అనధికారిక మైనింగ్‌పై ఉక్కుపాదం మోపండి: మంత్రి | Peddireddy Ramachandra Reddy Who Conducted Review With Mining Officials | Sakshi
Sakshi News home page

అనధికారిక మైనింగ్‌పై ఉక్కుపాదం మోపండి: మంత్రి

Published Mon, Feb 3 2020 7:27 PM | Last Updated on Mon, Feb 3 2020 7:35 PM

Peddireddy Ramachandra Reddy Who Conducted Review With Mining Officials - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంకు మైనింగ్ ఆదాయాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్థి, మైనింగ్ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మైనింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో గనుల శాఖ ముఖ్య కార్యదర్శి రామ్ గోపాల్‌తో పాటు పలువురు మైనింగ్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మైనింగ్ లీజులు, సీనరేజీ ద్వారా ప్రభుత్వానికి వస్తున్న రెవెన్యూపై సమీక్షించారు. మైనింగ్ కోసం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, అవసరమైన అనుమతులు ఇవ్వాలని సూచించారు. అలాగే పోలవరం కుడి, ఎడమ కాలువల గట్లపై వున్న గ్రావెల్, మెటల్ నిల్వలను బ్లాక్‌లుగా వర్గీకరించి టెండర్లు పిలవాలని ఆదేశించారు.

ఇప్పటికే ఇరిగేషన్, మైనింగ్ అధికారుల సంయుక్త తనిఖీలో సుమారు ఆరు కోట్ల క్యూబిక్ మీటర్ల గ్రావెల్, మెటల్ నిల్వలను గుర్తించారని, వాటికి ప్రతి అయిదు కిలోమీటర్లకు ఒక ప్యాకేజీగా టెండర్లు పిలవాలని సూచించారు. ఏపీఎండీసీ ద్వారా ఈ టెండర్ల ప్రక్రియను వారం రోజుల్లో ప్రారంభించాలని అన్నారు. మొత్తం 300 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రావెల్‌ను విక్రయించడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చాలని అన్నారు. మేజర్, మైనర్ మినరల్స్‌కు సంబంధించిన మైనింగ్‌ను కూడా ఫస్ట్ కం ఫస్ట్ విధానంకు బదులుగా ఆక్షన్ విధానంను అమలు చేయడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని అన్నారు. దీనికి సంబంధించిన నిబంధనలను సమీక్షించాలని మైనింగ్ అధికారులకు సూచించారు. 

రెవెన్యూ బకాయిల వసూళ్లపై దృష్టి సారించాలి 
రాష్ట్రంలో మైనింగ్ శాఖ ద్వారా రావాల్సిన రెవెన్యూ బకాయిలు అవసరమైతే వన్ టైం సెటిల్ మెంట్ ద్వారా క్లియర్ చేయాలని అన్నారు. పెండింగ్‌లో ఉన్న మైనింగ్ దరఖాస్తులను నిబంధనలకు అనుగుణంగా అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు. అలాగే ఓఎన్జీసీ నుంచి మైనింగ్‌ శాఖకు రావాల్సిన రూ. 237 కోట్లను కూడా వసూలు చేయాలని సూచించారు. రాష్ట్రంలో మైనింగ్ శాఖ ఇచ్చిన అనుమతులకు మించి అక్రమంగా మైనింగ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్న క్వారీలపై వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే విజిలెన్స్ విచారణలో అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్న సంస్థల అనుమతులను శాశ్వతంగా రద్దు చేయడంతో పాటు అక్రమ మైనింగ్‌పై పెనాల్టీలను కూడా విధించాలని అన్నారు.

మహాచెక్ పేరుతో గతంలో జరిగిన తనిఖీల్లో అనధికారికంగా జరిగిన మైనింగ్‌కు పెనాల్టీలను వసూలు చేయాలని సూచించారు. రాష్ట్రంలో కొత్త మైనింగ్ ప్రాంతాలను గుర్తించేందుకు నిర్ధేశించిన 'మెరిట్' సంస్థ పనితీరు పట్ల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అపారమైన ఖనిజ నిల్వలు ఉన్నాయని, వాటిని గుర్తించడం, మైనింగ్ కోసం ఔత్సాహిక సంస్థలకు సమాచారంను అందించడం వంటి కార్యక్రమాల్లో మెరిట్ మరింత చొరవ తీసుకోవాలని సూచించారు. చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రయోగాత్మకంగా మైనింగ్ లీజుల వసూళ్లను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలనే నిర్ణయంలో భాగంగా అమలుకు సంబంధించిన విధివిధానాలపై చర్చించారు. ప్రతి క్వారీ నుంచి లీజులు వసూలు చేసేందుకు రూపొందించిన ఆన్ లైన్ పోర్టల్స్‌ను పరిశీలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement