పుర పోరుకు సై
Published Sun, Mar 2 2014 4:41 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్: పురపాలక పోరుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా న్యాయపరమైన ఇబ్బం దులు లేని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో తక్షణం ఎన్నికలు నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు, హైకోర్టులు ఆదేశాలు జారీ చేయడంతో మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు ఎన్నికల ప్రక్రియకు సమాయత్తమవుతున్నారు. ఈమేరకు శనివారం మేయర్లు, చైర్‌పర్సన్లు, వార్డు సభ్యులకు రిజర్వేషన్లు ప్రకటించారు. జిల్లాలో ఆరు మున్సిపాలిటీలు ఉండగా శ్రీకాకుళం, పలాస మున్సిపల్ చైర్మన్ పదవులను అన్‌రిజర్వుడ్ (జనరల్) కేటిగిరీకి కేటాయించారు. ఆమదాలవలస, ఇచ్ఛాపురం, రాజాం, పాలకొండ చైర్మన్ పదవులను బీసీ(మహిళ)లకు రిజర్వ్ చేశారు. అలాగే అన్ని మున్సిపాలిటీల్లోని వార్డు పదవులకు రిజర్వేషన్లు ప్రకటించారు.
కాగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిన నేపథ్యంలో మున్సిపల్ రిజర్వేషన్ల జాబితాను గవర్నర్ ఆమోదంతో ప్రకటించారు. ఇంతకుముందు ఖరారు చేసిన రిజర్వేషన్లనే దాదాపుగా మార్పుల్లేకుండా ఇప్పుడు ఆమోదించారు. శ్రీకాకుళం మున్సిపాలిటీ, రాజాం నగర పంచాయతీలకు కూడా రిజర్వేషన్లు ప్రకటించినప్పటికీ ఈ రెండు చోట్ల ఎన్నికలు నిర్వహించడం అనుమానమే. ఈ దఫా వీటికి ఎన్నికలు జరగడంలేదని మున్సిపల్ ఉన్నతాధికారులు అంటున్నారు. ఈ రెండు చోట్ల సమీప పంచాయతీల విలీన ప్రక్రియపై అభ్యంతరాలతో హైకోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. ఈ కేసులు పరిష్కారమైన తర్వాతే మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతాయంటున్నారు. రాజకీయంగా కీలకమైన రాజాం పట్టణానికి 2005లో నగర పంచాయతీ హోదా కల్పించారు. అప్పటినుంచి ఒక్కసారి కూడా ఎన్నికలు జరగక పోవడం విశేషం. ఇబ్బందులున్న ఇటువంటి మున్సిపాల్టీల్లో రెండో దపా ఎన్నికలు నిర్వహించే వీలుందని తెలుస్తోంది.
Advertisement
Advertisement