విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: పై-లీన్ రూపంలో పెనుగండం పొంచి ఉంది... తుఫాన్ తీరప్రాంత మండలాల్లో తీవ్ర అలజడి రేపుతోంది. జిల్లాలో మిగిలిన మండలాల్లో ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. సంద్రం పోటెత్తుతోంది. పెద్ద ఎత్తున అలలు ఎగసిపడుతూ తీరంలో ఉన్న గ్రామాల వైపు దూసుకువస్తున్నాయి. పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లోని మత్స్యకార గ్రామాల వద్ద 30 నుంచి 50 మీటర్ల మేర కెరటాలు ముందుకు రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే వలలు, బోట్లనుగ్రామాల్లోకి తరలించారు. 1996 సంవత్సరంలో తుఫాన్ వచ్చినప్పుడు సముద్రాన్ని ఇంత భీకరంగా చూశామని మళ్లీ ఇప్పుడు పెద్ద ఎత్తున అలలు ఎగసిపడుతున్నాయని మత్స్య కారులు ఆందోళన చెందుతున్నారు.
పూసపాటిరేగ మండలం కోనాడ, చింతపల్లి, తిమ్మయ్యపాలెం, తిప్పలవలసల వద్ద సముద్రం 30 అడుగులు ముందుకు వచ్చింది. భోగాపురం మండలం ముక్కాంలో 50 అడుగుల మేర ముందుకు వచ్చింది. శుక్రవారం రాత్రి నుంచి ఈదురుగాలు లు భారీగా వీస్తున్నాయి. తుఫాన్ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లాలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. రెవెన్యూ, వైద్య, విద్యుత్, పౌరసరఫరాలు, వ్యవసాయం, మత్స్య, పశుసంవర్థక శాఖ అధికారులు తమ సిబ్బందిని సన్నద్ధం చేశారు. ముందుజాగ్రత్త చర్యలు, సహా యక చర్యలు చేపట్టేందుకు తగిన ఏర్పాట్లు చేశారు.
ఇప్పటికే అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటూ వేటకు వెళ్లిన పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లోని మత్స్యకారులను వెనక్కి రప్పించారు. కలెక్టర్ కాంతిలాల్ దండే శుక్రవారం సాయంత్రం భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో అధికారులతో కలిసి పర్యటించా రు. అక్కడ పరిస్థితులు సమీక్షించారు. ఒడిశా లో భారీ వర్షాలు కురిస్తే పార్వతీపురం, కొమరాడ మండలాలకు నాగవళి వరద ముప్పు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు ఐటీడీఏ పీఓ రజిత్‌కుమార్ సైనీ లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. మండల కేంద్రాల్లో తహశీల్దార్, ఎంపీడీఓలు వీఆర్‌ఓల తో సమావేశాలు నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. పునరావాసానికి ఏర్పాట్లు
తుఫాన్ కారణంగా ఇబ్బందిపడే లోతట్టు ప్రాంతాల ప్రజలకు పునరావాసం, భోజన సదుపాయాలు కల్పించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. చాలా తుఫాన్ షెల్టర్లు శిథిలావస్థకు చేరుకోవడంతో సమీపంలో ఉన్న హాస్టళ్లకు బాధితులను తరలించాలని కలెక్టర్ ఆదేశించారు. భోగాపురం ఎంఎల్‌ఎస్ పాయింట్‌లో వంద మెట్రిక్ టన్నుల బియ్యం, 20 టన్నుల పంచదార, 17 టన్నుల కందిపప్పు, పామాయిల్ ఏడు వేల ప్యాకెట్లు, చింతపండు ఐదు వేల ప్యాకెట్లు, గోధుమ పిండి పది వేల ప్యాకెట్లు, ఉప్పు ఎనిమిది వేల ప్యాకెట్లు, కారం ఐదు వేల ప్యాకెట్లను సిద్ధం చేశారు. పార్వతీపురం ఎంఎల్‌ఎస్ పాయింట్‌లో 600 మెట్రిక్ టన్నుల బియ్యం, పామాయిల్ 17 వేల ప్యాకెట్లు, కందిపప్పు 17వేల ప్యాకెట్లు, గోధుమపిండి పది వేల ప్యాకెట్లతో పాటు ఇతర సరుకులు అందుబాటులో ఉంచారు. మరమ్మతులకు ఆరు బృందాలు
విద్యుత్ శాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. తీరప్రాంత మండలాలైన పూసపాటిరేగ, భోగాపురం పరిధిలో ఉన్న విద్యుత్ సబ్‌స్టే„షన్ల పరిధిలో తక్షణ మరమ్మతులు చేసేందుకు ఆరు ప్రత్యేక బృందాలను పంపించారు. 50 విద్యుత్ స్తంభాలను అక్కడికి చేర్చారు. అవసరమైన సామగ్రిని సమకూర్చారు. ఈ రెండు మండలాల్లో 20 గ్రామాల పరిధిలో ఏర్పాటు చేసిన ఏడు బేక్ క్యాంప్‌ల వద్ద వైద్యశాఖ మందులను సిద్ధం చేసింది. శనివారం మరింత ఉద్ధృతంగా గాలులు వీయడంతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 175 నుంచి 185 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని మొదట వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే ప్రస్తుతం హెచ్చరికల ప్రకారం గంటకు 200 నుంచి 230 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచి బీభత్సం సృష్టించనున్నాయి. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. ఈదురు గాలుల బీభత్సానికి చెట్లతో పాటూ పాకలు, విద్యుత్ స్తంభాలు కూలే ప్రమాదం ఉంది. 12వ తేదీ రాత్రి వరకూ పై-లీన్ ప్రభావం ఉంటుంది. 13 సాయంత్రం నుంచి ఈ ప్రభావం తగ్గనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
కంట్రోల్ రూం ఏర్పాటు.... కలెక్టరేట్‌తో పాటూ డివిజన్ కేంద్రాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. 1077 టోల్ ఫ్రీ నంబర్‌తో పాటూ కలెక్టరేట్‌లో 08922-236947, విజయనగరం డివిజన్‌లో 08922-276886, పార్వతీపురం డివిజన్‌లో 08963-221006 నంబర్లను అందుబాటులోకి తెచ్చారు. అలాగే అన్ని మండలాల అధికారులను అప్రమత్తం చేశారు. బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. తీర ప్రాంతాల్లో ఉన్న 20 సెల్‌టవర్లలో ఎటువంటి అంతరాయం లేకుండా పని చేసే విధంగా చర్యలు చేపట్టడానికి 50 మంది సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యూఎస్, విద్యుత్ తదితర శాఖల ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ అప్రమత్తం చేశారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించటానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, మత్స్యశాఖ, పశుసంవర్థకశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
జిల్లాకు చేరుకున్న కేంద్ర విపత్తుల బృందం...
ఎటువంటి పరిస్థితులు తలెత్తినా సమర్థంగా ఎదుర్కోవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా 40 మందితో కూడిన జాతీయ విపత్తు రక్షణ బృందాన్ని జిల్లాకు పంపింది. వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించడంతో పాటూ సహాయక కార్యక్రమాల్లో వీరు పాల్గొంటారు. ప్రత్యేకంగా నాలుగు పడవలను తమ వెంట తీసుకొనివచ్చారు.
రైతన్నలో ఆందోళన....
వర్షాలు కురుస్తాయని ఆనందంలో ఉన్న రైతులకు పై-లీన్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రైతుల్లో ఆందోళన మొదలైంది. గాలుల బీభత్సం సృష్టిస్తే వరి, అరటి పంటలు ఒరిగిపోతాయని ఆవేదన చెందుతున్నారు. తీర ప్రాంతాల్లో 25 వేల మత్స్యకార కుటుంబాలు జిల్లాలో పూసపాటిరేగ మండలంలోని చింతపల్లి నుంచి భోగాపురం మండలంలోని చేపలకంచేరు వరకు 28 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో మొత్తం 25 వేల మత్స్యకార కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఈ కుటుంబాల నుంచి చేపల వేటకు వెళ్లే వారు 11 వేల వరకు ఉంటారని అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. వీరందరికీ మొత్తం 704 పడవులు ఉండగా అందులో ఫైబర్ బోట్లు 176, సంప్రదాయ పడవలు 528 ఉన్నాయి. తీర ప్రాంతం వెంబడి 33 తుఫాన్ షెల్టర్లు ఉన్నప్పటికీ వాటిలో కేవలం 13 మాత్రమే వినియోగంలో ఉన్నాయి. ఈ నేపథ్యం లో ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం అధికారులు చర్యలు చేపట్టారు.
సమ్మె కొనసాగిస్తూనే... సమైక్యాంధ్ర కోసం రెవెన్యూ, ఇతర శాఖల ఉద్యోగులు సమ్మె కొనసాగిస్తూనే విధులకు హాజరవుతున్నారు. తొలుత తీరప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగులు విధు ల్లో చేరారు. మిగిలిన వారు పరిస్థితులను బట్టి విధులు నిర్వహిస్తారని అసోసియేషన్ నాయకులు స్పష్టం చేస్తున్నారు.
పై-లీన్ పడగ: పోటెత్తిన సంద్రం
Published Sat, Oct 12 2013 3:17 AM | Last Updated on Fri, Sep 1 2017 11:34 PM
Advertisement