గజ్వేల్, న్యూస్‌లైన్: తెలంగాణ జిల్లాలకు వరప్రదాయినిగా భావిస్తున్న ‘ప్రాణహిత-చెవేళ్ల’ ఎత్తిపోతల పథకం కోసం భూములిచ్చి ఏడాదైనా పరిహారం అందక రైతులు సతమతమవుతున్నారు. అటు పరిహారం అందక.. ఇటు ఆ భూముల్లో సాగు చేసుకోలేక అవస్థలు పడుతున్నారు. అధికారుల తప్పిదం కారణంగా బాధిత రైతులు ఏడాది కాలంగా గోసను అనుభవిస్తున్నారు. ఒకే భూమి రెవెన్యూ కార్యాలయంలో ఓ విధంగా, ల్యాండ్ రికార్డు కార్యాలయంలో మరో విధంగా నమోదై ఉండడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఏడాదైనా ఈ సమస్యను పరిష్కరించకపోవడంతో రైతులు రోడ్డున పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా పరిస్థితి ఇలాగే ఉంది. ఒక్క గజ్వేల్ మండలం దాతర్‌పల్లిలోనే 35 ఎకరాల్లో ఈ సమస్య ఉత్పన్నమైంది.
ప్రాణహిత ఎత్తిపోతల పథకం కోసం గజ్వేల్ మండలం దాతర్‌పల్లిలో 87 ఎకరాల భూమిని సేకరించారు. మెరుగైన పరిహారం ఇస్తామని చెప్పి డబ్బులు ముట్టజెప్పకుండానే భూములను స్వాధీనం చేసుకున్నారు. ధర నిర్ణయం విషయంలో నెలల తరబడి జాప్యం కొనసాగింది. చివరకు ఎకరాకు రూ.4.35 లక్షల నుంచి రూ.4.79 లక్షల వరకు ధర నిర్ణయించారు. ఈ ధర ప్రకారం గ్రామంలో సేకరించిన 87 ఎకరాల్లో 52 ఎకరాలకు మాత్రమే రెండు నెలల క్రితం పరిహారాన్ని అందజేశారు. మిగిలిన 35 ఎకరాలు (సర్వే నంబర్లు 42, 129) గజ్వేల్ తహశీల్ కార్యాలయ రికార్డుల్లో పట్టాభూములుగా... ల్యాండ్ రెవెన్యూ కార్యాలయ రికార్డుల్లో
ప్రభుత్వ భూములుగా నమోదై ఉంది. సదరు భూములకు సంబంధించి పరిహారం చెల్లించకుండా ఆ విషయాన్ని కలెక్టర్‌కు నివేదించారు. ఇవి ఏ రకమైన భూములో తేలిన తర్వాతే పరిహారం ఇచ్చే అవకాశముండగా ఈ వ్యవహారంలో నెలల తరబడి జాప్యం జరుగుతోంది.
ఫలితంగా ఏడాది క్రితం భూములను స్వాధీన పరిచిన రైతులు పంటలు కోల్పోయి, చివరకు పరిహారం అందక అల్లాడుతున్నారు. ఇలాంటి సమస్య ఒక్క దాతర్‌పల్లిలోనే కాదు జిల్లా వ్యాప్తంగా నెలకొంది. ఈ పథకం కోసం జిల్లా పరిధిలో 27,934 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా ఇప్పటివరకు సుమారు మూడు వేల ఎకరాలను కూడా సేకరించలేకపోయారు.
ఏడాది నుంచి ఎదురు చూస్తున్న..
దాతర్‌పల్లిలోని 42 సర్వే నంబర్‌లో 8 ఎకరాల 36 గుంటల భూమిని ప్రాణహిత పథకం కోసం అధికారులు తీసుకున్నారు. రెవెన్యూ కార్యాలయంలో పట్టా భూమి అని ఉంటే సంగారెడ్డిలోని ల్యాండ్ రికార్డ్ కార్యాలయ రికార్డుల్లో పీపీ భూమి అని ఉందట. ఈ సాకుతో ఏడాది కాలంగా పరిహారం ఇస్తలేరు. పరిహారం ఇచ్చేదాక పంటలైనా సాగు చేద్దామంటే అధికారులు ఒప్పుకుంటలేరు. ఈ సమస్య ఎప్పుడు తెగుతదో తెలుస్తలేదు.
- జూపల్లి సత్యనారాయణ, రైతు దాతర్‌పల్లి
త్వరలోనే పరిహారం..
దాతర్‌పల్లి గ్రామంలో 42, 129వ సర్వే నంబర్లలో నష్టపరిహారం నిలిచిపోయింది. ఈ సర్వే నంబర్లలోని భూములు ప్రభుత్వానివా? పట్టా భూములా? అనేది తేలిపోగానే పరిహారం పంపిణీకి చర్యలు చేపడతాం. తొందర్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేస్తాం.
- చంద్రమౌళి, ప్రాణహిత-చెవేళ్ల పథకం డిప్యూటీ తహశీల్దార్
రైతన్న గోస ఆదుకోని ‘ప్రాణహిత’
Published Mon, Aug 26 2013 3:42 AM | Last Updated on Fri, Sep 1 2017 10:07 PM
Advertisement
Advertisement