చిన్న చింతకుంట మండలం వడ్డేమాన్ గ్రామానికి చెందిన కుర్వ పెద్ద సాయులు 1994లో అప్పంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రుణం తీసుకున్నాడు.ఆయన 2005లో మృతి చెందాడు. అప్పట్లో రైతులను ఆదుకునే ఉద్దేశంతో మహానేత వైఎస్ ప్రకటించిన రుణ మాఫీలో అప్పు తీరిపోయిందని కుటుంబ సభ్యులు భావించారు. ట్విస్ట్ ఏమిటంటే సాయులు 2005లో మృతి చెందితే ఆయన పేరిట 2007లో రుణాలు రెన్యూవల్ చేసినట్లు రికార్డుల్లో పొందుపరచారు.
అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలుతో పాటు వడ్డీ కలిపి రూ.1,25,682లు చెల్లించాలని తాజాగా డిమాండ్ నోటీసు ఇచ్చారు. 2014 ఫిబ్రవరి 1వ తేదీలోపు రుణం చెల్లించాలని నోటీసులో పేర్కొన్నా సొసైటీ అధికారులు ఏమాత్రం సమయం ఇవ్వకుండా వెంటనే రూ.లక్ష చెల్లించాలని డిమాండ్ చేస్తూనే మరో వైపు ఇంటిలో ఉన్న బియ్యం బస్తాలు, వ్యవసాయానికి ఉపయోగించే పరికరాలు అన్నీ బయటకు వేయడంతో ఏమి చేయాలో దిక్కు తెలియక పెద్ద సాయులు భార్య బసమ్మ కన్నీరు మున్నీరవుతోంది. అధికారుల తీరుకు గుండెలు బాదుకుంటోంది.
మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: ఇదీ జిల్లాలో సొసైటీ రుణం తీసుకున్న పలువురి రైతుల దుస్థితి. ఒక్క సాయులు కథే కాదు పలువురు అన్నదాతలకు ఎదురవుతున్న రుణ బెడద. రైతుల సంక్షేమం కోసం ఏర్పాటైన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు వారికి ఆసరాగా ఉండడం మాట మరుస్తున్నాయి .
రైతులు తిరిగి సకాలంలో డబ్బులు చెల్లించినా అవి బ్యాంకుల్లో జమ చేయడంలో అధికారులు పారదర్శకత పాటించడం లేదు. జిల్లాలో ఉన్న సహకార సంఘాల్లో 7.64 లక్షల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. రుణాలు తీసుకున్న ప్రతీ రైతునూ సభ్యునిగా గుర్తించి ఒక్కో రైతు నుంచి రూ. 300ల ప్రకారం మూలధనం కూడా వసూలు చేశారు. రైతు శ్రేయస్సే పరమావధిగా పని చేస్తున్నట్లు అధికారులు, పాలకులు పైకి గొప్పలు చెబుతున్నా అంతర్గతంగా రైతులకు జరిగే నష్టాన్ని మాత్రం వారు గుర్తించలేకపోతున్నారు. సొసైటీల్లో పని చేస్తున్న కొందరు కార్యదర్శులు చేతివాటం ప్రదర్శిస్తుండటంతో రైతులు రుణ మొత్తం తిరిగి చెల్లిస్తున్నా బ్యాంకుల్లో మాత్రం జమ కావడం లేదు.
ఆదుకునేందుకు ఉద్దేశించిన పథకం...
పంటలు సరిగా పండక పోవడంతో అన్నదాతలు పడుతున్న అవస్థలను చూసి వాటి కోసం చేసిన అప్పులు తీర్చే పరిస్థితినుంచి వారిని గట్టెంకించాలని అప్పట్లో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రుణ మాఫీ పథకాలన్ని అమలు చేశారు. అయితే సొసైటీల్లో మాత్రం 1994 నుంచి తీసుకున్న రుణాలు కూడా ఈ పథకం కింద రద్దు చేయకుండా ఇంకా అప్పుగానే చూపుతూ అందుకు చక్ర వడ్డీ కలుపుతూ అధికారులు రైతులకు నోటీసులు జారీ చేస్తున్నారు. మాఫీ అయిన రైతులకు ఒక సర్టిఫికేట్ ఇవ్వాలని ప్రభుత్వం అప్పట్లో ఉత్తర్వులు ఇచ్చినా బ్యాంకు అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో చాలా మంది రైతులు తాము తీసుకున్న రుణం మాఫీ అయినట్లేనని భావిస్తున్న తరుణంలో అసలుతో పాటు వడ్డీ చెల్లించాలంటూ సొసైటీల నుంచి కార్యదర్శులు డిమాండ్ నోటీసు జారీ చేస్తుండటంతో ఏమి చేయాలో తెలియక రైతులు కలవరపడుతున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో రుణం తీసుకున్న వారు ఏటా డబ్బు జమ చేస్తున్నా కనీసం డబ్బు చెల్లించినట్లు కొందరు కార్యదర్శులు రసీదులు కూడా ఇవ్వడం లేదు. తాజాగా వన్‌టైం సెటిల్‌మెంట్ పేరుతో జిల్లాలో 20 వేల మంది రైతులకు పైగా నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది.
రుణ మాఫీలో అప్పు తీరిపోయిందన్నారు
రుణ మాఫీలో అప్పు తీరిపోయిందని చెప్పారు. తీరా చూస్తే గుండె పగిలే విధంగా నెల కిందట రూ. 1.25 లక్షలు అప్పు వుందంటూ నోటీసు ఇచ్చారు. ఆ వెంటనే అప్పు చెల్లించాలంటూ ఇం టిలో ఉన్న బియ్యం బస్తాలు సైతం బయటకు వేశారు. ఏమి చేయాలో దిక్కు తెలియక కొంత సమయం ఇవ్వాలని వేడుకున్నా.
- బసమ్మ, వడ్డెమాన్, చిన్న చింతకుంట మండలం
రుణ మాఫీ వర్తించని వారికే నోటీసులు
రుణ మాఫీ వర్తించని రైతులకు మాత్రమే నోటీసులు ఇస్తున్నాం. 2009 జూలై 1వ తేదీ నాటికి వాయిదా మీరిన బకాయిలకు మాత్రం అసలుతో పాటు వడ్డీ చెల్లించాలని రైతులకు నోటీసులు జారీ చేశాం. వారికి ఏమైనా అనుమానాలుంటే మా దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తాం.
- దామోదర్‌రెడ్డి, డీసీసీబీ సీఈఓ
రుణం...కొత్త ‘రణం’
Published Wed, Dec 25 2013 3:33 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement