సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో 10.83లక్షల తెలుపు, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులు, రేషన్ కూపన్లు ఉన్నాయి. అయితే ఈ రేషన్ కార్డుల్లో ఉన్న వివరాల ఆధారంగా ఆయా వ్యక్తుల ఆధార్ వివరాలను ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో పొందుపర్చాలి. అయితే రేషన్ డీలర్ల ద్వారా ఆధార్ వివరాలను సేకరించిన పౌరసరఫరాల శాఖ అధికారులు వాటిని సాఫ్ట్‌వేర్‌లో నిక్షిప్తం చేసే పనిలో నిమగ్నమయ్యారు.
అయితే తాజాగా రేషన్ కూపన్లుకు సంబంధించి ఫొటోలు అప్‌లోడ్ చేయని వారికి కోటా కత్తిరించింది.
దీంతో 14వేల మంది రేషన్ కూపన్‌దారులకు ఈనెలలో బియ్యం సరఫరా నిలిచిపోయినట్లే. అదేవిధంగా జిల్లాలోని పట్టణ ప్రాంతంలో రేషన్ కార్డులతో ఆధార్ లింకు కుదరని వారికి తాజాగా రేషన్ సరుకుల కోటాపై కోత పెట్టింది. అయితే కార్డులో ఉన్న సభ్యుల్లో కనీసం ఒక్కరు కూడా ఆధార్ వివరాలను సమర్పించకుంటే.. అలాంటి కార్డుల వివరాలను ఏకంగా కీ రిజిస్టర్ నుంచి తొలగించారు. ఈలెక్కన దాదాపు 36వేల కార్డులు బోగస్ జాబితాలోకి చేరాయి. మొత్తమ్మీద 50వేల రేషన్ కార్డుదారులకు సంబంధించి ఈనెలలో వెయ్యి మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం సరఫరాను ప్రభుత్వం నిలిపివేసింది. ఈ మేరకు సరుకును రేషన్ డీలర్లకు చేరవేసింది.
సాధారణంగా విడుదల చేసే కోటాలో కోత విధించిన విషయాన్ని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి సంక్షిప్త సమాచారం ద్వారా తహసీల్దార్లకు పంపించారు. అదేవిధంగా ఈ-మెయిల్ ద్వారా పూర్తిస్థాయి సమాచారాన్ని చేరవేశారు. అయితే రేషన్ వివరాలను ఆధార్‌తో అనుసంధానం చేస్తే.. ఆయా కార్డులను తిరిగి పునరుద్ధరించనున్నట్లు అధికారులు చెబుతున్నా.. అది అంత సులువైన విషయం కాదని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
త్వరలో అంద రికీ..
ప్రస్తుతం రేషన్ కూపన్లు, పట్టణ ప్రాంతాల్లోని వారికి పరిమితం చేసిన అనుసంధాన ప్రక్రియను ప్రభుత్వం త్వరలో జిల్లాలోని కార్డుదారులందరికీ వర్తింపజేయనుంది. ఇందులో భాగంగా జిల్లాలోని 10.33లక్షల కార్డుల వివరాలను ఆధార్ కార్డు సంఖ్యతో అనుసంధానం చేయాలి. అయితే ఇప్పటివరకు కేవలం 60శాతం కార్డులకు సంబంధించి ఆధార్ వివరాలతో అనుసంధానమైనట్లు పౌరసరఫరాల శాఖ గణాంకాలు చెబుతుండడం గమనార్హం.
‘లింకు’ చేయలేదా.. రేషన్ గోవిందా
Published Fri, Feb 28 2014 11:26 PM | Last Updated on Wed, Jul 10 2019 8:02 PM
Advertisement