాంకనానికి మూల్యం!
Published Wed, Jun 4 2014 12:32 AM | Last Updated on Wed, Sep 5 2018 8:33 PM
జేఎన్ టీయూ, జవాబు పత్రాల మూల్యంకనం, వై వేణుగోపాల్ రెడ్డి కమిటీ, ఈఎస్ఎల్ నరసింహన్
గవర్నర్ కోర్టులో ‘గ్లోబరీనా’ వ్యవహారం
అతీగతీ లేని వేణుగోపాలరెడ్డి కమిటీ విచారణ
జేఎన్‌టీయూకేలో ఎంఓయూ కొనసాగింపుపై వివాదం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: జేఎన్‌టీయూ కాకినాడలో జవాబు పత్రాల మూల్యాంకన ఒప్పందంపై రాజుకున్న వివాదం గవర్నర్ కోర్టులో నలుగుతోంది. వర్సిటీ పరిధిలోని 276 ఇంజనీరింగ్ కళాశాలల్లో చదువుతున్న 4 లక్షల మంది విద్యార్థుల జవాబుపత్రాల మూల్యాంకనానికి గ్లోబరీనా అనే సంస్థతో నాలుగేళ్ల కాలానికి గతేడాది డిసెంబరులో రూ.130 కోట్లకు ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంవల్ల విద్యార్థులకు మేలు జరగకపోగా, జవాబుపత్రాల మూల్యాంకనంలో తీవ్ర జాప్యం జరుగుతోందని మొదటి సంవత్సరంలోనే విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ విషయమై ‘సాక్షి’లో పలు కథనాలు ప్రచురితమవడంతో పాటు పలు సంఘాల ఫిర్యాదు మేరకు గవర్నర్ నరసింహన్ ఉన్నత విద్యామండలి చైర్మన్ వై.వేణుగోపాలరెడ్డితో విచారణ కమిటీ వేశారు. ఆ విచారణ ఏమైందనేది ఇంతవరకూ అతీగతీ లేదు. ఈ నేపథ్యంలో ఇటీవల తూర్పుగోదావరి జిల్లా నుంచి సీపీఐ నేత మీసాల సత్యనారాయణ ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులు గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఒప్పందాన్ని రదు ్దచేయాలని కోరుతూ లేఖ ఇచ్చారు. విచారణ జరుగుతోందని వారికి గవర్నర్ తెలిపారు. ఈ క్రమంలో వర్సిటీ-గ్లోబరీనా ఒప్పందం మరోసారి తెరపైకి వచ్చి చర్చనీయాంశంగా మారింది.
ఒప్పందం పూర్వాపరాలు
ఒప్పందంలో భాగంగా ప్రతి సమాధాన పత్రంలోని 32 పేజీలను స్కాన్ చేయడం, ప్రశ్నల వారీగా వైఫై టాబ్లెట్ పీసీ సహకారంతో గ్లోబరీనా ఫ్యాకల్టీ మూల్యాంకనం చేస్తారు. రెండు మూల్యాంకనాల వివరాలు సర్వర్‌లో నిక్షిప్తం చేస్తారు. ఈ వివరాలను ఫలితాల ప్రాసెసింగ్‌కు సమర్పిస్తారు. ఇందుకు కావలసిన సాఫ్ట్‌వేర్‌ను వర్సిటీ సమకూర్చినా సమాధాన పత్రం మూల్యాంకనానికి గ్లోబరీనాకు వర్సిటీ రూ.130 చెల్లిస్తుంది. ఈ రకంగా వర్సిటీ పరిధిలో నాలుగు లక్షల మంది విద్యార్థుల జవాబు పత్రాలను (ప్రతి విద్యార్థికీ ఆరు చొప్పున 24లక్షల పేపర్లు) మూల్యాంకనం చేయాలనేది 2013 డిసెంబరు నాటి ఒప్పందం. గ్లోబరీనాకు యూనివర్సిటీ ఒక సెమిస్టర్‌కు సుమారు రూ.31.24 కోట్లు, ఏడాదికి రెండు సెమిస్టర్‌లకు రూ.62.40 కోట్లు చెల్లిస్తుంది. 2013కు ముందు ఒక జవాబుపత్రాన్ని అధ్యాపకులు మూల్యాంకనం చేస్తే రూ.25 వంతున వర్సిటీ చెల్లించేది. విద్యార్థి నుంచి పరీక్ష ఫీజు రూపంలో రూ.760 వసూలు చేస్తున్నారు. ఇందులో రూ.600లు వర్సిటీకి, రూ.160 కళాశాలలకు చెందుతాయి. జవాబుపత్రానికి రూ.25 వంతున ఆరు పేపర్ల మూల్యాంకనానికి రూ.150 పోతే వర్సిటీకి రూ.450 మిగిలేది. ఆ రకంగా వర్సిటీకి విద్యాసంవత్సరానికి రూ.32 కోట్ల మిగులు నిధులు ఉండేవి. అయితే.. గ్లోబరీనా ఒప్పందం ప్రకారం ఒక విద్యార్థి జవాబుపత్రాల మూల్యాంకనానికి రూ.780 వెచ్చించాల్సి వస్తోంది. విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో విద్యా సంవత్సరంలో వచ్చే రూ.50 కోట్లతోపాటు అదనంగా రూ.12.40 కోట్లు ఎదురు ఖర్చు అవుతోందని అఖిలపక్షం వాదిస్తోంది.
ఫలితాల వెల్లడిలో తీవ్ర జాప్యం
గ్లోబరీనా ఒప్పందం అనంతరం ఈ ఏడాది ఇంజనీరింగ్ మూడు, నాలుగు సంవత్సరాల విద్యార్థుల మొదటి సెమిస్టర్ ఫలితాలు ఫిబ్రవరి నెలకల్లా విడుదల చేయాలి. వర్సిటీ అధ్యాపకులతో జవాబు పత్రాల మూల్యాంకనం చేయించేటప్పుడు కూడా ఫిబ్రవరి దాటకుండానే ఫలితాలు విడుదలయ్యేవి. కంప్యూటర్ ఆధారంగా పేపర్లు స్కాన్ చేసి అత్యంత ఆధునిక పద్ధతిలో ఫలితాలు ప్రకటిస్తామని గొప్పలకుపోయిన వర్సిటీ.. గ్లోబరీనా ఒప్పందం తరువాత సమయానికి ఫలితాలు విడుదల చేయలేక చేతులెత్తేసిందని అఖిలపక్ష నేతలు గవర్నర్‌కు నివేదించారు. విద్యార్థులు పోరుపెట్టగా ఫలితాలను ఏప్రిల్‌లో విడుదల చేశారు. అదీ వర్సిటీ పరువు బజారునపడుతుందనే భయంతో వర్సిటీ అధ్యాపకులతోనే మూల్యాంకనం చేయించి విడుదల చేయడం కొసమెరుపు. ఇంత జరిగినా గ్లోబరీనాతో ఒప్పందం కొనసాగించడంపై వర్సిటీలోనే కొందరు అధ్యాపకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీకి దండగమారిదైన ఈ కొరగాని ఒప్పందాన్ని తక్షణం రద్దు చేయాలని అందరూ కోరుతున్నారు.
Advertisement
Advertisement