గుండె ఆపరేషన్‌లు అయిన చిన్నారులతో హీరో మహేష్‌బాబు, పక్కన వైద్యుల బృందం
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ ఆంధ్రా హార్ట్ అండ్ బ్రెయిన్ ఇనిస్టిట్యూట్‌లో ఈ నెల 23 నుంచి నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో 14 మంది చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్ర చికిత్సలు నిర్వహించారు. హీలింగ్ లిటిల్ హార్ట్స్, యూకే చారిటీ వారి సహకారంతో పది మంది ఇంగ్లాండ్ వైద్యుల బృందం క్లిష్టతరమైన గుండె సమస్యలు ఉన్న చిన్నారులకు నూరుశాతం విజయవంతంగా సర్జరీలు నిర్వహించినట్లు ఆంధ్రాహాస్పటల్స్ పిడియాట్రిక్ చీఫ్ డాక్టర్ పీవీ రామారావు చెప్పారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆంధ్రా హార్ట్ అండ్ బ్రెయిన్ ఇనిస్టిట్యూట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డాక్టర్ పీవీ రామారావు మాట్లాడుతూ తమ హాస్పటల్స్‌లో 2015 డిసెంబరు నుంచి నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరాల ద్వారా ఇప్పటి వరకూ 300 మంది చిన్నారులకు విజయవంతంగా గుండె శస్త్ర చికిత్సలు ఉచితంగా నిర్వహించినట్లు తెలిపారు.
ఈ శిబిరంలో అత్యంత క్లిష్టమైన గుండె సమస్యలకు విజయవంతంగా శస్త్ర చికిత్సలు నిర్వహించినట్లు రామారావు చెప్పారు. యూకే హాస్పటల్స్, లెస్టర్ రాయల్ ఇంపమరీ, గ్రేట్‌హార్మోన్ స్ట్రీట్ హాస్పటల్ లండన్, రాయల్ మాంచెస్టర్ చిల్డ్రన్స్ హాస్పటల్ వంటి ప్రముఖ హాస్పటల్స్ నుంచి వైద్యులు ప్రత్యేక శిబిరాల్లో పాల్గొని శస్త్ర చికిత్సలు నిర్వహించారన్నారు. సమావేశంలో యూకే వైద్యులు డాక్టర్ ఒప్పిడో గిడో, డాక్టర్ సెర్రావు ఆండ్రియా, కార్వే లైనుసయమారీ, స్కేర్పాటి క్యాటీలోసిదే, బీచార్డ్ ఎలిజెబెత్ జీన్, మేరీ క్యాథలీన్, గోపిశెట్టి షర్మిల, ఆంధ్రా హాస్పటల్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విక్రమ్ కుడుములు, కార్డియాలజిస్ట్ డాక్టర్ జె.శ్రీమన్నారాయణ, కార్డియోథోరాసిక్ సర్జన్ డాక్టర్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు.
హీరో మహేష్‌బాబు అభినందనలు...
నవ్యాంధ్రలో గుండెజబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్న ఆంధ్ర హాస్పటల్స్, యూకే వైద్యుల బృందాన్ని సినీహీరో మహేష్‌బాబు అభినందించారు. యూకే వైద్యులతోపాటు, శస్త్ర చికిత్సలు చేయించుకున్న చిన్నారులు, తల్లిదండ్రులు శుక్రవారం హోటల్ డీవీ మానర్‌లో మహేష్‌బాబును కలిశారు. మహేష్‌బాబు మట్లాడుతూ ఇంత మంది చిన్నారులకు నూరుశాతం సక్సెస్ రేటుతో సర్జరీలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. గుండెజబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు సేవలు అందించే విషయంలో తమవంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment