సాక్షి ప్రతినిధి, తిరుపతి : తిరుపతి సమీపంలోని తిరుచానూరు విద్యుత్ సబ్‌స్టేషన్‌కు అవసరమైన సిబ్బంది నియామకాల్లో అక్రమాలు జరుగుతున్నాయి. అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగులను నియమించుకునే విషయంలో కొందరు అధికారులు లక్షల్లో నగదు దండుకుంటున్నారు. ఉద్యోగాల కోసం తిరిగే నిరుద్యోగుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని పోస్టుకో రేటు నిర్ణయించి ముందే ఆయా ఉద్యోగాలను అమ్మేస్తున్నారు. కాంట్రాక్టర్ల ద్వారా భర్తీ చేసుకోవాల్సిన అవుట్ సోర్సింగ్ పోస్టులకు వీరే నియామకాలు చేపడుతున్నారు. తద్వారా అన్ని అర్హతలున్న స్థానిక అభ్యర్థులకు నష్టం వాటిల్లే అవకాశాలున్నాయి. తాజాగా లభించిన సమాచారం మేరకు తిరుచానూరులోని తోలప్పగార్డెన్ ఏరియాలో దక్షిణ మండల విద్యుత్ పంపిణీ సంస్థ సెమీ ఇండోర్ విద్యుత్ స్టేడియం నిర్మాణ పనులను చేపట్టింది. మరో నెల రోజుల్లో దీని నిర్మాణం పూర్తవుతుంది. ఇది పూర్తయ్యే లోగా ఇక్కడ పనిచేసేందుకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను సమకూర్చుకోవాల్సి ఉంది. సిబ్బందిని సమకూర్చే ఏజెన్సీని టెండరు ప్రక్రియ ద్వారా అర్హత గల కాంట్రాక్టర్‌కు అప్పగించాల్సి ఉంది. కాంట్రాక్టు ఏజెన్సీ ద్వారా మాత్రమే అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను తీసుకోవాల్సి ఉంది.
తిరుచానూరు సబ్ స్టేషన్ కోసం 4 గురు షిప్ట్ ఆపరేటర్లు, ఇద్దరు వాచ్‌మెన్లు అవసరమై ఉంది. వీరితో పాటు మరో రెండు పోస్టులకు ఇక్కడ పనిచేసే కొందరు విద్యుత్ అధికారులు బేరాలు పెట్టారని సమాచారం. షిప్ట్ ఆపరేటర్ పోస్టును రూ.5 నుంచి రూ.7 లక్షలకు అమ్మేసుకుంటున్నట్లు విశ్వసనీయంగా తెల్సింది. ఇద్దరు అధికారులు కీలకంగా మారి టెండర్లు పిలవకుండానే, కాంట్రాక్టు ఏజెన్సీ నియామకం జరగకుండానే ఉద్యోగాలను అమ్మేసుకుంటున్నారని తెలుస్తోంది. ఇక్కడ పనిచేసే ఓ కీలక అధికారి కనుసన్నల్లో ఈ తతంగమంతా నడుస్తోంది. దీనికితోడు అధికార పార్టీ ముఖ్య నేతలు, మంత్రుల సిఫారసులకు పెద్దపీట వేశారు. వాస్తవానికి ఈ పోస్టులను స్థానిక అభ్యర్థులకే కేటాయించాలి. అర్హతలున్న స్థానికులకే ముందు ప్రాధాన్యత ఇచ్చి ఆపైన ఇతర ప్రాంతాల వారి దరఖాస్తులను పరిశీలించాలి. అయితే తిరుచానూరుకు చెందిన ఐటీఐ, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివిన అభ్యర్థులు పోస్టుల కోసం తిరుగుతున్నా, వీరి పేర్లను పక్కనపెట్టి ఉద్యోగాలన్నీ సీఎం సొంత గ్రామమైన నారావారిపల్లెకు చెందిన యువతకు కట్టబెడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాజకీయ సిఫారసులతో పాటు లక్షల్లో నగదు చేతులు మారుతుంటే అర్హత గల స్థానిక యువకుల సంగతేమిటని వీరు ప్రశ్నిస్తున్నారు. పోస్టుల భర్తీలో తేడాలు జరిగితే సబ్ స్టేషన్ ముందే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని నిరుద్యోగులు పలువురు హెచ్చరిస్తున్నారు. ఉద్యోగానికో రేటు పెట్టి అమ్మేసుకుంటున్న వైనంపై సీఎండీకి వివరిస్తామని స్పష్టం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment